అంతర్జాతీయ సాంకేతిక సంస్థల సంచరణ రంగంలో ఏపీ ఒక చారిత్రక శిలాఖండాన్ని సాధించబోతోంది. విశాఖపట్నంలో గూగుల్ నెలకొల్పనున్న హైపర్‌స్కేల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ కేవలం పెట్టుబడి మాత్రమే కాదు `భారతీయ సాంకేతిక చరిత్రలో చిరస్థాయిగా నిలిచే మైలురాయి. సీఎం చంద్రబాబు చేస్తున్న శంకుస్థాపన ఆధునిక భారతదేశ నిర్మాణ ప్రక్రియలో కీలక ఘట్టంగా చరిత్రలో నిలవడం ఖాయం.
గత దశాబ్దాలలో ఏపీ అనేక సవాళ్లు అధిగమించింది. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థికంగా, రాజకీయంగా కొత్త పునాదులు నెలకొల్పుకుంటున్న సమయంలో, ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ కంపెనీ గూగుల్ విశాఖలో అతిపెద్ద పెట్టుబడిని ప్రకటించడం రాష్ట్ర ప్రజలకు ఆశాకిరణం. దీన్ని ఒక వ్యాపార నిర్ణయంగా కాదు `ఏపీ భవిష్యత్తుపై గూగుల్ నమ్మకానికి ప్రతీకగా చూడాలి. “విశాఖ ఒక నూతన చరిత్రకు నాంది పలుకుతోంది. డేటా సెంటర్ల రాజధానిగా మారే దిశగా అడుగులు వేస్తోంది” అన్నది సీఎం చంద్రబాబు మాట. కూటమి ప్రజా ప్రభుత్వం పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం అమలు చేస్తుండటంతో `గూగుల్ డేటా సెంటర్ సాకారమైంది. ప్రభుత్వం ఒకే కౌంటర్ ద్వారా అనుమతులు, భూకేటాయింపులు, విద్యుత్ అనుసంధానంవంటి సేవలు అందించడంతో పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా మారిందన్న అంతర్లీన అంశం ఇక్కడ ముఖ్యం. విశాఖ తీరప్రాంతం కావడం డేటా సెంటర్ స్థాపనకు అత్యంత అనుకూలమైన అంశం. అంతర్జాతీయ సముద్రగర్భ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుకు సహజమైన అనుకూలత ఉన్న తీరప్రాంతం `ప్రపంచ కనెక్టివిటీకి సహజ ద్వారంగా నిలుస్తోంది. ప్రపంచంలో 95 శాతంకంటే ఎక్కువ డిజిటల్ డేటా సముద్రగర్భ కేబుళ్ల ద్వారా ప్రవహిస్తున్న నేపథ్యంలో, విశాఖ తీరప్రాంతంలో డేటా సెంటర్ ఏర్పాటు వ్యూహాత్మకంగా ముఖ్యమైనది. దీంతోపాటు `త్వరలోనే అందుబాటులోకి రానున్న సబ్ సీ కేబుల్ వ్యవస్థ ద్వారా విశాఖకు వివిధ దేశాలతో నేరుగా అనుసంధానం ఖాయం. ఈ కేబుల్ వ్యవస్థ ద్వారా విశాఖ నుండి అమెరికా, యూరప్, జపాన్, సింగపూర్‌వంటి దేశాలకు నేరుగా అతి వేగవంతమైన డేటా ప్రసారం సాధ్యమవుతుంది. దీని వలన సమాచార ప్రసార జాప్యం తగ్గి, నెట్‌వర్క్‌పై విశ్వాసం పెరుగుతుంది. ఈ ప్రాజెక్టులో అదాని కనెక్స్, ఎయిర్‌టెల్ నెక్స్‌ట్రా వంటి సంస్థలు భాగస్వాములు.
