- డిజిటల్ ప్రయాణంలో కొత్తశకం మొదలైంది
- 2047నాటికి ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా విశాఖ
- పదేళ్లలోనే విశాఖ శరవేగంగా అభివృద్ధి సాధిస్తుంది
- అద్భుతమైన ప్రయాణానికి ఇది ఆరంభం మాత్రమే
- 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రజాప్రభుత్వ ధ్యేయం
- భారత్ ఏఐ శక్తి కాంక్లేవ్‌లో మంత్రి నారా లోకేష్
విశాఖపట్నం (చైతన్య రథం): ఈరోజు కేవలం విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రారంభం మాత్రమే కాదని, భారతదేశ డిజిటల్ ప్రయాణంలో నూతన అధ్యాయానికి నాంది అని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ‘భారతదేశ ఏఐ కారిడార్‌ను ఉమ్మడిగా నిర్మించడం అనే అంశంపై’ (Collaborating to Deliver Indiaus Al Corridor) గూగుల్ ఆధ్వర్యంలో విశాఖ నోవాటెల్ హోటల్‌లో జరిగిన భారత్ ఏఐ శక్తి కాంక్లేవ్‌లో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా మాట్లాడారు. “భారతదేశ డిజిటల్ ప్రయాణంలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్‌కు ఇది కీలక మలుపు. విశాఖపట్నం.. మనం ప్రేమగా వైజాగ్ అని పిలిచే ఈ నగరం సాధారణ నగరం కాదు. దశాబ్దాలుగా ఇది భారతదేశానికి ఒక గేట్‌వేలా పనిచేస్తోంది. భారతదేశంలోని ఖనిజ సంపదను ప్రపంచానికి అనుసంధానించింది. ఈ నగరం ఉక్కుతో నిర్మితమైంది. కానీ ఈరోజు మనం విశాఖ పునాదులను ఏఐ విప్లవంపై నిర్మించబోతున్నాం. విశాఖ మన దేశ భవిష్యత్తును నిర్మించబోతోందని నేను బలంగా విశ్వసిస్తున్నాను” అన్నారు.
విశాఖపట్నం వేగంగా అభివృద్ధి చెందుతుంది
“మనం ఈ రోజు ఒక చరిత్రాత్మక మలుపువద్ద ఉన్నాం. ప్రపంచం రోజురోజుకీ మారుతోంది. ప్రపంచం భారీ పరిశ్రమలనుంచి డిజిటల్ మౌలిక సదుపాయాలవైపు, తయారీనుంచి మెషిన్ ఇంటెలిజెన్స్‌వైపు మారుతోంది. ఈ ప్రయాణంలో వైజాగ్ మళ్లీ అభివృద్ధి చెందుతోంది. గూగుల్ ఏఐ హబ్ ప్రారంభంతో ఈ మార్పును మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి 15 బిలియన్ డాలర్ల పెట్టబడితోపాటు గిగా వాట్ డేటా సెంటర్ ఎకోసిస్టమ్ ఏర్పాటు కానుంది. ఇది సాధారణ వృద్ధి కాదు, భారీస్థాయి అభివృద్ధి. మొదటిసారి వైజాగ్‌లో కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు ఏర్పాటుకానున్నాయి. కనెక్టివిటీ విషయంలో మనం ఇతర రాష్ట్రాలతో పోటీ పడతాం. ఒకప్పుడు పోర్టులు ఈ నగరాన్ని ప్రపంచంతో కలిపినట్లే, ఈ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు డిజిటల్‌గా ప్రపంచంతో అనుసంధానిస్తాయి” అన్నారు.
అద్భుతమైన ప్రయాణానికి ఆరంభం
“ప్రపంచవ్యాప్తంగా వర్జీనియానుంచి డబ్లిన్ వరకు డేటా సెంటర్ల ప్రభావాన్ని మనం చూశాం. కాబట్టి ఈ పెట్టుబడిని కేవలం 15 బిలియన్ డాలర్లుగా చూడకండి. ఇది ఒక బలమైన ఎకోసిస్టమ్‌కు పెట్టుబడి. ఒక అద్భుతమైన ప్రయాణానికి ఆరంభం. ఈ పెట్టుబడివల్ల విశాఖపట్నంలో సుమారు 2 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వస్తాయి. నూతన పరిశ్రమలు కూడా ఈ ఎకోసిస్టమ్ చుట్టూ అభివృద్ధి చెందుతాయి. ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు. ఇది ఆర్థిక అభివృద్ధికి ఒక మల్టిప్లయర్. డేటా, సంఖ్యలకంటే ఎక్కువగా వైజాగ్‌కు ఉన్న మరో బలం.. ఇక్కడి శక్తి, ప్రతిభ, ఆత్మవిశ్వాసం. 2014లో అతిపెద్ద తుఫాను విశాఖను తాకింది. చెట్లన్నీ నేలకూలాయి. కానీ 48 గంటల్లోనే ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నవ్వుతూ ఆహ్వానించారు. ఇది ఈ నగర ప్రజల స్థయిర్యానికి నిదర్శనం. దీపావళి సమయంలో అగ్నిప్రమాదాల నివారణకు టపాసులు కాల్చవద్దని చంద్రబాబు పిలుపునిస్తే ఒక్కరు కూడా వాటి జోలికి వెళ్లలేదు. అదే వైజాగ్ స్పూర్తి, బాధ్యత. ఇది యువత ఆశయాలు కలిగిన నగరం. ఇక్కడ సృజనాత్మకత సహజం. జీవితం, పని సమతుల్యంగా ఉన్న నగరమిది. ఇవన్నీ వైజాగ్‌ను ప్రత్యేకంగా నిలుపుతున్నాయి” అని మంత్రి లోకేష్ ప్రశంసించారు.
