- గిరిజనుల ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకోవటం సరికాదు
- సరిహద్దు ప్రాంతాల్లో సమన్వయంతో వ్యవహరించాలి
- గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి
సాలూరు (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ సరిహద్దుల్లో పార్వతీపురం మన్యం జిల్లాలోని కొఠియా గ్రామాల ప్రజలపై ఒడిశా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, సాలూరు ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి మండిపడ్డారు. ఇప్పటికే ఏపీ, ఒడిశా సరిహద్దుల్లోని ఈ గ్రామాలపై పోలీసుల జులుంను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. ఆంధ్రప్రభుత్వం నిర్వహిస్తున్న సర్పంచ్ ఎన్నికలను బహిష్కరించాలని ఒడిశా పోలీసులు కొఠియా గ్రామాల ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల్లో పోటీకి సిద్ధపడ్డ శనివారం అర్ధరాత్రి ఆరుగురు గిరిజనులను ఒడిశా పోలీసులు కిడ్నాప్ చేశారు.
ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం మంత్రి సంధ్యారాణిని కొఠియా గ్రామాల ప్రజలు కలిసి.. ఆరుగురు గిరిజనులను కిడ్నాప్ చేశారంటూ ఆమె దృష్టికి తీసుకెళ్లారు. తమ గ్రామాల్లో ఒడిశా పోలీసులు అణిచివేత చర్యలకు పాల్పడుతున్నారని ఆమెకు విన్నవించుకున్నారు. దీనిపై మంత్రి సంధ్యారాణి స్పందిస్తూ సాలూరు నియోజకవర్గంలోని సరిహద్దు గిరిజన గ్రామస్తులపై ఒడిశా పోలీసులు వేధింపులు బాధాకరమని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీకి సిద్ధపడ్డ ఆరుగురు గిరిజనులను రాత్రికి రాత్రే మాయం చేసిన ఒడిశా ప్రభుత్వంపై మంత్రి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారన్నారు. ఏ పార్టీ వారినైనా సరే వివాదాస్పద గ్రామాల గిరిజన ప్రజలను వేధింపులకు గురిచేయడం దారుణం. ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఒడిశా పోలీసులు వ్యవహరిస్తున్న తీరును సరికాదు.
కొటియా ప్రాంతంలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 6 మందిని కొరాపుట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల్లో పోటీ చేయడం ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ హక్కును అడ్డుకోవడం సమంజసం కాదు. సాలూరు మండల కొఠియా ప్రజలను అకారణంగా నిర్బంధించడం, వారిని భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. అదుపులోకి తీసుకున్న వారిని ఎటువంటి ఆలస్యం లేకుండా తక్షణమే విడుదల చేయాలని ఒడిశా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజన ప్రజలు ప్రశాంతంగా జీవించేలా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరించాలి. గిరిజనుల హక్కులు, స్వేచ్ఛ, ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను, గిరిజనుల హక్కులను కాపాడే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోదని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు.




















