- రిజర్వేషన్ బిల్లును అడ్డుకుని అన్యాయం చేశారు
- కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు
అమరావతి(చైతన్యరథ:): మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకుని మహిళలకు తీవ్ర అన్యాయం చేశాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని, దాని మిత్రపక్షాలను మహిళలు క్షమించరని అన్నారు. 2023లో నారీశక్తి వందన్ అధినియమ్ చట్టాన్ని తెచ్చినప్పుడు అందరూ మద్దతు ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు. తాజాగా మహిళా బిల్లుకు సాంకేతికంగా కొన్ని సవరణలు తీసుకొచ్చామని అన్నారు. విపక్ష నేతలకు మహిళలంటే ఎంత వ్యతిరేకత ఉందో అర్థమైందని అన్నారు. మహిళా బిల్లు వీగిపోయే లా రాజకీయ కుట్రలు చేశారని మండిపడ్డారు. డీలిమిటేషన్‌ను ఎందుకు అడ్డుకున్నారో విపక్షాలు చెప్పాలని మంత్రి రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. గతంలో నాలుగుసార్లు డీలిమిటేషన్ చేశారని, ఈసారి కొత్తగా చేస్తున్నదేమీ కాదని అన్నారు. గతంలో ప్రతిపక్షాలు చెప్పిన ప్రకారమే డీలిమిటేషన్ చేశామని, తామేమీ మార్చలేదని అన్నారు. డీలిమిటేషన్‌పై ఎందుకు భయపడుతు న్నారని ప్రతిపక్షాలను మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు.
డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికీ, ఏ పార్టీకీ, ప్రాంతానికీ అన్యాయం జరగదని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ గతంలో ఏ విధంగా జరిగిందో ఇప్పుడూ అదేవిధంగా చేశామని అన్నారు. మరి కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు డీలిమిటేషన్ బిల్లును ఎందుకు వ్యతిరేకించాయని ప్రశ్నించారు. మహిళలకు రిజర్వేషన్ ఇవ్వకుం డా కాంగ్రెస్ చూసిందని ఆరోపించారు. ప్రధాని మోదీ వచ్చిన తరువాత భవ్య మందిరం రామ మందిరం నిర్మాణం జరిగిందని అన్నారు. సున్నితమైన రామ మందిరం అంశం, ఆర్టికల్ 370 వంటి అంశాలను ప్రధాని పరిష్కరించారని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన తరువాత కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ వేడుకలు చేసుకోవడం బాధాకరమైన అంశమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దిద్దుకోలేని తప్పు చేసిందని అన్నారు. మహిళలకు రిజర్వేషన్ ఇచ్చేందుకు కృషి చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.














