అమరావతి (చైతన్య రథం): 2025-26 రబీ సీజన్‌లో పండించిన మొక్క జొన్న పంటను కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. మొక్కజొన్న రైతులకు ధరల వ్యత్యాస చెల్లింపు పథకాన్ని వర్తింప చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు కేంద వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు సీఎం చంద్రబాబు లేఖ రాస్తూ.. “రాష్ట్రంలో మొక్కజొన్న సాగు చేసిన రైతులు ఆందోళనగా ఉన్నారు. మార్కెట్‌లో మొక్కజొన్న ధరలు రోజురోజుకూ పడిపోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాల్ మొక్కజొన్న ధర రూ.1600 నుండి రూ.1700 మధ్య మాత్రమే ఉంది. కనీస మద్దతు ధర రూ.2400 కంటే చాలా తక్కువగా ప్రస్తుత మార్కెట్ ధర ఉంది. రాష్ట్రంలో సుమారు 42.06 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇంకా 14.26 లక్షల మెట్రిక్ టన్నుల పంట కోత దశలో ఉంది. సకాలంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే రైతులు నష్టపోతారు. మొక్కజొన్న కొనుగోలుకు కేంద్రం నుంచి మద్దతు లేకపోవడంతో రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతుంది. పీఎం`ఆశా కింద నేరుగా రైతులకు ధరల వ్యత్యాసాన్ని చెల్లించాలి. ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేకంగా పరిగణించి, ధరల వ్యత్యాసంలో 100శాతం నిధులను కేంద్రమే భరించాలి. ఈ పథకాన్ని జూన్ 2026 వరకు పొడిగించాలి. నాఫెడ్, ఏపీ మార్క్‌ఫెడ్ సమన్వయంతో ఈ పథకాన్ని అమలు చేసేందుకు తక్షణమే అనుమతులివ్వాలి’ అని కోరారు.
















