అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల సవరణకు సంబంధించి ఏర్పాటు చేసిన 12వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) చైర్మన్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. 1983 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన దినేష్కుమార్ గతంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆయనను 12వ వేతన సవరణ సంఘం చైర్మన్ నియమిస్తూ ప్రభుత్వం ఈనెల 1న జీవో ఎంఎస్ నంబర్ 200 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాదిలోగా పీఆర్సీ నివేదికను సమర్పించాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఉద్యోగ సంఘాలనుంచి వివరాల సేకరణ
పీఆర్సీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన దినేష్ కుమార్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలనుంచి అవసరమైన సమాచారాన్ని సేకరించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధుల నుంచి కూడా పూర్తి వివరాలను తీసుకొని వేతన సవరణకు సంబంధించిన అంశాలపై సమగ్ర అధ్యయనం చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఉద్యోగుల వేతనాల పెంపునకు సంబంధించిన సిఫారసులతో కూడిన నివేదికను నిర్దేశిత ఏడాది గడువులోగా ప్రభుత్వానికి సమర్పించనున్నారు.
పీఆర్సీ చైర్మను అభినందనలు
దినేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి వి వినయ్ చంద్, అదనపు కార్యదర్శి గౌతమ్ అల్లాడ ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణతో పాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు దినేష్ కుమార్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. దుశ్శాలువతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.














