- జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించాలి
- కూటమి పార్టీల ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): గురువారం జరగబోయే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో అన్ని స్థానాలపై కూటమి అభ్యర్థులే దక్కించుకోవాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబునాయుడు కోరారు. బుధవారం ఆయన అమరావతిలో కూటమి పార్టీల ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… ప్రజలకు మనం అండగా నిలిస్తే వారు మనతోనే ఉంటారని మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాల ద్వారా నిరూపితమైందన్నారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేసిన నేతలు, కార్యకర్తలను ఆయన అభినందించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 95 శాతం స్ట్రైక్ రేట్ సాధించామన్నారు.
వారికి నామినేటెడ్ పోస్టులు
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లల్లో దక్కిన విజయం మన బాధ్యతను పెంచిందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ ఫలితాలు కూటమి సంక్షేమం-అభివృద్ధి-సుపరిపాలనకు గుర్తింపుగా అభివర్ణించారు. స్థానిక ఎన్నికల్లో సీట్లు దక్కించుకోలేని వారికి నామినేటెడ్ పోస్టులతో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో అనుకున్న విధంగానే ఫలితాలొచ్చాయన్నారు. పట్టణ స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. గుడ్ గవర్నెన్స్.. గుడ్ పాలిటిక్స్… ఇదే కూటమి ప్రభుత్వ విధానం అని తెలిపారు.
కూటమి ప్రభుత్వ కష్టాన్ని గుర్తించిన ప్రజలు
ప్రజలకు మంచి చేస్తే.. అన్ని స్థాయిల్లోనూ వారు గుర్తిస్తారని.. మన వెన్నంటే ఉంటారని సీఎం చంద్రబాబు చెప్పారు. పట్టణ స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఈ విషయాన్ని నిరూపించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం పడుతున్న కష్టాన్ని ప్రజలు గుర్తించారని వివరించారు. మంచికి.. మంచి ప్రభుత్వానికి అండగా ఉంటామని ఈ ఫలితాల ద్వారా ప్రజలు చాటి చెప్పార న్నారు. మరింత చక్కటి పాలన అందించేందుకు ప్రోత్సాహమిస్తూ ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు.
95 శాతం స్ట్రైక్ రేట్
పట్టణ స్థానిక ఎన్నికల్లో కూడా 95 శాతం స్ట్రైక్ రేట్ సాధించామని సీఎం చెప్పారు. ఓడిపోయిన కొన్నిచోట్ల కూడా కూటమి పార్టీలకు చెందిన రెబెల్సే గెలిచారన్నారు. స్థానికంగా ఉన్న చిన్నపాటి సమన్వయ లోపాలతో కొన్ని స్థానాలు కొల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కూటమి పార్టీల అభ్యర్థులు ఘన విజయం సాధించారని సంతోషం వ్యక్తం చేశారు.
అందుకే గెలిచాం
ఆర్థిక వ్యవస్థ దివాళా తీసినా సంక్షేమాన్ని అందిస్తున్నామని.. మరోపక్క అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు వివరించారు. డీఎస్సీతో టీచర్ రిక్రూట్మెంట్ సహా జాబ్ క్యాలెండర్ ద్వారా వివిధ శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని తెలిపారు. ప్రజలతో మమేకమవుతూ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పని చేస్తున్నా మని పేర్కొన్నారు. అందుకే గెలిచి చరిత్ర సృష్టించామని సీఎం సోదాహరణంగా చెప్పారు.
మిత్రపక్షాలను గౌరవించుకోవాలి
రాష్ట్రానికి.. తమకు న్యాయం చేయాలనే ప్రజలు కూటమికి పట్టంకడుతున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. మిత్రపక్షాలను గౌరవించుకోవాలి.. కూటమిలోని ఏ పార్టీ అభ్యర్థి అయినా మన అభ్యర్థ అన్నట్టుగా పని చేయాలని కేడర్‌కు సూచించారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను మించి జెడ్పీటీసీలు, ఎంపీటీసీ స్థానాలను గెలవాలని వారికి దిశానిర్దేశం చేశారు. చిన్నపాటి పొరపాటు కూడా జరగకూడదని.. పూర్తి సమన్వయంతో పని చేయాలని పార్టీ నేతలను అప్రమత్తం చేశారు.
కూటమి ధర్మం పాటించాల్సిందే
కూటమిలో ఐక్యత ఎంత మాత్రం చెడిపోకూడదని పార్టీ నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు. కుటుంబంలోను, పార్టీలోను, సంస్థల్లోను బేధాభిప్రాయాలు ఉంటాయి. కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత కట్టుబడి పని చేయాలి… కూటమి ధర్మాన్ని పాటించాలని శ్రేణులకు సూచించారు. పొత్తు ధర్మాన్ని పాటించని వారిని వదులుకోవడానికి కూడా సిద్ధమని ఈ సందర్భంగా ఆయన కుండబద్దలు కొట్టారు.
హింసను ప్రేరేపిస్తున్న గొడ్డలి పార్టీ..
సుపరిపాలనతో సమానంగా పొలిటికల్ గవర్నెన్స్ ఉండేలా చూస్తున్నామని సీఎం పేర్కొన్నారు. గొడ్డలి. పార్టీ హింసను ప్రేరేపిస్తోంది.. సంయమనం పాటించాలని పార్టీ కేడర్‌కు సూచించారు. ఓటమి తప్పదని భావించిన ఆ పార్టీ ఉనికిని చాటుకోవడానికి కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతోందని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో గొడ్డలి పార్టీకి ప్రజలు మరోసారి గుణపాఠం చెప్పారన్నారు. ఆ పార్టీ నేతలు సొంత బూత్‌లలోనూ గెలవలేకపోయారని వివరించారు.
టెలికాన్ఫరెన్స్‌లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జనసేన పార్టీ తరపున పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ ఏపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ పాటు పలువురు కీలక నేతలు పాల్గొన్నారు.



















