- గాలింపు చర్యలు ముమ్మరం చేయాలి
- అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం
అమరావతి(చైతన్యరథం): కాకినాడ జిల్లా ఉప్పాడకు చెందిన ఏడుగురు మత్స్యకారులతో సముద్రంలో గల్లంతైన బోటు ఆచూకీ కనుగొనేందుకు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గాలింపు చర్యలపై సంబంధిత అధికా రులతో మంగళవారం సచివాలయంలోని తన ఛాంబర్లో సమీక్షించారు. ఈ నెల 4వ తేదీన చేపల వేటకు వెళ్లిన మోటరైజ్డ్ ఫిషింగ్ బోటును పారాదీప్ పోర్టు సమీపంలో చివరిసారిగా గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ నెల 19వ తేదీ నుంచి ఆ బోటుతో సంబంధాలు తెగిపోయాయని వివరించారు. మత్స్యకారుల మొబైల్ ఫోన్లు, బోటులోని ట్రాన్స్‌పాండర్ స్విచ్ఛాఫ్ అయ్యాయని, జీపీఎస్ ద్వారా కూడా సమాచారం లభించకపోవ డంతో బోటు ఆచూకీ గుర్తించడం కష్టంగా మారిందని తెలిపారు. కాకినాడ, చెన్నై, ఒడిశా కోస్ట్‌గార్డ్ అధికారులతో సమ న్వయం చేసుకుంటూ గాలింపు కొనసాగిస్తున్నట్లు వివరించారు. భారత కోస్ట్‌గార్డ్ నౌకలు, హెలికాప్టర్లతో పారాదీప్ తీర ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. మత్స్యకారుల కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పడంతో పాటు, గాలింపు చర్యలకు సంబంధించిన సమాచారాన్ని వారికి ఎప్పటికప్పుడు తెలియజే యాలని సీఎం వారికి సూచించారు. బోటు ఆచూకీ కనుగొని మత్స్యకారులను క్షేమంగా తీసుకొచ్చేందుకు గాలింపు చర్యల్లో ఎలాంటి అలసత్వం లేకుండా చూడాలని స్పష్టం చేశారు.




















