- విశాఖ గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్‌పై ముఖ్యమంత్రి
- ఇకపై.. ఉత్తరాంధ్రకే వలసలు
- స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్‌కు గూగుల్ క్లౌడ్ సహకారం
- గూగుల్ రాకకు లోకేష్ చొరవ చూపారు… ప్రధాని సహకరించారు
- పెట్టుబడుల్లోనే కాదు… ప్రాజెక్టుల గ్రౌండింగులోనూ ఏపీనే నెంబర్-1
- గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్‌కు సీఎం శంకుస్థాపన
- జూన్ 1న విశాఖ రైల్వేజోన్‌కు నోటిఫికేషన్ ఇస్తామన్న రైల్వేమంత్రికి ధన్యవాదాలు
విశాఖపట్నం (చైతన్య రథం): సెర్చ్ ఇంజిన్‌గా మొదలైన గూగుల్.. విశాఖలో ఏర్పాటు చేయబోతున్న సెంటర్ ద్వారా దేశానికే గ్రోత్ ఇంజిన్ కాబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. టెక్నాలజీ రంగంలో ఏపీలో కొత్త శకానికి శ్రీకారం చుడుతున్న రోజుగా 2026 ఏప్రిల్ 28వ తేదీ గుర్తుండిపోతుందని చెప్పారు. గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ ఏర్పాటుకు మంగళవారం విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, గూగుల్ గ్లోబల్ ఇన్ ఫ్రా, క్లౌడ్ వైస్ ప్రెసిడెండ్ బికాస్ కోలే శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్, బీజేపీ ఏపీ చీఫ్ పీవీఎన్ మాధవ్, భారతీ ఎంటర్‌ప్రైజెస్ వైస్ చైర్మన్ రాకేష్ మిట్టల్, అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ జీత్ అదానీ, గూగుల్ ఇండియా ప్రతినిధి ప్రీతి లొబానా పాల్గొన్నారు. అదానీ కనెక్స్, ఎయిర్ టెల్ నెక్స్‌ట్రా భాగస్వామ్యంతో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో క్లౌడ్ డేటా సెంటర్‌ను గూగుల్ ఏర్పాటు చేస్తోంది.
గిగావాట్ హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. తర్లువాడ, రాంబిల్లి, అడవివరం ప్రాంతాల్లో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు 601 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. శంకుస్థాపన కార్యక్రమానికి ముందు గూగుల్ ఎక్స్‌పీరియెన్స్ జోన్‌ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… “ఏపీ చరిత్రలో కొత్త టెక్ శకానికి శ్రీకారం చుడుతున్న రోజు ఇది. గూగుల్ రాక విశాఖకే కాదు ఏపికి ఓ గేమ్ చేంజర్. 30 ఏళ్ల క్రితం సైబరాబాద్ నగరాన్ని ఐటీ సిటీగా నిర్మాణం చేస్తే సంపద సృష్టికి కేంద్ర అయ్యింది. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో భారత చరిత్రలో 2026 ఏప్రిల్ 28వ తేదీ శాశ్వతంగా నిలిచిపోతుంది. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో టెక్నాలజీ రంగంలో ఏపీ తలెత్తుకుని నిలబడుతుంది. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఇది. దేశానికి ఏఐ డేటా గేట్ వేగా ఏపీ నిలుస్తుంది. సెర్చ్ ఇంజన్‌గా మొదలైన గూగుల్ సంస్థ… భారత్ గ్రోత్ ఇంజన్‌గా మారుతుంది. ప్రతీ ఒక్కరూ గూగుల్‌లో సెర్చ్ చేస్తే గూగుల్ ఏపీని సెలెక్ట్ చేసుకుంది”అని ముఖ్యమంత్రి చెప్పారు.
