- సీఎం చంద్రబాబు థియరీని నిరూపిస్తున్న ఏపీ
- రెండేళ్లలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు..
- 1.22 లక్షలమందికి ఉపాధి అవకాశాలు
- విదేశీ పర్యాటకుల సంఖ్యలో 127శాతం హైక్
- అంతర్జాతీయ బ్రాండ్లకు ఏపీ మ్యాప్‌పై చోటు
- డిజిటల్ ప్రచారం.. డ్రైవర్-గైడ్ వరకు
- అవార్డులను కొల్లగొడుతున్న ఏపీ పర్యాటక శాఖ
అమరావతి (చైతన్య రథం): “అన్ని ఇజాలు పక్కకు పోతాయి. చివరకు టూరిజమే మిగులుతుంది” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ చెబుతుంటారు. ఆ మాటలు కేవలం నినాదాలు కావని.. వాటి వెనుక పటిష్ఠమైన ప్రణాళిక ఉందని రెండేళ్ల కూటమి పాలన నిరూపిస్తోంది. పర్యాటకరంగాన్ని రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ముఖ్య చోదక శక్తిగా మార్చే దిశగా ఏపీ వేగంగా అడుగులేస్తోంది. టూరిజం పాలసీ 2024-29తో ఐదేళ్ల స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను కూటమి ప్రభుత్వం నిర్దేశించింది. పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించి పెట్టుబడిదారులకు క్యాపిటల్ సబ్సిడీలు, ఎస్‌జీఎస్‌టీ రీయింబర్స్‌మెంట్, స్టాంప్ డ్యూటీ మినహాయింపువంటి ఆకర్షణీయమైన రాయితీలు ప్రకటించింది. దేశంలో తొలిసారిగా టూరిజం ల్యాండ్ అలాట్‌మెంట్ పాలసీ 2025 ద్వారా పారదర్శక పద్ధతిలో భూకేటాయింపులు జరుగుతున్నది ఏపీలోనే. ఈ చర్యల ఫలితం వెంటనే కనిపిస్తోంది. రెండేళ్లలో రూ.20 వేల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించారు. 117 ఎంఓయూలు కుదిరాయి. వీటి ద్వారా 1,22,637 మందికి ఉపాధి లభించనుంది.
అంతర్జాతీయ బ్రాండ్లకు ఏపీ మ్యాప్‌పై చోటు
తాజ్, మారియట్, ఐటీసీ, హయత్, ఒబెరాయ్, హిల్టన్ సహా 14 అంతర్జాతీయ హోటల్ బ్రాండ్లు రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాయి. వీటి ద్వారా కొత్తగా 7,770 హోటల్ గదులు అందుబాటులోకి రానున్నాయి. మైస్ (సమావేశాలు, ప్రదర్శనలు) పర్యాటకానికి అమరావతి, విశాఖపట్నం, తిరుపతి వేదికలుగా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.
మల్టీ-ఎక్స్‌పీరియన్స్ టూరిజం గ్రిడ్
రాష్ట్రాన్ని ఒక సమగ్ర పర్యాటక గ్రిడ్‌గా రూపాంతరం చేసే ప్రక్రియ జోరుగా సాగుతోంది. విశాఖ, అరకు, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతిలలో 7 యాంకర్ హబ్‌లు, 25కు పైగా ప్రత్యేక సర్క్యూట్‌లు అభివృద్ధి అవుతున్నాయి. కార్డెలియా సంస్థ ద్వారా విలాసవంతమైన క్రూయిజ్ సేవలు, టైడావద్ద లగ్జరీ టెంట్ సిటీలు, ఈజ్‌మైట్రిప్ సహకారంతో హెలీ టూరిజం, లక్స్ క్యారవాన్స్ ద్వారా క్యారవాన్ పర్యాటకం అందుబాటులోకి వచ్చాయి. సూర్యలంకలో హౌస్‌బోట్లు, వాటర్ స్పోర్ట్స్ విజయవంతంగా నడుస్తున్నాయి. వచ్చే మూడు నెలల్లో భవానీ ఐలాండ్, సరస్వతీ ఘాట్, పుష్కర్ ఘాట్, గండికోటలోనూ ఇవి పర్యాటకులను అలరించనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 14 ప్రాంతాలలో దాదాపు 30 రకాల వినూత్న కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. త్వరలో మరో 21 ప్రాంతాలలో 100కు పైగా కొత్త పర్యాటక అంశాలు అందుబాటులోకి రానున్నాయి. పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేక బీచ్ ప్రొటెక్షన్ ఫోర్స్ కూడా సిద్ధమవుతోంది.
