పి.గన్నవరం (చైతన్యరథం): వైసీపీ హయాంలో జరిగిన తన అక్రమ అరెస్టుకు మూడేళ్లు పూర్తయ్యాయంటూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. 48 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను పాటించిన విలువలు, పారదర్శకతను గుర్తుచేసుకుంటూనే… గత ప్రభుత్వ దుర్మార్గాలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నైజం, వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘మూడేళ్ల క్రితం (సెప్టెంబరు 9) ఏ తప్పూ చేయకపోయినా నన్ను అన్యాయంగా అరెస్టు చేశారు. 31 ఏళ్ల క్రితమే సీఎం అయిన నాకు ధన వ్యామోహం లేదు. రాజకీయాలపై కుటుంబం ఆధారపడకూడదనే 36ఏళ్ల క్రితమే ఫ్యామిలీ బిజినెస్ ప్రారంభించి నా సతీమణికి అప్పగించాను’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. నంద్యాలలో తనను అరెస్టు చేసే ముందు కారణాలు అడిగినా చెప్పలేదని, అర్ధరాత్రి జైలుకు తరలించారని గుర్తు చేశారు. అయితే నాటి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను కోర్టులు కొట్టేయడమే కాకుండా ఈడీ వంటి కేంద్ర సంస్థలు కూడా అందులో ఏమీ లేదని తేల్చాయని వివరించారు. తాను జైల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు హైదరాబాద్ ఐటీ టెకీలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎస్ఆర్ఆ్బలు రోడ్లపైకి వచ్చారని చెప్పారు.
పవన్కల్యాణ్ ఆంక్షలను సైతం లెక్కచేయకుండా వచ్చి తనకు పూర్తి సంఘీభావం తెలిపారని కొనియాడారు. అధికారంలోకి వచ్చాక ప్రతీకారం తీర్చుకోవడం తనకు ఒక్క నిమిషం పని అని, కానీ తాను సహనంతో ఉంటూ తెలుగుజాతి పునర్నిర్మాణం కోసమే పనిచేస్తు న్నానని సీఎం తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డిని గొడ్డలిపోటుతో కిరాతకంగా చంపి, నాటి సీఎంగా ఉన్న తనపై నిందలు మోపారని మండిపడ్డారు. సొంత పత్రికలో తప్పుడు వార్తలు రాయించి, చెల్లి సునీతను కూడా ఆ రోజుల్లో ఏమార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్య జరిగిన వెంటనే అసలు దోషులను అరెస్టు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే కేసును నీరుగార్చారని ధ్వజమెత్తారు. ‘వైఎస్సార్ తన కొడుకు వైఖరి పట్ల తీవ్రంగా బాధపడేవారు. కొడుకు బాధలు భరించలేక బెంగళూరులోనే ఉంచారని వైఎస్ సతీమణి విజయమ్మ నాటి సీఎం రోశయ్య వద్ద వాపోయారు. ఈ విషయా న్ని స్వయంగా రోశయ్యే నా వద్ద ప్రస్తావించారు” అని చంద్రబాబు పేర్కొన్నారు. నాటి నుంచి నేటి వరకు ఆస్తి కోసమే ప్రాధాన్యం ఇస్తూ, చివరికి కన్నతల్లిని, తోడబుట్టిన చెల్లిని కూడా కోర్టులకు ఈడ్చుతూ మోసం చేస్తున్న వ్యక్తులతో రాజకీయం చేయాల్సిన దుస్థితి వచ్చిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
14 డీఎస్సీలు పెట్టాను.. ఏడాదిలోనే ఉద్యోగాలు ఇచ్చాం
రాష్ట్రంలో 14 డీఎస్సీలు నిర్వహించి ఏడాదిలోనే ఉద్యోగాలు ఇచ్చామని సీఎం చంద్రబాబు అన్నారు. అయితే ఏడాది తర్వాత డీఎస్సీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిం చారు. డీఎస్సీ అంశంపై కొందరు వితండవాదం చేస్తున్నారని మండిపడ్డారు. కోర్టులు చీవాట్లు పెట్టినా వారికి బుద్ధి రావట్లేదని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు వెంటిలేటర్పై ఉన్న ఆంధ్రప్రదేశ్కు సంజీవనిగా మారిందని చంద్రబాబు అన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
















