అమరావతి (చైతన్యరథం): ‘ప్రజల కోసం నిలబడితే.. ప్రజలు మన వెంట నిలబడతారు. నిజం కోసం నిలబడితే… నిజమే మనల్ని నిలబెడుతుంది. ఇదీ నా నమ్మకం. మూడేళ్ల క్రితం కుట్రపూరితంగా జరిగిన ఓ పరిణామం నాలో ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరింత పెంచింది. గత ప్రభుత్వ హయాంలో ఇదే రోజున ఏ తప్పూ చేయని నన్ను అక్రమంగా అరెస్టు చేసి 53 రోజులు జైల్లో నిర్బంధించారు. నన్ను జైల్లో పెట్టగలిగారు కానీ నా స్థైర్యాన్ని దెబ్బకొట్టలేకపోయారు. వారి రాక్షస చర్యకు నేను కుంగిపోలేదు… లొంగిపోలేదు. దీనికి కారణం నాకు లభించిన ప్రజా మద్దతు. ఆ రోజు ప్రజాస్వామ్యం కోసం తెలుగు ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు నిలబడ్డారు.
నాటి నిర్బంధ పరిస్థితుల్లో ప్రజలు చూపిన సంఘీభావం, తెగువ నా జీవితంలో ఎన్నటికీ చెరగని జ్ఞాపకం. నన్ను నిర్బంధించగలిగారు… కానీ దేశ, విదేశాల్లో నా కోసం మీరెత్తిన గొంతును నొక్కలేకపోయారు. ప్రజాస్వామ్యాన్ని, న్యాయాన్ని, సత్యాన్ని గెలిపించేందుకు మీరు పోరాడారు. 2024 ఎన్నికల్లో ఓటు ద్వారా మరింత బలంగా ప్రజలు మద్దతు చాటారు. కక్ష సాధింపు రాజకీయాలను ఓడించి… నిజాన్ని గెలిపించి రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతను అప్పగించారు. నాటి ఘటనలను, పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ‘నిజం గెలిచింది’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం ప్రజల కోసం మరింత
కష్టపడాలనే సంకల్పాన్ని ఇంకా బలపరిచింది. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను. తెలుగు జాతిని నెం.1 చేయాలనే నా కలను మీ అందరి సహకారంతో నిజం చేస్తానని మాట ఇస్తున్నాను.’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. తనను అక్రమంగా అరెస్టు చేసి ఈ రోజు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
















