- సోలార్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ సభలో మంత్రి నారా లోకేష్
- మా బ్రాండ్ జాబ్ క్రియేషన్… జగన్ బ్రాండ్ గొడ్డలి
- బ్రాండ్ సీబీఎన్ వల్లే ఏపీలో అభివృద్ధి పరుగులు
- మాటిచ్చి చేతల్లో చూపే నాయకత్వంవల్లే పెట్టుబడుల వెల్లువ
- క్లీన్ ఎనర్జీ వినియోగించడమే కాదు… దేశానికి ఎగుమతి చేస్తాం
- సభలో స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్
జమ్మలమడుగు (చైతన్య రథం): ఈరోజు కేవలం ఒక సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం మాత్రమే కాదు, దార్శనికత, నమ్మకం, వేగం, కార్యనిర్వహణ కలగలిసిన వేడుక అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం టి.కొండూరు గ్రామంలో రూ.3 వేల కోట్లతో నిర్మించిన సుఖ్ బీర్ ఆగ్రో ఎనర్జీ లిమిటెడ్ (ఎస్ఏఈఎల్) వారి 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ “మా నాన్న ఉత్తరం రాశారు.. మా తాత కల కన్నారు.. నేను ఆత్మలతో మాట్లాడాను అంటే నమ్మే వాళ్ళు ఎవరూ లేరు బ్రదర్. మా బ్రాండ్ జాబ్ క్రియేషన్… మీ బ్రాండ్ గొడ్డలి.” రెండింటికీ ఎంతో తేడా ఉందని అన్నారు.
రాష్ట్రం చూపు.. జమ్మలమడుగు వైపు
మంత్రి లోకేష్ మాట్లాడుతూ రికార్డు టైమ్లో ఎస్ఏఎల్ ప్రాజెక్టు పూర్తి అయిందని, ఇది స్థానిక రైతుల విజయం, జమ్మలమడుగు యువత విజయమని చెప్పారు. వారి సహకారం వల్లనే ఈ ప్రాజెక్టు 11 నెలల్లో పూర్తి అయిందన్నారు. రాష్ట్రం మొత్తం జమ్మలమడుగు వైపు చూస్తోందని, ఇతర నియోజకవర్గాల వారు మాకు కూడా ఇటువంటి కంపెనీలు వస్తే బాగుంటుందని అనుకుంటున్నారని పేర్కొన్నారు. ఇక్కడ మెగా సోలార్ పార్క్ ఏర్పాటు చేసింది మనమే, ఇప్పుడు ఎస్ఏఎల్ తీసుకువచ్చింది మనమే, అదానీ, చింతా గ్రీన్, జెన్కో-ఎన్టీపీసీ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు తీసుకొచ్చింది మనమే అన్నారు. ఎస్ఏఈఎల్ రావడం వల్ల రైతులకు లబ్ధి జరిగింది. యువతకు ఉద్యోగాలు వచ్చాయని వివరించారు. కంపెనీలు తీసుకురావాలన్నా, ఉద్యోగాలు కల్పించాలన్నా అది ఒక్క బ్రాండ్ సీబీఎన్ కు మాత్రమే సాధ్యమని అన్నారు.
విజయానికి మూడు మెట్లు
పెట్టుబడుల సాధన, పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనలో ఏపీ విజయానికి ముఖ్యమైన మూడు కారణాలున్నాయని మంత్రి వివరించారు. మొదటిది బ్రాండ్ సీబీఎన్. పెట్టుబడిదారులు ఇప్పుడు “మేము ఎంత త్వరగా ఆంధ్రప్రదేశ్కు
రాగలం?” అని అడుగుతున్నారని, ఎందుకంటే ఇచ్చిన మాటను చేతల్లో చూపే నాయకత్వంతో నిర్మితమైన ఆంధ్రప్రదేశ్ నేడు గ్లోబల్ బ్రాండ్గా ఎదిగిందని తెలిపారు. రెండవది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. నిర్ణయాలు వేగంగా తీసుకుని, ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేసినప్పుడే విధానాలకు విలువ ఉంటుందని, ఈ ప్రాజెక్టే అందుకు దర్శనమని
అన్నారు. భూమిపూజ నుంచి ప్రారంభోత్సవం వరకు రికార్డు స్థాయిలో 11 నెలల్లో పూర్తయిందని వివరించారు. మూడవది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ మద్దతుతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానం మరింత వేగవంతమైందని, రాష్ట్ర ప్రభుత్వ దార్శనికతకు కేంద్ర ప్రభుత్వ మద్దతు తోడైనప్పుడు అభివృద్ధి పరుగులు
పెడుతుందని అన్నారు.
ప్రపంచంతో పోటీపడే ఎకోసిస్టమ్ నిర్మాణం
ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, సాఫ్ట్వేర్, డ్రోన్లు, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా, అధునాతన తయారీ వంటి రంగాల్లో 22 ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను నిర్మిస్తోందని మంత్రి తెలిపారు. ఆధునిక ఆర్థిక వృద్ధి ఎకోసిస్టమ్స్, స్పెషలైజేషన్, ఆవిష్కరణల ద్వారానే సాధ్యమవుతుందని, ఆంధ్రప్రదేశ్, భారత ప్రభుత్వం కలిసి భవిష్యత్తు కోసం ప్రపంచవ్యాప్తంగా పోటీపడగల ఎకోసిస్టమ్స్ ను నిర్మిస్తున్నాయని అన్నారు. ఎస్ఏఈఎల్ నాయకత్వంతో మొట్టమొదటి సంభాషణ తనకు
ఇప్పటికీ గుర్తుందని, ఢిల్లీలో ఒక టెలికాం ఆపరేటర్ల సంఘం సమావేశం సందర్భంగా జరిగిందని చెప్పారు. అది పునరుత్పాదక ఇంధనానికి సంబంధించిన సమావేశం కాకున్నా, ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను నిర్మించాలనే తమ ప్రణాళికల గురించి ఎస్ఈఎల్ నాయకత్వం ఎంతో ఉద్వేగంగా మాట్లాడిందని
తెలిపారు.
