- గత పాలకుల పాపాల్ని కడిగి రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన
- 16 లక్షల ఎకరాలు 22(ఎ) జాబితా నుంచి తొలగింపు
- రీ సర్వే 2.0తో రాష్ర్టంలో భూ వివాదాలన్నీ పరిష్కారం
- ప్రతి వారం ప్రజల మధ్యలోనే ఉంటున్నా
- పి.గన్నవరం ‘మీ భూమి-మీ హక్కు’ గ్రామసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- ఈపీడీసీఎల్ చేపట్టిన విద్యుత్ గ్రిడ్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన
పి.గన్నవరం (చైతన్యరథం): సంక్షేమం, అభివృద్ధి,
సుపరిపాలనే మూల మంత్రాలుగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ప్రతి వారమూ ప్రజల మధ్యలోనే ఉంటున్నానని వెల్లడించారు. రాష్ట్ర సచివాలయానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రజల జీవితాల్లో వెలుగు వచ్చేలా చేయడమే అసలైన సుపరిపాలన అని, దానికి కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం పండువారిపేటలో బుధవారం నిర్వహించిన మీ భూమి-మీహక్కు గ్రామసభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ప్రతి నెలలోనూ వీలైనన్నిసార్లు ప్రజల మధ్యకు వచ్చి బాగోగులు తెలుసుకుంటున్నానన్నారు. ప్రతినెలా మొదటి తేదీనే పేదల సేవలో ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్ అందిస్తూ ప్రజల్ని కలుస్తూ వారి కష్టసుఖాలను తెలుసుకుంటున్నానన్నారు. పీ4తో సామాజిక బాధ్యత కింద ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. అభివృద్ధి చేస్తేనే సంపద సృష్టికి ఆస్కారం ఉంటుందని, జీవన ప్రమాణాలు పెంచి అంతా గౌరవంగా జీవించేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
భూమికి భద్రత ఇచ్చేలా…
ప్రతినెలా 9వ తేదీనే మీ భూమి-మీ హక్కు కార్యక్రమానికి హాజరై రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామన్నారు. భూమిపై రైతులు, యజమానులకు హక్కులు కల్పించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత పాలకులు రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి వ్యవస్థను ధ్వంసం చేశారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు తెచ్చి ప్రజల భూముల్ని కాజేసే ప్రయత్నం చేశారని ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేసేశామని తెలిపారు. గత పాలకులు రీ సర్వే పేరుతో అనేక ఘోరాలు, నేరాలు, పాపాలు
చేశారని… పూర్వీకుల నుంచి వచ్చిన వారసత్వ భూములపై కూడా తమ ఫొటోలు వేసుకున్నారన్నారు. సర్వే రాళ్లపై బొమ్మలు వేసుకునే పిచ్చి ఏమిటో ఎవరికీ అర్థం కాలేదన్నారు. ఇష్టం లేని వ్యక్తుల భూముల్ని, ఆస్తుల్ని 22(ఎ) జాబితాలో చేర్చి ఇబ్బందులు పెట్టారన్నారు. అందుకే పటిష్టంగా రీ సర్వే ప్రక్రియను పూర్తి చేసి ఎక్కడా అవకతవకలు
లేకుండా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఇస్తున్నామన్నారు. ఈ-కేవైసీ, క్యూఆర్ కోడ్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీలాంటి భద్రతా ఫీచర్లను పెట్టి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నామన్నారు.
రెవెన్యూ సంస్కరణలు
భూమికి భద్రత ఇవ్వడమే కూటమి ప్రభుత్వ అజెండా అని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటిదాకా 8,234 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి 36 లక్షల రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చినట్టు సీఎం వివరించారు. వచ్చే మార్చినాటికి 8,582 గ్రామాల్లో 56 లక్షల పాస్ పుస్తకాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఆటో మ్యూటేషన్ సేవల్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. వారసత్వ భూముల విభజనలో స్టాంప్ డ్యూటీని రూ.వెయ్యికే పరిమితం చేశామని తద్వారా 1.25 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలిగిందన్నారు. తప్పులు సరిచేసి 16 లక్షల ఎకరాలను 22(ఎ) జాబితా నుంచి తొలగించి సమస్యను పరిష్కరించామని వివరించారు. శెట్టిపల్లి కంగుంది, వట్టిచెరుకూరు, ముదినేపల్లి లాంటిచోట్ల దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న 244 కీలక భూ సమస్యలకు విముక్తి కల్పించామన్నారు. కోనసీమ జిల్లాలోని మాచవరం, ముమ్మిడివరం, రామచంద్రపురంల్లో బ్రిటీష్ కాలంలో 1908
నుంచి 22(ఎ)1 కింద భూములు నిషేధంలో ఉన్నాయని, ఈ సమస్యను కూడా పరిష్కరిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. 56.37 ఎకరాల భూమిని 1,410 మందికి లబ్ధి కలిగేలా చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గొడ్డలి పార్టీ తారుమారు చేసిన రికార్డులను ప్రక్షాళన చేసి భూ సమస్యల్ని కొలిక్కి తెస్తున్నామని వివరించారు.
నిత్యం ప్రజల గురించే తపన నీటి భద్రతకు, భూమి భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి వెల్లడించారు.
రాష్ట్రంలో తీవ్రమైన ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ గోదావరి నుంచి ఈ ఏడాది
వెయ్యి టీఎంసీలకు పైగా నీరు సముద్రంలోకి వెళ్లిందన్నారు. ఆ నీటిని వినియోగించుకుంటే రాష్ట్రానికి ప్రయోజనం
కలిగేదన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో డయాఫ్రంవాల్ కొట్టుకుపోయిందని.. రాజకీయ కక్షతో కాంట్రాక్టర్ని మార్చడంతో పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైందని స్పష్టం చేశారు. 2024లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన మద్దతు ఢిల్లీలోనూ సంజీవనిగా పనిచేసిందని, రాష్ట్రానికి ఎక్కువ నిధులు తెచ్చుకోగలుగుతున్నట్టు వివరించారు. ప్రజలకు మరింతగా మేలుచేసే అంశంపై రెండు రోజుల పాటు కాంక్లేవ్ నిర్వహించి ఎమ్మెల్యేలకూ దిశానిర్దేశం చేశామన్నారు. జిల్లా కలెక్టర్లతోనూ సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయిలో పౌరసేవల్ని అందించే అంశంపై స్పష్టంగా. ఆదేశాలు ఇస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఇన్ని రకాల ఆలోచనలతో ప్రజలకు మేలు చేస్తుంటే గొడ్డలి పార్టీ నిత్యం
కుట్రలు పన్నుతూ అభివృద్ధిని అడ్డుకుంటోందని ముఖ్యమంత్రి ఆక్షేపించారు. అంతకు ముందు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఈపీడీసీఎల్ రూ.240 కోట్ల వ్యయంతో చేపట్టిన త్రీఫేజ్ కరెంటు ఇచ్చేలా గ్రిడ్ ఆధునికీకరణ
పనులకు సంబంధించి శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని
సత్యప్రసాద్, వాసంశెట్టి సుభాష్, ఎంపీ గంటి హరీష్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
