ఇదిలావుంటే `రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6.5 గిగావాట్ల సామర్థ్యంతో మల్టీ-గిగావాట్ డిజిటల్ హబ్‌ను నిర్మించాలనేది ప్రభుత్వ దీర్ఘకాలిక లక్ష్యం. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రమూ ఇంతవరకు చేయని అతిపెద్ద డిజిటల్ మౌలిక సదుపాయ ప్రాజెక్టు. ప్రస్తుతం ఆరంభమవుతున్న ఒక గిగావాట్ ఫేజ్ కేవలం తొలి అడుగు మాత్రమే. దీనిని ఆరు దశలుగా విస్తరించాలని ప్రణాళిక సిద్ధంగా ఉంది. పోలికగా చెప్పాలంటే నేడు బెంగళూరు సుమారు 300 మెగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. విశాఖ లక్ష్యం దానికంటే 20 రెట్లు అధికం. ఇది విశాఖను దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ హబ్‌గా మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో సింగపూర్, హాంకాంగ్, టోక్యోవంటి నగరాలు ప్రముఖ డేటా హబ్‌లుగా గుర్తింపుపొందాయి. రానున్న కాలంలో విశాఖ వాటి సరసన చేరే అవకాశం ఉంది. గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టు కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాకుండా, భారీగా ఉద్యోగ అవకాశాలను సృష్టించనుంది. నేరుగా డేటా సెంటర్‌లో పని చేసే ఉద్యోగాలే కాకుండా, అనుబంధ రంగాలలో ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాలు వేలాది సంఖ్యలో ఏర్పడనున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజినీర్లు, క్లౌడ్ ఆపరేషన్స్ స్పెషలిస్ట్‌లు, మెయింటెనెన్స్ టెక్నీషియన్లు, సైబర్ సెక్యూరిటీ విశ్లేషకులు, క్లౌడ్ ఆర్కిటెక్ట్‌లు, డేటా సైంటిస్ట్‌లువంటి రంగాల్లో వేలాది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పవర్ సిస్టమ్స్, కూలింగ్ టెక్నాలజీ, సర్వర్ తయారీ, నెట్‌వర్కింగ్‌వంటి రంగాల్లో స్థానికంగా మాన్యుఫాక్చరింగ్ యూనిట్లతో ఏఐ ఎకోసిస్టమ్ ఏర్పాటు కానుంది. ఈ రంగాల్లో పనిచేసే ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, సివిల్ ఇంజినీర్లు, లాజిస్టిక్స్ నిపుణులు వంటివారికీ అవకాశాలు తెరుచుకుంటాయి. నిర్మాణ దశలో వేలాది నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించబడుతుంది. ఒక్క గూగుల్ డేటా సెంటర్ నేరుగా 5,000, పరోక్షంగా 50,000 ఉద్యోగాలు సృష్టిస్తుందని నిపుణులు అంచనా. గూగుల్ సాధారణంగా తన డేటా సెంటర్ స్థాపించే ప్రదేశాలలో స్థానిక నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది.
ఏపీలోనూ వర్శిటీలు, పాలిటెక్నిక్ కళాశాలల సహకారంతో ప్రత్యేక ఏఐ/ఎంఎల్ కోర్సులు, క్లౌడ్ కంప్యూటింగ్ సర్టిఫికేషన్లు అందించే అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏపీ టెక్ స్కిల్స్ మిషన్ ద్వారా లక్షలమంది యువతకు డిజిటల్ నైపుణ్యాలు అందించేందుకు కార్యక్రమాలు చేపట్టింది. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ఈ మిషన్‌కు కొత్త ఊపు ఇస్తుంది. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ఒంటరి పెట్టుబడి కాదు. విస్తృతమైన ఏఐ ఎకోసిస్టమ్ నిర్మాణానికి పునాది. ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లు స్థాపించిన చోట్ల అనేక అనుబంధ పరిశ్రమలు, సేవా రంగ సంస్థలు వెంటనే అనుసరించాయి. విశాఖ విషయంలోనూ ఇదే జరగనుంది. ఏఐ ఎకోసిస్టమ్‌తో ఐటీ స్టార్టప్‌లు, రీసెర్చ్ సెంటర్లు, క్లౌడ్ కంపెనీలు, సెమీ కండక్టర్ కంపెనీలు విశాఖకు క్యూ కట్టే అవకాశముంది.
విశాఖ ఇప్పటికే వీఎసఈజెడ్ (విశాఖపట్నం స్పెషల్ ఎకనమిక్ జోన్), ఫిన్‌టెక్ వ్యాలీ ఫ్యూజన్‌వంటి ఆకర్షణీయ పెట్టుబడి కేంద్రాలు కలిగి ఉంది. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు తర్వాత ఈ ప్రాంతాల్లో కార్యకలాపాలు మరింత వేగంగా విస్తరించే అవకాశం లేకపోలేదు. రాష్ట్ర ప్రభుత్వం స్టార్టప్‌లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోంది -సీడ్ ఫండింగ్, ట్యాక్స్ రిలీఫ్, మెంటర్‌షిప్ కార్యక్రమాలు అందులో భాగం.
గ్రీన్ ఎనర్జీ -పర్యావరణ బాధ్యత
గూగుల్ సహా ఇతర టెక్ కంపెనీలు ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ల కోసం గ్రీన్ ఎనర్జీని సరఫరా చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గూగుల్ 2030 నాటికి తన అన్ని కార్యకలాపాలను 100శాతం పునరుత్పాదక శక్తితో నడపాలని లక్ష్యం పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో సోలార్, విండ్ ఎనర్జీ సామర్థ్యం అపారంగా ఉండటం గూగుల్‌కు అనుకూలంగా ఉంది. రాష్ట్రం ఇప్పటికే 15,000 మెగావాట్ల పైగా పునరుత్పాదక శక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకొల్పింది. 2030నాటికి ఇది 25,000 మెగావాట్లకు పెంచాలని ప్రణాళిక ఉంది. ఈ గ్రీన్ ఎనర్జీ లక్ష్యం గూగుల్‌వంటి కంపెనీలకు ఆంధ్రప్రదేశ్‌ను మరింత ఆకర్షణీయంగా చేస్తోంది.
