- ఉగాది సందర్భంగా 10 వేలకుపైగా ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించిన నారా లోకేష్
- దశలవారీగా నోటిఫికేషన్ల జారీ.. నిరుద్యోగుల కలలను నెరవేర్చడమే లక్ష్యం
- ఎమ్మెల్సీ వేంపాడ చిరంజీవి
మంగళగిరి (చైతన్య రథం) నిరుద్యోగులకు అండగా నిలుస్తూ, ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల ఆశలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి అన్నారు. నిరుద్యోగుల అనుకూల ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వాన్ని అభివర్ణించారు. ప్రతి సంవత్సరం ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల కావాలని, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తుంటారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1956లో ఏర్పడినప్పటి నుంచి దాదాపు ఏడు దశాబ్దాలుగా నిరుద్యోగులు ఎదురుచూస్తున్న వార్షిక ఉద్యోగాల నోటిఫికేషన్ల ఆశను నెరవేర్చే దిశగా ప్రస్తుత ప్రభుత్వం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. 2026లో ఉగాది సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 10 వేలకుపైగా ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించడం ఎంతో సంతోషకరమైన విషయమని చిరంజీవి అన్నారు. కేవలం ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటించడమే కాకుండా, దాన్ని ఆచరణలో అమలు చేయడం ముఖ్యమని తెలిపారు. అందులో భాగంగా ఇప్పటికే మే 15న మొదటి దశలో 1,500 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వివరించారు.
సెప్టెంబర్ 15న గ్రూప్-1తో సహా 20 రకాల ఉద్యోగాలకు సంబంధించి మొత్తం 892 పోస్టులతో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు జారీ చేసిందని తెలిపారు. సెప్టెంబర్ 16న పోలీసు నియామకాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదలైందని చెప్పారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను దశలవారీగా ముందుకు తీసుకెళ్తూ నిరుద్యోగుల్లో విశ్వాసాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్లో భాగంగా మూడో, నాలుగో దశ నోటిఫికేషన్లు అక్టోబర్ 15న విడుదల కావాల్సి ఉండగా, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నోటిఫికేషన్లు ఆలస్యమై నిరుద్యోగులు నిరాశకు గురికాకూడదనే ఉద్దేశంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకున్నారని చిరంజీవి తెలిపారు. రెండు రోజుల ముందుగానే ఈ దశల నోటిఫికేషన్లు విడుదల చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలో సుమారు 1,500 ఉద్యోగాలకు సంబంధించి సంక్షిప్త నోటిఫికేషన్ విడుదలైందని చిరంజీవి వివరించారు. వీటిలో గ్రూప్-2, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఆఫీసర్, డైట్ లెక్చరర్లు, సీనియర్ లెక్చరర్లు, ఎస్ఈఆర్టీ లెక్చరర్లు, సుమారు 500 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయని తెలిపారు. వీటితోపాటు 686 గ్రూప్-2 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల ప్రక్రియను వేగవంతం చేయడం నిరుద్యోగులకు ప్రయోజనకరమని అన్నారు.
అదేవిధంగా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్తగా 2,700కుపైగా పోస్టులతో డీఎస్సీకి సంబంధించి కూడా సంక్షిప్త నోటిఫికేషన్ విడుదలైందని చిరంజీవి తెలిపారు. ప్రభుత్వ రంగంతోపాటు ప్రైవేటు రంగంలోనూ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్లను దశలవారీగా విడుదల చేస్తూ నిరుద్యోగుల ఆశలకు భరోసా కల్పిస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు లక్షలాది మంది నిరుద్యోగుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.
ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ చిరంజీవి కోరారు. జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన ఉద్యోగాలకు అనుగుణంగా తమకు ఆసక్తి ఉన్న పోస్టులను ఎంపిక చేసుకుని ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. త్వరలోనే ఉద్యోగాలు సాధించి తమ కుటుంబాల్లో ఆనందం నింపాలని ఆకాంక్షించారు. నిరుద్యోగుల ఆశలను అర్థం చేసుకుని, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని ఆయన మరోసారి స్పష్టం చేశారు.