పర్వదినాల్లో పర్యాటక శోభ
ఉత్సవాలు, పండుగలను పర్యాటక అభివృద్ధికి సాధనంగా మార్చడంలో ఏపీ ముందంజలో ఉంది. విజయవాడ ఉత్సవ్, అరకు చలి ఉత్సవ్, మసులా బీచ్ ఫెస్టివల్, అమరావతి ఆవకాయ్ ఫెస్టివల్, ఫ్లెమింగో ఫెస్టివల్‌వంటి ఉత్సవాలు రాష్ట్రానికి జాతీయస్థాయి ప్రచారం తీసుకొస్తున్నాయి. పురాతన కోనసీమ జగ్గన్నతోట ప్రభల ఉత్సవానికి స్టేట్ ఫెస్టివల్ హోదా లభించడంతో లక్షలాది పర్యాటకులు తరలి వచ్చారు. యోగాంధ్ర సహా 10 ప్రధాన ఉత్సవాల్లో సుమారు 15 లక్షలమంది పాల్గొన్నారని అంచనా. 8 జిల్లాల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలకు 11 లక్షలమంది హాజరయ్యారు.
డిజిటల్ ప్రచారం.. డ్రైవర్-గైడ్ వరకు
సోషల్ మీడియా ద్వారా 90 లక్షలమంది నెటిజన్లకు ఏపీ పర్యాటక ప్రాంతాలు చేరాయి. 110 షార్ట్ వీడియోలు, రీల్స్ తయారయ్యాయి. దేశంలోనే తొలిసారిగా రాపిడో భాగస్వామ్యంతో ఆటో, టాక్సీ డ్రైవర్లకు ‘డ్రైవర్-కమ్-గైడ’ శిక్షణ ఇచ్చారు. కొండపల్లి బొమ్మలు, లేపాక్షి వారసత్వాన్ని గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌లపై ప్రదర్శించారు. ఎయిర్‌బీఎన్‌బీ, మేక్ మైట్రిప్ సహా పలు సంస్థల భాగస్వామ్యంతో 1,855 హోమ్‌స్టేలను అనుసంధానించారు. ప్రత్యేక ‘ఏపీ హోమ్‌స్టే పోర్టల’ కూడా అందుబాటులోకి వచ్చింది.
కేంద్రంనుంచి రూ.428 కోట్లు
రాష్ట్ర పర్యాటకాభివృద్ధికి కేంద్రం 8 ప్రాజెక్టులకు రూ.428 కోట్లు మంజూరు చేసింది. స్వదేశీ దర్శన్ 2.0 కింద సూర్యలంక బీచ్‌కు రూ.97.52 కోట్లు, బొర్రా గుహలకు రూ.29.87 కోట్లు, గండికోట అభివృద్ధికి రూ.77.91 కోట్లు, అఖండ గోదావరి పునరుద్ధరణకు రూ.94.44 కోట్లు, సింహాచలానికి రూ.54.04 కోట్లు, అన్నవరం దేవస్థానానికి రూ.25.32 కోట్లు, అహోబిలం స్పిరిచువల్ ఒడిస్సీకి రూ.24.96 కోట్లు, నాగార్జున సాగర్ బౌద్ధ సర్క్యూట్‌కు రూ.25 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులన్నీ జూలై 2026నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.
పెరిగిన పర్యాటకులు.. లభించిన అవార్డులు
కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా పర్యాటకుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 10.10% పెరిగింది. అందులో అత్యుత్సాహకరమైన అంశం ఏమిటంటే విదేశీ పర్యాటకుల సంఖ్యలో ఏకంగా 126.87% వృద్ధి నమోదవడం. ఈ విజయాలను గుర్తించిన నీతి ఆయోగ్ తన ప్రచురణలో ఏపీ పర్యాటకాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. దక్షిణాదిలో అతి పెద్ద ట్రావెల్ ఎక్స్‌పో అయిన గ్లోబల్ ట్రావెల్ మార్కెట్-2026 సంస్థ ఏపీని ఉత్తమ పర్యాటక ప్రచార రాష్ట్రంగా ఎంపిక చేసింది. జూన్ 4న తిరువనంతపురంలో మంత్రి కందుల దుర్గేష్ ఈ అవార్డు అందుకోనున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఇప్పటివరకు 30 జాతీయ, 3 అంతర్జాతీయ ప్రదర్శనల్లో పాల్గొని ఏపీ అందాలను ప్రపంచానికి చాటి చెప్పింది.
లక్ష్యాలపై దృష్టి
50,000 క్లాసిఫైడ్ గదులు, 10,000 హోమ్‌స్టేలు, 20శాతం జీవీఏ సాధన, 5 లక్షల ఉద్యోగాల కల్పన -ఇవీ పర్యాటక శాఖ నిర్దేశించుకున్న లక్ష్యాలు. “ఏపీ ప్రకృతి ప్రసాదించిన నందనవనం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో రెండేళ్లలో పర్యాటక శాఖను అభివృద్ధి బాట పట్టించాం. సరికొత్త ఆలోచనలతో రండి, పెట్టుబడులు పెట్టండి” అని మంత్రి కందుల దుర్గేష్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నారు.
