సైబర్ సెక్యూరిటీ కేంద్రం
గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో విశాఖ ఒక ప్రధాన సైబర్ సెక్యూరిటీ కేంద్రంగా మారే అవకాశం ఉంది. దేశంలో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో, విశాఖలో ఒక నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఎక్సెలెన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇది రక్షణరంగ అవసరాలు కూడా తీరుస్తుంది -ఎందుకంటే విశాఖలో ఐఎనఎస్ విశాఖ నావల్ బేస్ ఉంది.
అంతర్జాతీయ హంగులు -వికిసిత్ భారత్`2047
ప్రముఖ టెక్ సంస్థలన్నీ విశాఖవైపు చూస్తుండటంతో ఇప్పుడు నగరానికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి అంతర్జాతీయస్థాయి మౌలిక సదుపాయాలు కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. భోగాపురం విమానాశ్రయం ఏర్పాటు తర్వాత విశాఖ నేరుగా సింగపూర్, దుబాయ్, హాంకాంగ్, లండన్‌వంటి ప్రధాన టెక్ నగరాలతో అనుసంధానమవుతుంది. ఈ విమానాశ్రయం ఏర్పాటుతో టెక్ ఎగ్జిక్యూటివ్‌లు, ఇన్వెస్టర్లు, రీసెర్చర్లు విశాఖకు నేరుగా వచ్చే అవకాశం కలుగుతుంది. ఇది టెక్నాలజీ పెట్టుబడులను మరింత ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సింగపూర్ టెక్ హబ్ అయిన చంగీ విమానాశ్రయం దగ్గర ఉండటం ఆ నగర అభివృద్ధికి ఎంతగానో దోహదపడిందన్నది చరిత్ర చెప్తోన్న సత్యం.
ఆసియా ఏఐ హబ్ -విశాఖ పాత్ర
గూగుల్ ఏఐ క్లౌడ్ సేవల ద్వారా విశాఖ ఆసియాలోనే ప్రధాన కేంద్రంగా మారే అవకాశం లేకపోలేదు. దీంతోపాటు ఏఐ ఆధారిత కంపెనీలకూ విశాఖ గమ్యస్థానంగా మారే అవకాశాలున్నాయి. ఇప్పుడు చాలామంది యువ ఇంజినీర్లు అమెరికా, కెనడా వెళ్ళిపోతున్నారు. విశాఖలో గూగుల్‌వంటి కంపెనీలు వస్తే ఈ ‘బ్రెయిన్ డ్రెయిన’ తగ్గుతుంది. ప్రపంచంలో ఏఐ కంప్యూటేషన్ అవసరాలు 2030నాటికి ఐదు రెట్లు పెరగనున్నాయని అంచనా. ఈ పెరుగుదలకు అనుగుణంగా డేటా సెంటర్ సామర్థ్యాన్ని నెలకొల్పిన దేశాలు, నగరాలు భవిష్యత్తులో డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ముందుంటాయి. విశాఖ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే, రానున్న 20 ఏళ్ళలో ఇది ఆసియా మ్యాప్‌లో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించవచ్చు.
వికసిత్ భారత్ 2047 -రాష్ట్రం కీలక భూమిక
వికసిత్ భారత్ 2047 విజన్‌కు అనుగుణంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్లోబల్ టెక్ కేంద్రంగా మార్చే క్రమంలో గూగుల్ ముందడుగు కానుంది. 2047నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుంది. గూగుల్ పెట్టుబడి ఆ లక్ష్యానికి వేగం తెస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఒక వ్యాపార-అనుకూల రాష్ట్రంగా పేరు పొందింది. గడచిన ఒక సంవత్సర కాలంలో రాష్ట్రం రూ.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించింది. గూగుల్ డేటా సెంటర్ ఈ పెట్టుబడి ప్రవాహానికి కిరీటంలా నిలుస్తుంది.
నూతన యుగానికి ప్రవేశద్వారం
పోర్టు సిటీగా ఒకప్పుడు సముద్రపు ఒడ్డున నిలిచిన విశాఖ, నేడు డేటా సిటీగా డిజిటల్ సముద్రంలోకి అడుగు పెడుతోంది. గూగుల్ హైపర్‌స్కేల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు విశాఖ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది. ఇది కేవలం ఒక ఆర్థిక మార్పు కాదు -సామాజిక, సాంస్కృతిక మార్పుకు కూడా సూచిక. రానున్న దశాబ్దాల్లో విశాఖలో పని చేసే, నివసించే, చదువుకునే ప్రతి ఒక్కరి జీవితంపై ఈ డేటా సెంటర్ ప్రభావం కనిపిస్తుంది. మెరుగైన ఇంటర్నెట్ సేవలు, ఉద్యోగావకాశాలు, అంతర్జాతీయ అనుసంధానం -ఇవన్నీ విశాఖ ప్రజలకు జీవన నాణ్యతను పెంచుతాయి. ఈ సువర్ణావకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి ప్రభుత్వం, ప్రైవేటు రంగం, విద్యా సంస్థలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది.
















