అమరావతి (చైతన్యరథం) : స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వేళ పుంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబం మళ్లీ తమ పాత రౌడీయిజాన్ని బయటకు తీసిందని తెలుగుదేశం పార్టీ నేత సప్తగిరి ప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటక నుంచి కిరాయి గుండాలు, పెయిడ్ రౌడీలు, గంజాయి బ్యాచ్లను 10 కార్లలో రప్పించి ప్రజలను, టీడీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసే కుట్ర చేశారని మండిపడ్డారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దాదాపు 30 ఏళ్లుగా పెద్దిరెడ్డి కుటుంబం సాగించిన అణచివేత, దౌర్జన్యాలను పుంగనూరు ప్రజలు మౌనంగా భరించారు. కానీ ఈరోజు వాహనాలు దూకించి దాడి చేయాలని చూస్తే ప్రజలే స్వచ్ఛందంగా తిరగబడ్డారు. ప్రజల ఆగ్రహాన్ని చూసి కిరాయి మూకలు తోకముడిచి తుర్రుమని పారిపోయే పరిస్థితి వచ్చింది. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న మిథున్ రెడ్డి 10 కార్లు, వందలాది మంది అల్లరి మూకలను వెంటేసుకుని నామినేషన్ కేంద్రాల వద్దకు వచ్చే హక్కు ఎవరిచ్చారు? మీరు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థినా? లేక అభ్యర్థిని ప్రతిపాదించే ప్రపోజరా? ఏ హోదా ఉందని కత్తులు, రాడ్లు, చైన్లతో నామినేషన్ కేంద్రాలపైకి వచ్చారు? గతంలో మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని 85 పంచాయతీల్లో 82 స్థానాలను బెదిరింపులతో ఏకగ్రీవం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.
నేడు కూడా అదే రౌడీయిజాన్ని, భయాందోళనలను పెట్టుబడిగా పెట్టి గెలవాలని చూస్తున్నారు. మేము చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు చూపి ఓట్లు అడుగుతుంటే.. మీరు మాత్రం దౌర్జన్యాలు, కక్షలనే నమ్ముకుంటున్నారు. వైసీపీ రౌడీలు చేసిన దాడిలో దాదాపు 15 మంది టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలై, ఎముకలు విరిగి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దౌర్జన్యాలు, దాడులు మీరే చేసి.. మళ్లీ అందరికంటే ముందు మీరే హైకోర్టుకు వెళ్లి శాంతిభద్రతలు క్షీణించాయని పిటిషన్లు వేస్తారా? డీజీపీ, హోం మంత్రి రాజీనామా చేయాలంటూ స్టేట్ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదులు చేస్తారా? ఇంతకంటే విడ్డూరం మరొకటి ఉంటుందా? పుంగనూరు గడ్డపై ఇకపై పెద్దిరెడ్డి కుటుంబం అరాచకాలు సాగవని, దౌర్జన్యాలకు భయపడే రోజులు పోయాయని ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని సప్తగిరి ప్రసాద్ హెచ్చరించారు.
పుంగనూరును చంబల్ లోయలా మార్చిన పెద్దిరెడ్డి కుటుంబానికి పతనం మొదలైంది
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 45 ఏళ్ల రాజకీయ జీవితంలో సాగించిన దౌర్జన్యాలు, అరాచకాలకు పుంగనూరు ప్రజలు చరమగీతం పాడే రోజు వచ్చిందని సప్తగిరి ప్రసాద్ స్పష్టం చేశారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా ప్రజలు పెద్దిరెడ్డి కుటుంబాన్ని చీదరించుకుంటూ తిరగబడుతున్నారని, వారి రాజకీయ పతనం అధికారికంగా మొదలైందని ఆయన హెచ్చరించారు. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో పెద్దిరెడ్డి పుంగనూరును ఒక రాక్షస రాజ్యంగా, చంబల్ లోయలా మార్చేశారు. నాడు ప్రతిపక్ష నేత హోదాలో నారా చంద్రబాబు నాయుడు గారు పుంగనూరు పర్యటనకు వస్తే, తమ రౌడీ మూకలను ఉసిగొల్పి రాళ్లదాడి చేయించిన దుర్మార్గ చరిత్ర పెద్దిరెడ్డిది. అంతటితో ఆగకుండా దాదాపు 700 మంది అమాయక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి, నియోజకవర్గంలో తీవ్ర భయాందోళనలు సృష్టించారు. ఏళ్ల తరబడి సాగిన అణచివేత నుంచి పుంగనూరు ప్రజలకు ఈరోజు నిజమైన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లభించాయి.
అందుకే రౌడీ మూకలు దాడులకు తెగబడినా భయపడకుండా ప్రజలే స్వయంగా తిరగబడ్డారు. దౌర్జన్యాలతో గెలవాలనుకునే పెద్దిరెడ్డి నైజాన్ని ప్రజలు తరిమికొడుతున్నారు. మేము ప్రజల కోసం చేసిన అభివృద్ధిని, అందించిన సంక్షేమాన్ని నమ్ముకుని ఎన్నికల్లోకి వెళ్తున్నాం. మా ప్రభుత్వం చేసిన పనులు కళ్ల ముందే కనిపిస్తున్నాయి కాబట్టే ప్రజలు ఎక్కడికెళ్లినా మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజల మద్దతు ఉన్న మాకు దౌర్జన్యాలు, గొడవలు చేయాల్సిన అవసరమే లేదు. ఎన్నికలు పూర్తిగా స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగుతాయి, ప్రజాస్వామ్యాన్ని కాపాడి తీరుతాం. ప్రజాక్షేత్రంలో ఓటమి తప్పదన్న భయంతోనే జగన్ మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి ముఠాలు మళ్లీ అరాచకాల బాట పట్టాయి. కానీ రాష్ట్రంలోని అన్ని పంచాయతీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడటం ఖాయం. రౌడీయిజం ఎప్పటికీ గెలవదు, అంతిమంగా ప్రజాస్వామ్యమే గెలుస్తుంది, ప్రజలే గెలుస్తారని స్పష్టం చేశారు
















