- రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఏయూ దిక్సూచి
- యువత జాబ్ సీకర్స్ కాదు… జాబ్ క్రియేటర్స్ అవ్వాలి
- గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో విశాఖకు కొత్త చరిత్ర
- ఆంధ్ర వర్శిటీ శతాబ్ది వేడుకల్లో సీఎం చంద్రబాబు
- ఏయూ అభివృద్ధికి రూ.500 కోట్లు ప్రకటించిన సీఎం
విశాఖపట్నం (చైతన్య రథం): యూనివర్సిటీలు డిగ్రీలు ఇచ్చే విద్యా కేంద్రాలు మాత్రమే కాదని… సమాజాన్ని ప్రభావితం చేసే ఆవిష్కరణలకు వేదిక కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. యూనివర్సిటీలు జాతీయ ఆస్తులని, వాటిని కాపాడుకోవాలన్నారు. విశాఖలో జరిగిన ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పాల్గొన్నారు. యూనివర్సిటీలో రూ.64 కోట్లతో చేపట్టిన ఏయూ ఐ ఫ్యాక్టరీ, నెట్వర్క్ సెంటర్‌ను ప్రారంభించారు. మరో రూ.112 కోట్లతో 9 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. బాయ్స్, గర్ల్స్ హాస్టల్, కాన్వకేషన్ హాలుతో పాటు మరికొన్ని అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
ఉద్యోగాలిచ్చేస్థాయికి యువత ఎదగాలి
“విద్యార్థులు, పూర్వ విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నా… రోజులు మారాయి.. సాధారణ మనుషులు అసాధారణ శక్తిగా మారే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. “నాలెడ్జ్, ఇన్నోవేషన్, స్టార్టప్‌లపై యువత దృష్టి పెట్టాలి. పారిశ్రామిక రంగానికి యూనివర్సిటీ అనుసంధానం కావాలి. మీరు ఉద్యోగం చేయడం కాదు, పది మందికి ఉద్యోగం ఇచ్చే శక్తి మీకు రావాలి… దీనికి సహకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నేను ఎన్నో కార్యక్రమాలకు వెళ్లాను కానీ… యూనివర్సిటీలో మీ ఉత్సాహం చూస్తుంటే ఆనందం ఆకాశాన్ని తాకుతోంది. విద్యార్థులు, పూర్వ విద్యార్థులకు అభినందనలు తెలుపుతున్నాను. రెండు ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నేను విశాఖ వచ్చాను. 100 ఏళ్ల ఏయూ పండుగ ఒక చరిత్ర. రేపు ప్రపంచంలో నెంబర్ 1 టెక్నాలజీ దిగ్గజ సంస్థ గూగుల్ సంస్థ డేటా సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన మరో చరిత్ర. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నారంటే అది విశాఖ గొప్పతనం.
గూగుల్ కంటే ముందుగానే ఏయూ ప్రపంచాన్ని విశాఖతో కనెక్ట్ చేసింది. 58 దేశాల విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారంటే రాష్ట్రానికి, దేశానికి గర్వకారణం. విశాఖ విశ్వనగరం… గ్లోబల్ సిటీ. ఇది అన్ స్టాపబుల్. ఎవరూ ఆపలేరు. ఏయూ 100 ఏళ్ల చరిత్ర ఒక బ్రాండ్. రాష్ట్ర విభజన తర్వాత కేబినెట్ సమావేశం ఏయూలో నిర్వహించాం… అదీ ఏయూ ప్రత్యేకత. 53 యూనివర్సిటీలు రాష్ట్రంలో ఉన్నాయి… అన్నింటికీ ఏయూ దిక్సూచి, లీడర్. స్వాతంత్య్ర పోరాటం కంటే ముందే ఈ యూనివర్సిటీ వచ్చింది. జైపూర్ రాజ్ విక్రమ దేవ్, గజపతి, పిఠాపురం, బొబ్బిలి రాజులు ఈ యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేశారు. వారిని మనం స్మరించుకోవడం ధర్మం, బాధ్యత. కట్టమంచి రామలింగారెడ్డి ఏయూకు మొదటి వీసీగా చేసి బలమైన పునాది వేశారు. ఆయన కూడా చిత్తూరు జిల్లా వాసే… నేనూ చిత్తూరు జిల్లా నుంచి వచ్చి వందేళ్ల ఉత్సవంలో పాల్గొన్నాను. 2వ వీసీ సర్వేపల్లి రాధాకృష్ణ… దేశ రాష్ట్రపతి అయ్యారు. ఈ రోజు మన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తండ్రి సర్వేపల్లి రాధాకృష్ణ అభిమాని. ఈయనకు రాధాకృష్ణన్ అని పేరు పెట్టారు. కేవలం చదువు చెప్పడమే కాదు… తెలుగు వైభవానికి ఏయూ కృషి చేస్తోంది. విద్య, సాహిత్య, కళా రంగాల్లో ప్రముఖులను కళా ప్రపూర్ణ అవార్డుతో గౌరవిస్తున్నారు” అని సీఎం చంద్రబాబు అన్నారు.
26 ఏళ్ల యువకుడిలా నా ఆలోచనలు..
