- బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడి
- తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి
- ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా
అమరావతి(చైతన్యరథం): విశాఖలో టీచర్ కొట్టడంతో తరగతి గదిలోనే ఆరేళ్ల బాలుడు ప్రణయ్ తేజ్ కుప్పకూలిపోయాడు. విశాఖ వన్‌టౌన్ ప్రాంతంలోని లిటిల్ గార్డెన్ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. అపస్మారకస్థితిలోకి వెళ్లిన బాలుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాబు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో అక్కడి నుంచి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. హోంవర్క్ చేయలేదని టీచర్ మందలించడంతో పాటు దాడి చేయడం కారణంగానే ప్రణయ్ మరణించాడని బంధువులు ఆరోపిస్తున్నారు. కేజీహెచ్‌లో బాలుడి మృతదేహాన్ని చూసి తల్లి దండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని కొట్టిన టీచర్‌తో పాటు స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
బాలుడి మృతి బాధాకరం: లోకేష్
విశాఖ లిటిల్ గార్డెన్ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్ కొట్టడంతో ఆరేళ్ల ప్రణయ్ తేజ్ మృతిచెందటం బాధాకరమని మంత్రి నారా లోకేష్ ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధ్యులపై, సంబంధి త స్కూలు యాజమాన్యంపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటా మని తెలిపారు. ప్రణయ్ తేజ్ తల్లిదండ్రులకు నా ప్రగాఢ సాను భూతి తెలిపారు. మీకు కలిగిన నష్టం ఎవ్వరూ పూడ్చలేనిదని ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. మా ప్రభుత్వం మీకు అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు.












