- రూ.3,222 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు
- అలిపిరి వద్ద యాత్రికుల టౌన్షిప్ నిర్మాణం
- మొదలైన మాస్టర్ ప్లాన్ రహదారులు
- టీటీడీ ఉద్యోగుల నివాస లేఅవుట్ పనుల ప్రారంభం
- వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- భక్తుల సమాచారానికి వెంకటాద్రి యాప్ ఆవిష్కరణ
- పవిత్రత విషయంలో ఎక్కడా రాజీపడబోమని స్పష్టం
Initiating the comprehensive development of Tirupati
అమరావతి/తిరుపతి(చైతనరథం): ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన తిరుమల తిరుపతి ప్రాంతాన్ని మరింత అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా, ఆదర్శ
నగరంగా తీర్చిదిద్దేలా చేపట్టిన పనులకు ముఖ్యమంత్రి చంద్రబా బు శ్రీకారం చుట్టారు.
తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, టీటీడీ పరిధిలో రూ.3,222 కోట్ల విలువైన అభివృద్ధి
పనులను సచివాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. తిరుమలకు వచ్చే భక్తుల
సౌకర్యాలను కల్పించేందుకు రూ.2,750 కోట్లతో సమీకృత టౌన్ షిప్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన
చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితమైన, ఆధ్యాత్మిక అనుభూతిని అందించేలా తిరుపతిలోని అలిపిరి సమీపంలో ఎస్వీ జూపార్కు రహదారి వద్ద సమీకృత యాత్రికుల టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేస్తున్నారు. మొత్తం రూ.2,750 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో వసతి, అన్నప్రసాదం, విశ్రాంతి, రవాణా, పార్కింగ్, వైద్యసేవలు, డిజిటల్ సమాచార కేంద్రాలు సహా భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఒకేచోట అందుబాటులోకి తీసుకు రానున్నారు.
భక్తుల వసతి కోసం రూ.1,332 కోట్లతో నాలుగు బ్లాకుల్లో 10 అంతస్తుల చొప్పున మొత్తం 2,700
గదులను నిర్మించనున్నారు. వీటి ద్వారా రోజు సుమారు 15 వేల మంది భక్తులకు వసతి కల్పించే
అవకాశం ఉంది. తిరుమల కొండపై వసతుల ఒత్తిడిని తగ్గించడంతో పాటు తిరుపతిలోనే భక్తులకు
మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడం. ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. అన్నదానం అత్యంత పవిత్రమైన సేవ అని పేర్కొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు… ఆకలితో వచ్చిన భక్తులకు అన్నప్రసాదం, అలసిపోయిన వారికి వసతి కల్పించడం ద్వారా దేవదేవుడికి సేవ చేసినట్లేనని పేర్కొన్నారు. ఇందులో భాగంగా రూ.160 కోట్లతో నిర్మించనున్న అన్నప్రసాద కేంద్రంలో ఒకేసారి 6 వేలా మంది భక్తులకు ఆహారాన్ని అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల వాహనాల పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు రూ.311 కోట్లతో 4,500 వాహనాలు నిలిపే బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయాన్ని నిర్మిస్తున్నారు. రూ.90 కోట్లతో 30 బస్ బేలతో కూడిన సమీకృత రవాణా టెర్మినల్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
రూ.242 కోట్లతో తొమ్మిది మాస్టర్ ప్లాన్ రహదారులు
తిరుపతి నగరంలో పెరుగుతున్న జనాభా. వాహనాల రద్దీ, భవిష్యత్ అవసరాలను దృష్టిలో.. ఉంచుకుని రూ.242 కోట్ల అంచనా వ్యయంతో తొమ్మిది మాస్టర్ ప్లాన్ రహదారులను నిర్మిం చనున్నారు. మొత్తం 20 కిలోమీటర్ల మేర చేపట్టే ఈ పనుల్లో తుడా రూ.127 కోట్లతో 16,50 కిలోమీటర్లు, టీటీడీ రూ.115కోట్లతో 3.60కిలోమీటర్ల రహదారులను అభివృద్ధి చేయనున్నాయి. ఈ రహదారులు జాతీయ రహదారులు 140, 71 మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడంతో పాటు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి వెళ్లే భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించనున్నాయి.
టీటీడీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం
శ్రీవారి సేవలో నిరంతరం నిమగ్నమయ్యే టీటీడీ ఉద్యోగుల కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్య మంత్రి తెలిపారు. ఉద్యోగులు, వారి కుటుంబాలు సొంతింటిలో ఆత్మగౌరవంతో జీవించాలన్న లక్ష్యంతో 418 ఎకరాల్లో నివాస లేఅవుట్‌ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. మొదటి, రెండో దశల్లో కలిపి మొత్తం 5,192 మంది ఉద్యోగులకు ఇళ్ల స్థలాల లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.230 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో టీటీడీ వాటాగా రూ.150 కోట్లు, ఉద్యోగుల వాటా రూ.80 కోట్లు వ్యయం చేయనున్నారు. అంతర్గ త రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకులు, నీటి సరఫరా పైప్ లైన్లు, మురుగునీటి శుద్ధి కేంద్రం, విద్యుత్ పంపిణీ వ్యవస్థలను అభివృద్ధి చేయనున్నారు. ఈ టౌన్ షిప్‌ను పర్యావరణ హితంగా నెట్ జీరోగా తీర్చిదిద్దాలని సీఎం సూచించా రు. ఉద్యోగుల కుటుంబాల్లో సంతోషం ఉంటే వారు మరింత అంకితభావంతో భక్తులకు సేవలందించగలరని పేర్కొన్నారు. వండుగలు, ప్రత్యేక సందర్భాల్లో సేవాభావంతో పనిచేస్తున్న టీటీడీ సిబ్బందిని అభినందించారు.
