- గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు విశాఖ జిల్లాలో శంకుస్థాపన
- 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి
- గిగా వాట్ సామర్థ్యంతో ఏర్పాటు
- 28న తర్లువాడలో సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన
- గూగుల్ రాకతో విశాఖకు విశ్వఖ్యాతి -టెక్ కంపెనీల ఆసక్తి
అమరావతి (చైతన్య రథం): అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో ఏపీలో సరికొత్త టెక్ అధ్యాయం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 28న విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అతిపెద్ద హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో దేశ టెక్నాలజీ రంగంలో కొత్త చరిత్ర ఆవిష్కృతం కానుంది. ఆసియా ఖండానికే కీలకమైన ఏఐ గేట్‌వేగా విశాఖ అవతరించనుంది. అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో అంతర్జాతీయ టెక్ మ్యాప్‌లో విశాఖ నగరం శాశ్వతంగా చోటు సంపాదించనుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన మెగా డేటా సెంటర్ విశాఖ నగరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ నగరాల సరసన చేరనుంది. గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా గిగావాట్ సామర్ధ్యంతో కూడిన ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. కూటమి ప్రజా ప్రభుత్వం పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం అమలు చేస్తుండటంతో గూగుల్ డేటా సెంటర్ సాకారం కానుంది. త్వరలోనే అందుబాటులోకి రానున్న సబ్ సీ కేబుల్ వ్యవస్థ ద్వారా విశాఖకు వివిధ దేశాలతో నేరుగా అనుసంధానం ఏర్పడనుంది. ఈ డేటా సెంటర్ ద్వారా భారీగా డేటా స్టోరేజితోపాటు ఏఐ క్లౌడ్ ఇన్ ఫ్రా అందుబాటులోకి రానుంది.
పోర్టు సిటీ నుంచి డేటా సిటీగా విశాఖ
విశాఖపట్నం తీరప్రాంతం కావడంతో అంతర్జాతీయ సముద్రగర్భ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుకు ఎంతో అనుకూలం. తర్లువాడ, అడవివరం, రాంబిల్లి ప్రాంతాల్లో సుమారు 600 ఎకరాల విస్తీర్ణంలో, గిగావాట్ సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టులో అదానీ కనెక్ట్స్, ఎయిర్ టెల్ నెక్స్‌ట్రాలాంటి సంస్థలు ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6.5 గిగా వాట్ల సామర్థ్యంతో మల్టీ-గిగావాట్ డిజిటల్ హబ్‌ను నిర్మించాలనేది ప్రభుత్వ దీర్ఘకాలిక లక్ష్యం. గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టు కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాకుండా, భారీగా ఉపాధి అవకాశాలను సృష్టించనుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఆపరేషన్స్, మెయింటెనెన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఆర్కిటెక్చర్, డేటా సైంటిస్ట్‌వంటి రంగాల్లో వేలాది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. డేటా సెంటర్ల ద్వారా వచ్చే ఆదాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయనుంది. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో రాష్ట్రంలో అనుబంధ రంగాలనుంచి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. పవర్ సిస్టమ్స్, కూలింగ్ టెక్నాలజీ, సర్వర్ తయారీ, నెట్‌వర్కింగ్‌వంటి రంగాల్లో స్థానికంగా మాన్యుఫాక్చరింగ్ యూనిట్లతో ఏఐ ఏకోసిస్టమ్ ఏర్పాటు కానుంది.
విశాఖకు అంతర్జాతీయ హంగులు
గూగుల్ ఏఐ క్లౌడ్ సేవల ద్వారా విశాఖ ఆసియాలోనే ప్రధాన కేంద్రంగా మారే అవకాశం ఉంది. దీంతోపాటు ఏఐ ఆధారిత కంపెనీలకూ విశాఖ గమ్యస్థానంగా మారే అవకాశాలున్నాయి. ఏఐ ఎకోసిస్టమ్‌తో ఐటీ స్టార్టప్‌లు, రీసెర్చ్ సెంటర్లు క్లౌడ్, సెమీ కండక్టర్ కంపెనీలు విశాఖకు క్యూకట్టే అవకాశముంది. గూగుల్ సహా ఇతర టెక్ కంపెనీలు ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ల కోసం గ్రీన్ ఎనర్జీని సరఫరా చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రముఖ టెక్ సంస్థలన్నీ విశాఖవైపు చూస్తుండటంతో ఇప్పుడు నగరానికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం లాంటి అంతర్జాతీయస్థాయి మౌలిక సదుపాయలు కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. వికసిత్ భారత్ 2047 విజన్‌కు అనుగుణంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్లోబల్ టెక్ కేంద్రంగా మార్చే క్రమంలో గూగుల్ పెద్ద ముందడుగు కానుంది.
