స్థానిక సమాజంతో కలిసి ముందడుగు
పంజాబ్ లీడర్షిప్ నేతృత్వంలో పనిచేస్తున్న ఢిల్లీకి చెందిన ఒక కంపెనీ ఆంధ్రప్రదేశ్లో కార్యకలాపాలు నిర్వహించగలదా అనే ప్రశ్న తనలో మెదిలిందని మంత్రి చెప్పారు. ఎస్ఏఈఎల్ బృందం అమరావతికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తనను కలిశారని, క్షేత్రస్థాయిలో పనిచేయడానికి సిద్ధమై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో రావడం తన ప్రశ్నకు జవాబు దొరికించిందన్నారు. ఎస్ఏఈఎల్ బృందం చక్కగా స్థానిక సమాజం, ప్రజలతో మమేకమయ్యారని, క్షేత్రస్థాయిలో గ్రామస్థులు, రైతులు, స్థానిక యంత్రాంగం, ఇంజనీర్లు, కార్మికులు, అధికారులతో కలిసికట్టుగా పనిచేశారని అన్నారు. వారు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని స్థానికుల సహకారంతో ముందుకు సాగారని, ఆ స్ఫూర్తే ఈ ప్రాజెక్టును విజయవంతం చేసిందన్నారు.
రికార్డు వేగంతో ప్రాజెక్టు పూర్తి
ఎస్ఏ ఈఎల్ రూ.3,000 కోట్ల పెట్టుబడి పెట్టి, 2,400 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఎంహెచ్పీ-1, ఎంహెచ్పీ-2 భారీ 300 మెగావాట్ల ప్రాజెక్టుల నిర్మాణం 11 నెలల్లో వేగవంతంగా పూర్తి చేసి రికార్డు సృష్టించింది. పంజాబ్, రాజస్థాన్ లోని ఎస్ఏఈఎల్ సొంత ప్లాంట్లలో తయారైన 12 లక్షలకు పైగా అధునాతన టాప్కాన్ బైఫేషియల్ సోలార్ మాడ్యూల్స్ ఏర్పాటుచేశారు.
11 లక్షల టన్నుల కర్బన ఉద్గారాల తగ్గుదల
ఈ ఒక్క ప్రాజెక్టు ద్వారానే ఏటా సుమారు 11 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను నివారించవచ్చని అంచనా. ఇక్కడ ఉత్పత్తి అయ్యే స్వచ్ఛమైన విద్యుత్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కుదిరిన 25 ఏళ్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రకారం జాతీయ గ్రిడ్లోకి సరఫరా అవుతుంది. ఈ విద్యుత్ గుజరాత్తో సహా ఇతర రాష్ట్రాలకు కూడా ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కేవలం క్లీన్ ఎనర్జీని వినియోగించడమే కాదు, భారతదేశానికి ఎగుమతి చేసే రాష్ట్రంగా ఎదుగుతోందని మంత్రి వివరించారు. ఎస్ఏఈఎల్ బృందానికి, ముఖ్యంగా పంజాబ్ నుంచి వచ్చిన సోదర సోదరీమణులకు “తుస్సీ కమాల్ కర్ దిట్టా.. చక్ దే ఫట్టే!” అని మంత్రి అభినందించారు. ఆంధ్రప్రదేశ్ వారిని కుటుంబ సభ్యులుగా స్వాగతిస్తోందని, క్రమశిక్షణ, పట్టుదల, వేగంతో ఎలా సాధించగలమో వారు ఆచరణాత్మకంగా నిరూపించారని కొనియాడారు.
నిర్మాణ సమయంలోనే వెయ్యి మందికి ఉపాధి
ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే 1,000 మందికి పైగా కార్మికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ ఉపాధి లభించింది. వీరిలో 80 శాతం మంది స్థానికులే. వీరి ఆదాయాలు మెరుగయ్యాయి, చుట్టుపక్కల గ్రామాల్లో ఆర్థిక కార్యకలాపాలు విస్తరించాయి. అన్నింటికన్నా ముఖ్యంగా దీర్ఘకాలిక లీజు ఒప్పందాల ద్వారా 760 మంది రైతులు, వారి కుటుంబాలు లబ్ధి పొందాయి.
వ్యవసాయ వ్యర్థాల నుంచి విద్యుత్
రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ వ్యర్థాల నుంచి దాదాపు200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ఎస్ఏఈఎల్ ప్రాజెక్టులు ఉన్నాయని, ఇవి రైతులకు అదనపు ఆదాయ అవకాశాలను కల్పిస్తాయని మంత్రి తెలిపారు.
పునరుత్పాదక ఇంధన రంగంలో వేలాది ఉద్యోగాలను సృష్టిస్తాయని వివరించారు. ఎస్ఏఈఎల్ సంస్థకు ఏ మద్దతు కావాలన్నా తాను ఒక్క వాట్సాప్ కాల్ దూరంలోనే ఉంటానని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సవిత, కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్ఏఈఎల్ కో-ఫౌండర్ మరియు డైరెక్టర్ సుఖ్ బీర్ సింగ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు సీఈవో లక్షిత్ ఆవ్లా, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జమ్మలమడుగు టీడీపీ ఇన్చార్జ్ భూపేష్ రెడ్డి పాల్గొన్నారు.