ఆధ్యాత్మిక అనుభూతి… ఆధునిక సాంకేతికత
తిరుమల చరిత్ర, శ్రీవారి వైభవం, ఆధ్యాత్మిక సంప్రదాయా లను భక్తులకు పరిచయం చేసేందుకు పిలిగ్రిమ్ ఎక్స్ పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. డిజిటల్ సమాచార కేంద్రం, అత్యవసర వైద్య సహాయ కేంద్రాలు, ఆధునిక భద్రతా వ్యవస్థలను కూడా అభివృద్ధి చేయాలని సూచిం చారు. భక్తులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు తిరుపతి నుంచి వెళ్లేటప్పుడు ప్రతిఒక్కరూ సంతృప్తికరమైన అనుభూతిని పొందేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తులకు సమాచారం తెలిపేం దుకు రూపొందించిన వెంకటాద్రి యాప్‌ను సీఎం ఆవిష్కరించారు. తిరుమల తరహా పవిత్రత దిగువన తిరుపతిలోనూ అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు. తిరుపతిని కేవలం యాత్రా కేంద్రంగా కాకుండా ఆధ్యాత్మికత, పర్యావరణ పరిరక్షణ, ఆధునిక సాంకేతి కత, విద్య, ఉపాధి, పర్యాటకంగా సమన్వయంతో అభివృద్ధి చేయా లని దిశానిర్దేశం చేశారు.
తిరుపతిలోని చెరువులన్నింటినీ అను సంధానించి సుందరంగా తీర్చిదిద్దాలని, కల్యాణి డ్యామ్ వరకు ఉన్న ప్రాంతాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. ఔషధ మొక్కల ప్రాంతాన్ని సందర్శకులకు ఆధ్యాత్మిక, ప్రకృతి అనుభూతిని అందించే ఎక్స్పీరియన్స్ సెంటర్‌గా అభివృద్ధి చేయా లన్నారు. వృక్షో గోవింద కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణ కు ప్రాధాన్యం ఇవ్వాలని, గోశాలల నిర్వహణ, గోసేవను ప్రోత్సహించాలని చెప్పారు. వన్యప్రాణుల సంరక్షణకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
వివాహాలు, సదస్సులు, క్రీడలకు కేంద్రంగా అభివృద్ధి
అన్నదానం, ప్రాణదానం, విద్యా దానం వంటి సేవా కార్యక్ర మాలను విస్తృతం చేయాలని తెలిపారు. శ్రీవారి సేవకుల తరహాలో ఇతర దేవాలయాల్లోనూ సేవా వ్యవస్థను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ప్రజలను సన్మా ర్గంలో నడిపించేలా ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించాలని, ముఖ్యంగా యువతలో ఒత్తిడిని తగ్గించి ఆధ్యాత్మికత వైపు నడిపించే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఆధ్యాత్మిక తను సాంకేతికతతో కలిపి ముందుకు తీసుకెళ్లాలని, శ్రీవారి వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింతగా చాటిచెప్పే కార్యక్రమా లు చేపట్టాలని చెప్పారు.
పవిత్రత విషయంలో ఎక్కడా రాజీపడ బోమని స్పష్టం చేశారు. మెరుగైన కనెక్టివిటీ, మౌలిక సదుపా యాలతో తిరుపతి త్వరలోనే వివాహ వేడుకలకు ప్రముఖ గమ్య స్థానంగా మారే అవకాశముందని అభిప్రాయపడ్డారు. అంతర్జా తీయ ప్రమాణాలతో కన్వెన్షన్ హాల్ ఏర్పాటు చేస్తే నగరంలో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని చెప్పారు. క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు ఏసీఏ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థానిక యువతకు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నైపు ణ్యాలు కల్పించాలని, ఉపాధి అవకాశాలు పెంచేలా శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
సమష్టి కృషితో ఆదర్శ నగరంగా తిరుపతి
దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు, యాత్రికులు తిరుపతిని చూసి రాష్ట్రం గురించి అంచనా వేస్తారని, అందుకే ఈ నగరాన్ని అత్యుత్తమ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరి పైనా ఉందని పేర్కొన్నారు. దేవాదాయ, పర్యాటక, పురపాలక శాఖలు సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు సాధించ వచ్చని చెప్పారు. పురపాలక శాఖ పట్టణాల అభివృద్ధితో పాటు ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలను పెంచే దిశగా పనిచేయాలని సూచించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, టీటీడీ ఉద్యోగుల సంక్షేమం, తిరుపతి నగర మౌలిక సదుపాయాల విస్తరణ ఈ లక్ష్యాలను సమన్వయం చేస్తూ తిరుపతిని దివ్యక్షేత్రంగా, ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం. రవిచంద్ర, పాలక మండలి సభ్యులు, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, ఆరణి శ్రీనివాసులు, తిరుపతి జిల్లా కలెక్టర్, తుడా అధికారులు తదితరులు వర్చువల్‌గా పాల్గొన్నారు.