సీఎంఓ సెక్రటరీగా గూగుల్ ఏఐ అసిస్టెంట్
“ఏపీ ప్రభుత్వం అందిస్తున్న స్పీడ్ ఆఫ్ గవర్నెన్సుకు గూగుల్ ఏఐ డేటా సెంటర్ నుంచి కూడా సహకారం తీసుకుంటాం. సీఎంఓలోని నలుగురు కార్యదర్శులతోపాటు నాకు కొత్తగా ఏఐ అసిస్టెంట్ కూడా సుపరిపాలన అందించేందుకు సహకారం అందిస్తుంది. గూగుల్ రావటంతో విశాఖలోని యువతకు పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉత్తరాంధ్ర అంటే గతంలో వలసలు, వెనకబాటుతనం, నిరుద్యోగం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఇతర ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్రకే వలస వస్తారు. ట్యాలెంట్ మైగ్రేషన్ ముగిసింది. విశాఖ ఇకపై టాలెంట్‌కు డెస్టినీగా నిలవనుంది. విశాఖకు గూగుల్ సెంటరును తీసుకురావడంలో లోకేష్ చొరవను ప్రశంసిస్తున్నాను. లోకేష్ తొలిసారి గూగుల్ సెంటర్ సందర్శించినప్పుడు విశాఖకు గూగుల్ వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.
కానీ ఆ తర్వాత అది సాకారమైంది. గూగుల్ సంస్థ ఇండియాలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని భావించినప్పుడు ప్రధానిని కలిశారు. రాష్ట్రానికి గూగుల్ పెట్టుబడులు పెట్టేందుకు సహకరించాలని కోరారు. గూగుల్ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే… పూర్తిగా సహకరిస్తామని ప్రధాని మోదీ చెప్పారు.. చెప్పినట్టుగానే సహకరించారు. లోకేష్ చొరవ… ప్రధాని సహకారంతో విశాఖలో గూగుల్ ప్రాజెక్ట్ సాకారమైంది. ప్రతిష్టాత్మక అదానీ గ్రూప్, ఎయిర్ టెల్ లాంటి దిగ్గజ సంస్థలు ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తాయి. 2028 సెప్టెంబరు నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రారంభించాలని కోరుతున్నాను. ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ఈ ప్రాంతానికి నీటి సమస్య లేదు. 60 రోజుల్లోనే గోదావరి నీరు విశాఖకు తీసుకువస్తాం” అని సీఎం భరోసా ఇచ్చారు.
విశాఖకు మరిన్ని హంగులు…
“ఇప్పుడు విశాఖ గ్లోబల్ సిటీ. గ్లోబల్ సిటీగా మారిన విశాఖకు మరిన్ని హంగులు రాబోతున్నాయి. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పినట్టు… విశాఖ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. జూన్ 1వ తేదీ నుంచి సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేస్తున్నందుకు రైల్వే మంత్రికి ధన్యవాదాలు. ఈస్ట్ వెస్ట్ కారిడార్ ను కలపటం ద్వారా ఈ ప్రాంతాన్ని లాజిస్టిక్స్ పరంగా కూడా అభివృద్ధి చేయవచ్చు. జూలైలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభింప చేస్తాం. 2028 నాటికి ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నుంచి కూడా తొలి షిప్ మెంట్ ఎగుమతి అవుతుంది. రెన్యూ పవర్ ద్వారా ఇంగాట్ సోలార్ వేఫర్స్ ఉత్పత్తి కూడా మొదలవుతుంది. అనకాపల్లి జిల్లా మరో రంగారెడ్డి జిల్లాగా తయారై అభివృద్దికి కేంద్రం అవుతుంది. ఇక బులెట్ ట్రైన్ ప్రాజెక్టుతో రాష్ట్రంలోని వివిధ రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నాం. వచ్చే నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టులు సాకారమయ్యేలా చూడాలని కోరుతున్నాను.
దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం పెట్టుబడులు ఏపీకే వచ్చాయి. ఒప్పందాలకు, పెట్టుబడులకే కాదు… ప్రాజెక్టుల గ్రౌండింగ్ లో కూడా ఏపీ నెంబర్ 1గా ఉంది. పోలవరం ప్రాజెక్టు 2027 నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. 90 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ఇప్పటికే ఒప్పందం చేసుకున్నాం.”అని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ, మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, అనిత, గుమ్మిడి సంధ్యారాణి, జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.















