- ఇప్పటివరకూ రూ.518 కోట్ల పరిహారం
అమరావతి(చైతన్యరథం): వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభోత్సవానికి గడువు దగ్గర పడుతున్న వేళ నిర్వాసిత గ్రామా ల ప్రజలకు పరిహారం అందిస్తూ ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఇళ్లు కోల్పోయి త్యాగాలు చేసిన నిర్వాసిత కుటుంబాలకు అండగా నిలుస్తోంది. జూన్ 27న రూ.300 కోట్లు అందించిన ప్రభుత్వం…బుధవారం ముంపు బాధితులకు మరో రూ.200 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం అందించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శాసన సభ ఆవరణలో నిర్వాసిత కుటుంబాలకు రూ.200 కోట్ల చెక్కును అందజేశారు. ఇప్పటివరకూ వెలిగొండ నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.518 కోట్లను పరిహారంగా అందజేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రైతులు, నిర్వాసితులు చేసిన త్యాగాలను ప్రభు త్వం గుర్తిస్తోందని వ్యాఖ్యానించారు. మిగతా పరిహారం సొమ్ము నూ త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. వెలిగొండ నిర్వాసి తులను ఆదుకున్నది తమ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. మంచి చేసే ప్రభుత్వాలను గుర్తించాలని చెప్పారు. భూములు, ఇళ్లను కోల్పోయిన తమకు ప్రభుత్వం అండగా నిలిచి పరిహారం అందిం చడం పట్ల నిర్వాసితులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజా ప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. కాగా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సర్వం కోల్పోతున్న బాధితులకు అన్ని విధాలా అండగా నిలిచేలా ప్రభుత్వం కార్యాచ రణ చేపట్టింది. సొంతంగా ఇళ్లు నిర్మించుకున్నందుకు గానూ ఓటీఎస్ కింద 2,557 కుటుంబాలకు ప్రభుత్వం రూ.318 కోట్ల మేర పరిహారం ఇప్పటికే చెల్లించింది. మరో 1,600 కుటుంబా లకు ఓటీఎస్ కింద రూ.200 కోట్లు పరిహారానికి సంబంధించి చెక్కును చంద్రబాబు నిర్వాసితులకు అందించారు. దీంతో నిర్వా సితులకు ఇప్పటివరకు పరిహారం కింద 4,157 కుటుంబాలకు రూ.518 కోట్లను ప్రభుత్వం చెల్లించినట్లంది. నిర్వాసితుల కోసం ఏడు పునరావాస కాలనీల్లో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. వేములకోట మినహా మిగిలిన ఆరు కాలనీల్లో మౌలిక సదుపాయాల పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయి. దీంతో ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలు ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో నిర్మించిన ఇళ్లకు తరలివెళుతున్నాయి.