రాష్ట్రంలో ఎంతోమంది నాయకులను తయారు చేసిన గడ్డ ఆంధ్ర యూనివర్సిటీ అని, ఎందరో రాజకీయ ఉద్దండులు ఇక్కడనుంచే వచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. “మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఏయూ నుంచే వచ్చారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా ఇక్కడినుంచే వచ్చారు. ప్రపంచంలోని చాలా యూనివర్సిటీల్లో ఇక్కడ చదువుకుని వెళ్లిన వారు ప్రొఫెసర్లుగా చేస్తున్నారు. న్యాక్ ఏ ప్లస్‌ప్లస్‌ను ఏయూ సాధిస్తోంది. ఎనఐఆరఎఫ్‌లో 41వ ర్యాంక్, పబ్లిక్ సెక్టార్‌లో 5వ ర్యాంక్‌లో ఉంది. అన్ని యూనివర్సిటీల్లో విద్యాశాఖామంత్రి, గవర్నర్ ప్రతిభ ఉన్నవారిని వీసీలుగా ఎంపిక చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా వారిని అభినందిస్తున్నాను. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెట్రాలజీతో ఎంఓయూలు కుదుర్చుకున్నాం. నాకు 76 ఏళ్లయినా.. నేను 26 ఏళ్ల యువకుడిలానే ఆలోచిస్తాను. ఒకప్పుడు మనం ఐటీ ప్రారంభించాం. హైటెక్ సిటీ కట్టాం. నాలెడ్జ్ ఎకానమీకీ దోహదం చేశాం. నేడు డేటా సెంటర్, ఏఐ, క్వాంటం తీసుకొచ్చాం. వీసీని కోరుతున్నా… ఏయూకు బ్రాండ్ ఉంది. మీరు అడిగితే ప్రపంచంలోని చాలా యూనివర్సిటీలు మీతో ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాయి. వంద దేశాల విద్యార్థులు మన యూనివర్సిటీల్లో చదివేలా సిద్ధం చేయాలి. సంపద సృష్టించే మార్గదర్శులుగా మారే అవకాశం మీకు ఉంది. ఎంట్రప్రెన్యూర్లుగా ఏయూ ఎంతమందిని తయారు చేస్తుందనేది మీ మీద ఆధారపడి ఉంది. ఇక్కడ ఆర్టీఐహెచ్ ఏర్పాటు చేశాం. భవిష్యత్ డేటా సెంటర్, ఏఐ, క్వాంటం రంగాలదే. పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి చదువు. చదువుతో ప్రపంచాన్ని జయించే ఆత్మవిశ్వాసం వారికి వస్తుంది. ఏయూ చాలా సుందరమైన ప్రాంతం. ఒత్తిడి ఉన్నప్పుడు సముద్ర తీరంలో కాసేపు నడిస్తే సేదతీరుతారు” అని సీఎం అన్నారు.
ఏయూ అభివృద్ధికి రూ.500 కోట్లు
“ఏయూలో చదువుకునేవారంతా అదృష్టవంతులు. ఇక్కడ చదువుకుంటే ఎంత బావుటుందో అనే ఆలోచన మళ్లీ నాకూ వస్తోంది. ఈ యూనివర్సిటీ భావితరాల నాయకులను తయారు చేయాల్సి ఉంటుంది. ఉపకులపతికి లక్ష్యం నిర్దేశిస్తున్నాం… ఏయూ దేశంలో యూనివర్సిటీల్లో టాప్-5 జాబితాలో ఉండాలనేది నా ఆకాంక్ష. ప్రపంచంలో 100 అత్యుత్తమ యూనివర్సిటీల్లో ఆంధ్ర యూనివర్సిటీ ఉండాలి. ఈ స్థాయిలో అభివృద్ధి చేయాలంటే నిధులు కావాలి. అందుకే రూ.500 కోట్లను ఆంధ్ర యూనివర్సిటీకి ఇస్తాం. రూ.500 కోట్ల కార్పస్ ఫండ్ వస్తుంది. ఒక్కో విద్యార్థి ఒక్కో రూపాయి చొప్పున సాయం అందించినా చాలు. ఏయూ పూర్వ విద్యార్థులు తలచుకుంటే ఏదైనా సాధ్యమే అవుతుంది. ఏయూ వందేళ్ల చరిత్ర రోజున చెప్తున్నా… రాబోయే వందేళ్లలో ఏయూ మరో చరిత్ర సృష్టిస్తుంది… బెస్ట్ బ్రాండ్ క్రియేట్ చేస్తుంది” అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఏయూనుంచే జైత్ర యాత్ర ప్రారంభం
’‘ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టం. ఇక్కడ బంగారంలాంటి విద్యార్థులు ఉన్నారు. మంచి ప్రొఫెసర్లు ఉన్నారు. ప్రపంచంలోని నాలెడ్జ్‌ను ఇక్కడికి తీసుకొస్తాం. నేను, నా మిత్రుడు పవన్‌కళ్యాణ్ ఈ రాష్ట్రాన్ని పునర్ నిర్మించేందుకు ముందుకొచ్చాం. తెలుగుజాతి పునర్వైభవానికి ప్రధాని మోదీ మనకు సహకరిస్తున్నారు. వారి సంకల్పం వికసిత్ భారత్ 2047. మన లక్ష్యం స్వర్ణాంధ్ర 2047. 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా తెలుగు జాతి ఉండాలనేది మా సంకల్పం. మా సంకల్ప జైత్ర యాత్ర ఏయూనుంచే ప్రారంభం కావాలి. పని చేసే బాద్యత మాది, సహకరించే బాధ్యత మాది… దాన్ని నిరూపించుకునే బాధ్యత మీదే” అని విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి అన్నారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్, ఒడిశా గవర్నర్ హరిబాబు, కేంద్రమంత్రులు శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర విద్యా శాఖామంత్రి నారా లోకేష్, మాజీ క్రికెటర్ సచిన్, దర్శకుడు త్రివిక్రమ్, మంత్రులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
















