విశాఖపట్నం (చైతన్యరథం): విశాఖ సమీపంలోని గంగవరం బీచ్ సుందర దృశ్యాలకు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీం ద్రా ఫిదా అయ్యారు. దేశంలో ఎక్కువ మంది మాట్లాడుకునే తీరప్రాంత ప్రదేశాల్లో ఎందుకు లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “ఇది మనకు తెలిసిన కొబ్బరి చెట్లు, పచ్చదనం దృశ్యాలు కనిపించే సాధారణ బీచ్ లాంటిది కాదు.
ఎత్తయిన రాతి కొండలతో కఠినమైన, ఒకవిధమైన పురాతన అందం ఇక్కడ ఇక్కడ కనిపిస్తోంది. ఇలాంటి సహజ సౌందర్యమే నన్ను ఎక్కువగా ఆకర్షిస్తుంది. ఇక్కడ సేద తీరడమే కాకుండా.. ప్రశాంతంగా కాసేపు ఆత్మపరిశీలన కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచంలోని టెక్ దిగ్గజాలు.. భారీ డేటా సెంటర్లు, ఏఐ మౌలిక సదుపాయాల నిర్మాణానికి వైజాగ్‌కు వస్తున్నాయి. కానీ, ఇక్కడి దృశ్యాలను చూస్తుంటే లక్షల ఏళ్ల క్రితమే ప్రకృతి పెద్దఎత్తున విస్తరణ ప్రక్రియను మొదలుపెట్టినట్లు అనిపిస్తోంది. విశాఖపట్నం ప్రధాన టెక్ హబ్ గా వేగంగా మారుతోంది. అదేవిధంగా అత్యంత అద్భుతమైన తీరప్రాంత పర్యాటక ప్రదేశంగానూ వెలుగొందే సత్తా దీనికి ఉందని భావిస్తున్నా” అని ఆనంద్ మహీంద్రా ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. నెటిజను ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించారు.















