- మరింత వేగవంతంగా క్లియర్ చేయాలి
- జిల్లా కలెక్టర్లతో సమావేశాన్ని నిర్వహించాలి
- ఆర్టీజీఎన్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి(చైతన్యరథం): ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సచివాలయంలో సోమవారం ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. క్షేత్రస్థాయిలో అందుతున్న ప్రభుత్వ సేవలపై ఆరా తీశారు. ప్రస్తుతం పీజీఆర్ఎస్ విధానం ద్వారా ప్రజల సమస్యలను వీలైనంత మేరకు పరిష్క రించగలుగుతున్నామని, మరింత వేగంగా..సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్లతో సమావేశాన్ని నిర్వహించాలని సీఎస్ సాయిప్రసాద్ను ఆదేశించారు. ఆ సమావేశంలో 175 నియోజకవర్గాల నోడల్ అధికారులు ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత వాటిని పరిష్కరించే విషయంలో ఉద్యోగులకు, అధికారులకు జవాబుదారీతనం ఉండేలా చూడాలని సూచించారు. వివిధ శాఖలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, జారీ చేస్తున్న జీవోలను వక్రీకరిస్తూ ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపుతున్నారన్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖ జారీ చేసిన జీవోపై ఈ తరహా దుష్ప్రచారం ఎక్కువగా ఉందని తెలిపారు. తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు సమర్థవంతంగా తిప్పికొడుతూ వాస్తవ సమాచారం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో సీఎస్ సాయిప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.














