- నిబంధనల పేరుతో జాప్యం సరికాదు
- బిజినెస్ రూల్స్ మార్పునకు కార్యాచరణ
- రోటీన్‌కు స్వస్తి..వినూత్నంగా ఆలోచించాలి
- కుల పత్రాల జారీలో ఇబ్బందులు తొలగించాలి
- పరిష్కారం కాని సమస్యలపై ఫోకస్ పెట్టండి
- సైబర్ మోసాలను అరికట్టేలా పటిష్ట వ్యవస్థ
- ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశం
అమరావతి(చైతన్యరథం): టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందు బాటులోకి వచ్చింది..ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందేలా ఉండాలి కానీ.. నిబంధనలు అడ్డుకాకూడదని ముఖ్య మంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందేవిధంగా అవసరమైన మేరకు బిజినెస్ రూల్స్ సవరించాలని..దానికి సంబంధించిన కార్యాచరణ సిద్దం చేయా లని ఆదేశించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్ పనితీరు, వివిధ శాఖల కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అమలవు తున్న తీరుపై సమీక్షించారు. ప్రజల కోసం అధికారులు, ఉద్యో గులు, క్షేత్రస్థాయి సిబ్బంది పని చేయడం ఎంతముఖ్యమో… దానికి అనుగుణంగా ఫలితాలు చూపించడం కూడా అంతే ముఖ్యం. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు, ప్రభుత్వం అందిస్తున్న సేవలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నాం. ఆ సమాచారం ఆధారంగా అధికారులు, ఉద్యోగుల పనితీరును అంచనా వేయాలి. బాగా పనిచేస్తున్న అధికారులను అభినంది ద్దాం.. సరిగా పనిచేయని అధికారులకు ఓరియేంటేషన్ క్లాసులు తీసుకుందాం. రోటీన్ పద్దతుల్లో పనిచేయడం కాకుండా వినూ త్నంగా ఆలోచించాలి. సేవలను సులభతరం చేయాలి. రోటీన్ పద్దతుల్లో చేసే పనివిధానానికి కాలం చెల్లింది. ప్రతి నియోజక వర్గానికి ప్రణాళిక శాఖ నుంచి నోడల్ అధికారులను నియమిం చాం. వారి సేవలను పూర్తిగా వినియోగించుకోవాలి. ప్రజలకు సేవలను త్వరితగతిన చేరవేసేందుకు బిజినెస్ రూల్స్ మార్చాలని గతంలోనే అనుకున్నాం. దీనికి సంబంధించిన కార్యాచరణను సిద్దం చేయాలని ఆదేశించారు.
కన్విన్స్ చేయాలి..సమస్యలు పరిష్కరించాలి
రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారంపై మరింత శ్రద్ధ పెట్టాలి. ఏడాదిలోగా రెవెన్యూ సమస్యలను తీరుస్తామని హామీ ఇచ్చాం. నిర్దేశించుకున్న ఏడాది గడువులో ఇప్పటికే కొంతకాలం ముగిసింది. పరిష్కారం కాని సమస్యలపై ఫోకస్ పెట్టండి. ముఖ్యంగా కుటుంబ తగాదాలతో ఉత్పన్నమయ్యే రెవెన్యూ సమ స్యల పరిష్కారానికి సంబంధిత వ్యక్తులతో అధికారులు, ఉద్యోగు లు మాట్లాడాలి. వారిని కన్విన్స్ చేయాలి. గొడవలు పడితే నష్టమే తప్ప లాభం ఉండదని వివరించాలి. వీలైనంత మేరకు సమస్యను పరిష్కరించేందుకు మానవీయ కోణంలో ఆలోచించి పనిచేయాలి. ఇక కుల ధృవీకరణ పత్రాల జారీలో ఎలాంటి ఇబ్బందులు లేకుం డా చూడాలి. ఆన్‌లైన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించేలా చూడాలి. అన్నిస్థాయిల్లోని ఆస్పత్రుల్లో సేవలందించే విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దు. ఆర్టీజీఎస్ విభాగానికి అన్ని శాఖల సమాచారం పూర్తిగా అందించాలి. దీన్ని సమన్వయం చేసుకునేలా ప్రతి శాఖ నుంచి ఓ అధికారిని డిజిగ్నేట్ చేయాలి. సైబర్ ఫ్రాడ్స్ అరికట్టేలా పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమీక్షలో సీఎస్ సాయిప్రసాద్, వివిధ శాఖల ఉన్నతా ధికారులు పాల్గొన్నారు.
















