- ఫేక్ ప్రచారమే ప్రధాన అజెండాగా ‘గొడ్డలి పార్టీ’ రాజకీయం
- టీమ్ స్పిరిట్తో ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టాలి
- డీఎస్సీపై కుట్రపూరిత ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దు
- మై టీడీపీ యాప్, సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి నిజాలు తీసుకెళ్లండి
- సీఎం చంద్రబాబు
మంగళగిరి (చైతన్యరథం): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు ప్రతిపక్ష ‘గొడ్డలి పార్టీ’ చేస్తున్న విష ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ శ్రేణులకు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఫేక్ ప్రచారం, బురద జల్లే రాజకీయాన్నే నమ్ముకుని విపక్షాలు వ్యవహరిస్తున్నాయని, అలాంటి దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని స్పష్టం చేశారు. ‘లీడర్షిప్ కాంక్లేవ్’లో ‘ప్రజల్లో పాజిటివ్ ప్రచారం- దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం’ అంశంపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. ఫేక్ రాజకీయాన్ని పటాపంచలు చేయాలని, రాజకీయాల్లో ప్రజలకు వాస్తవాలను వివరించడంతో పాటు ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం కూడా అంతే ముఖ్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. “గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కాం, వివేకా హత్య, ఏపీపీఎస్సీ అక్రమాలపై నోరు మెదపని గొడ్డలి పార్టీ, ఇప్పుడు డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై కుట్రపూరితంగా దుష్ప్రచారం చేస్తోంది. చివరికి కుప్పం వెళ్లి టీచర్లను బెదిరించే స్థాయికి ఆ పార్టీ మీడియా దారుణాలకు ఒడిగట్టింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలను బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఎండగట్టాలి. పార్టీకి, కూటమి నేతలకు వ్యతిరేకంగా ఎవరు విమర్శలు చేసినా టీమ్ స్పిరిట్తో కౌంటర్ ఇవ్వాలి” అని
దిశానిర్దేశం చేశారు. సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి
ప్రభుత్వం అందిస్తున్న సేవలు, సీఎం రిలీఫ్ ఫండ్ సహా అమలవుతున్న భారీ సంక్షేమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలకు సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం కల్పించాలని చెప్పారు. వివిధ వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న వినూత్న కార్యక్రమాలను డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
మాధ్యమాలు మారాలి.. ఆలోచనలు పెరగాలి
రాబోయే కాలంలో సోషల్ మీడియా అత్యంత కీలక పాత్ర పోషించబోతోందని, సాంకేతికతను జోడించి రాజకీయం చేయకపోతే వేగం అందుకోలేమని సీఎం వ్యాఖ్యానించారు. “ఇంకా పాత పద్ధతుల్లోనే రాజకీయం చేస్తామంటే కుదరదు. ప్రతి ఒక్కరూ ‘మై టీడీపీ’ యాప్ను పూర్తిస్థాయిలో వినియోగించు కోవాలి. అధునాతన డిజిటల్ వేదికలను ఉపయోగించుకుని నియోజకవర్గ స్థాయిలో వాస్తవాలను వేగంగా ప్రజల ముంగిటకు చేర్చాలి” అని స్పష్టం చేశారు.