2047నాటికి ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా విశాఖ
“2047నాటికి ట్రిలియన్ డాలర్ ఆర్థికవ్యవస్థగా విశాఖ ఎకనమిక్ రీజియన్‌ను తీర్చిదిద్దాలనేది ప్రజా ప్రభుత్వ లక్ష్యం. ఇటీవలే ఆర్సెలార్ మిట్టల్ సంస్థతో గ్రీన్ స్టీల్ సిటీకి శంకుస్థాపన చేశాం. అదేవిధంగా ఏఐ, డేటా, ఫార్మా, మెడికల్ డివైసెస్ రంగాల్లో భారీ అభివృద్ధి జరుగుతోంది. ఈ ప్రాంతం కృత్రిమ మేధ (ఏఐ), క్లీన్ ఎనర్జీ, మెడికల్ తయారీ, అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్‌కు కేంద్రంగా మారబోతోంది. హైదరాబాద్ అభివృద్ధిని మనం అందరం చూశాం. ఒకప్పుడు సైబర్ టవర్స్ నిర్మాణానికి చంద్రబాబు సంకల్పించినప్పుడు అందరూ ఎగతాళి చేశారు. కంప్యూటర్లు అన్నం పెడతాయా? అని విమర్శించారు. కానీ స్పష్టమైన విజన్, పట్టుదలతో అది సాధ్యమైంది. హైదరాబాద్‌లో 30 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని.. విశాఖలో వచ్చే పదేళ్లలోనే సాధించాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. మా విధానం సింపుల్‌గా ఉన్నా శక్తివంతమైంది. విస్తృతి, సమగ్రత, స్వయం సమృద్ధి, పెట్టుబడులు ఆకర్షించడం మాత్రమే కాదు.. మొత్తం పరిశ్రమలను స్థాపించడం మా లక్ష్యం. గూగుల్ మాపై నమ్మకం ఉంచి 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడం గొప్ప విషయం. ఇది ఇప్పుడు మీ ప్రాజెక్ట్ మాత్రమే కాదు.. మన అందరి ప్రాజెక్ట్. మేం ఎంవోయూలపై కాకుండా షేక్ హ్యాండ్‌లపై నమ్మకం ఉంచుతాం. ఒకసారి మాతో చేతులు కలిపిన తర్వాత అది మీ ప్రాజెక్ట్ కాదు.. మా ప్రాజెక్ట్. దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25శాతం ఏపీకి వచ్చింది అందుకే” అన్నారు.
20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయం
ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం. మేం చాలా కసితో ఉన్నాం. మమ్మల్ని ఒక స్టార్టప్‌లా చూడండి. చరిత్రలో నాలుగుసార్లు రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సి వచ్చింది. మొదట మద్రాస్‌లో భాగంగా ఉన్నాం. తర్వాత కర్నూలు రాజధానిగా ఉన్నాం. కొన్నేళ్ల తర్వాత తెలంగాణ, ఏపీ విడిపోయాయి. అందరం కలిసి ఆనాడు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకున్నాం. తర్వాత విడిపోయాం. మాకు ఉన్న కసి, సంకల్పబలం మమ్మల్ని ముందుకు తీసుకెళ్తోంది. అందరితో కలిసి మేం చరిత్ర సృష్టించానుకుంటున్నాం. మా కేబినెట్‌లో 25మంది మంత్రుల్లో 17మంది కొత్తవారు. శాసనసభ్యుల్లో సగంమంది మొదటిసారిగా ఎన్నికైనవారు. మేం అందరం ఉత్సాహంతో, కసితో పనిచేస్తున్నాం. పెట్టుబడిదారులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం. 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా ధ్యేయం. ఏపీ, వైజాగ్‌లో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో గూగుల్ క్లౌడ్, గూగుల్ గ్లోబల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలేతోపాటు 49 కంపెనీల ప్రతినిధులు, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.















