- విభజన చట్టం హామీల అమలుపై కీలక చర్చలు
- నేడు సదరన్ జోనల్ కౌన్సిల్ మీట్‌కు హాజరు
- మహాబలిపురంలో అమిత్‌షా అధ్యక్షతన సమావేశం
- హాజరుకానున్న ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
అమరావతి(చైతన్యరథం): తమిళనాడులోని మహాబలిపురం వేదికగా గురువారం జరగనున్న 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను సమావేశంలో ప్రస్తావించనున్నారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయం, అంతర్రాష్ట్ర సమస్యల పరిష్కారంతో పాటు ఏపీ పునర్విభజన చట్టం అమలు, పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై సీఎం చర్చించ నున్నారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు పూర్తవుతున్నా పునర్వి భజన చట్టంలోని వివిధ అంశాలు ఓ కొలిక్కి తీసుకువచ్చే అంశా న్ని సీఎం ప్రస్తావించనున్నారు. షెడ్యూల్-9-10లోని సంస్థల విభజన, ఆస్తులు-అప్పుల పంపకం, పెండింగ్ ఆర్థిక అంశాల పరిష్కారంపై కేంద్రం చొరవ తీసుకోవాలని కోరనున్నారు. రెవె న్యూ గ్యాప్, పన్ను సంబంధిత అంశాలను సీఎం ప్రస్తావించ నున్నారు.
కేంద్రం దృష్టికి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు
రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న మౌలికసదుపాయాల ప్రాజెక్టులు దుగరాజుపట్నం పోర్టు, విశాఖపట్నం-విజయవాడ మెట్రో ప్రాజె క్టులు, రైల్వే కనెక్టివిటీ, విమానాశ్రయాల అభివృద్ధి, పారిశ్రామిక కారిడార్ల వంటి అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వేజోన్ ఏర్పాటు, పోలవ రం ప్రాజెక్టుకు నిధులు వంటి అంశాల్లో కేంద్ర సహకారానికి కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు మిగిలిన ప్రాజెక్టులకు వేగం గా అనుమతులు, నిధులు, కేంద్ర సహకారం కోరనున్నారు.












