- టీడీపీ శ్రేణులు సంయమనం పాటించాలి
అమరావతి, అక్టోబర్ 16: వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, ఆయన అనుచరుల దౌర్జన్యపూరిత వైఖరిని ఉపేక్షించే ప్రసక్తే లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ప్రజలను, అధికారులను భయభ్రాంతులకు గురిచేసే చర్యలకు అడ్డుకట్ట వేయాలని, ఘటనల్లో బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రాజకీయ పలుకుబడిని అడ్డుపెట్టుకుని అరాచకాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. మిథున్రెడ్డి, ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం గతంలోనూ దౌర్జన్యపూరితంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయని పల్లా పేర్కొన్నారు. పుంగనూరు ఘటనలో చోటుచేసుకున్న పరిణామాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటిస్తూ ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరించాలని పల్లా సూచించారు. ఎవరెంతగా రెచ్చగొట్టినా చట్టాన్ని గౌరవించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించకూడదని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గొడ్డలిపార్టీ దౌర్జన్యాలకు పాల్పడి, ఏకగ్రీవాల పేరుతో ప్రత్యర్థులకు అవకాశం లేకుండా చేసిందని విమర్శించారు. ఈసారి అలాంటి అక్రమాలకు తావులేకుండా ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని కోరారు. నామినేషన్ల నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలో ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజల తీర్పే కీలకం కావాలి తప్ప, బెదిరింపులు, దౌర్జన్యాలు కాదు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.















