- సవాళ్లను అధిగమించి ప్రపంచాన్ని జయించండి
- ప్రత్యేక అవసరాలుగల విద్యార్థులకు అన్నివిధాలా ప్రోత్సాహం
- ప్రతి ఏడాదీ మిమ్మల్ని గుర్తించి ప్రోత్సహించాలనేది ప్రభుత్వ లక్ష్యం
- సమగ్రశిక్ష ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం
- ఎవరెస్ట్ పర్వతారోహణ చేయనున్న ప్రత్యేక అవసరాలుగల విద్యార్థుల బృందం
- నేపాల్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ యాత్రను ప్రారంభించిన మంత్రి లోకేష్
- దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక ప్రతిభావంతుల ఎవరెస్ట్ శిఖర అధిరోహణ యాత్ర
- విద్యార్థులను అభినందిస్తూ.. శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
ఉండవల్లి (చైతన్య రథం): కసి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదంటూ విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రత్యేక ప్రతిభావంతులకు ఏపీ సమగ్రశిక్ష ఆధ్వర్యంలో దేశంలోనే మొదటిసారిగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రత్యేక అవసరాలుగల విద్యార్థుల బృందం నేపాల్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ యాత్రను ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలుగల విద్యార్థుల బృందం నేపాల్ ఎవరెస్ట్ శిఖర అధిరోహణ యాత్ర చేపట్టడం దేశంలో ఇదే తొలిసారి. 21మంది విద్యార్థుల బృందం ఏప్రిల్ 15నుంచి 30వరకు 16 రోజులపాటు సాహసయాత్ర చేపట్టనుంది. 5,364 మీటర్ల ఎత్తులోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను ప్రభుత్వ విద్యాసంస్థల్లో 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న ప్రత్యేక అవసరాలుగల విద్యార్థులు అధిరోహించనున్నారు. వీరిలో 8మంది బాలికలున్నారు. 15న మధ్యాహ్నం విద్యార్థుల బృందం నేపాల్ రాజధాని ఖాట్మండూకు చేరుకోనుంది. అక్కడినుంచి ఈ ఎవరెస్ట్ పర్వతారోహణ సాహసయాత్ర ప్రారంభం కానుంది.
కసి, పట్టుదలే మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి
నేపాల్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని విద్యార్థులతో మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారితో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. “ప్రత్యేక అవసరాలుగల విద్యార్థుల నేపాల్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ యాత్ర చాలా ఆసక్తిగా అనిపిస్తోంది. మాలో ఉండని కృషి, పట్టుదల మీలో ఉంటాయి. మీ జీవితంలో ఇప్పటివరకు ఎన్నో మాటలు, అవమానాలు ఎదుర్కొని ఉంటారు. వాటన్నింటిని అధిగమించి ఇక్కడి వరకు వచ్చారు. మనలో ఉన్న కసి, పట్టుదలే మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి” అని మంత్రి లోకేష్ ధైర్యం చెప్పారు.
సవాళ్లను అధిగమించి ప్రపంచాన్ని జయించండి
“ప్రత్యేక అవసరాలుగల విద్యార్థులకు అన్ని విధాల అండగా ఉంటాం. సపోర్ట్ చేస్తాం. మీలాంటి వారిని ప్రోత్సహిస్తే సమాజంలో మార్పు వస్తుంది. దీనిని నేను వ్యక్తిగతంగా తీసుకుంటా. మా కుటుంబంలో కూడా ఒకరు సరిగా మాట్లాడటానికి తడబడేవారు. అనేక ఇబ్బందులు పడ్డారు. అతన్ని చాలామంది ఎగతాళి చేసేవారు. దేవుడు ప్రతి కుటుంబానికి ఓ పరీక్ష పెడతాడు. ఆ పరీక్షను జయించే శక్తి కూడా ఇస్తాడు. మీ అందరికీ ఆ శక్తి ఉంది. ప్రభుత్వం కూడా మద్దతుగా ఉంటుంది. సవాళ్లను అధిగమనించి ప్రపంచాన్ని జయించండి. సమాజం మిమ్మల్ని గౌరవించాలి. సొంత పిల్లల్లా చూసుకోవాలి. వ్యక్తిగా నేను ఆశించేది సమాజంలో మీరు తీసుకురావాలి” అని లోకేష్ పిలుపునిచ్చారు.
ప్రతి ఏడాది మిమ్మల్ని గుర్తించి ప్రోత్సహించాలనేది ప్రభుత్వ లక్ష్యం
“ప్రతి ఏడాది మిమ్మల్ని గుర్తించి ప్రోత్సహించాలనేది ప్రభుత్వ లక్ష్యం. నూతన ఆవిష్కరణలను సీఎం చంద్రబాబునాయుడు ఎప్పుడూ ప్రోత్సహిస్తారు. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఒకమాట చెప్పారు. అమ్మకు చెప్పలేని పని చేయవద్దని సూచించారు. దీనిని అందరూ జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో అనేక దశల్లో ఉపాధ్యాయుల దగ్గర నుంచి ఎంతోమంది సాయం అందిస్తారు. నా జీవితంలో కూడా పలువురు ఉపాధ్యాయులు, రాజిరెడ్డిలాంటి ప్రొఫెసర్లు సాయం చేశారు. మనం కూడా సమాజానికి ఎంతోకొంత తిరిగి ఇవ్వాలి. మీ జీవితంలో కనీస 10మందికి సాయపడాలి. అందరికీ ఆదర్శంగా ఉండాలి.
మిమ్మల్ని చిన్నచూపు చూడాలంటే భయపడాలి. కసితో, పట్టుదలతో పనిచేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాయామ విద్య, దివ్యాంగులకు ప్రోత్సాహం, అభ్యసన ఫలితాలపై దృష్టిపెట్టామని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. నేపాల్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ యాత్రను విద్యార్థులు విజయవంతంగా పూర్తిచేయాలి” అని కోరుకుంటూ, వారిని అభినందిస్తూ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అందరితో కలిసి గ్రూఫ్ ఫోటో దిగారు. కార్యక్రమంలో పాఠశాల విద్య డైరెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, సమగ్రశిక్ష ఎస్పీడీ బి శ్రీనివాసరావు, ఏఎస్ పీడీ కె రవీంద్రనాథ్ రెడ్డి, అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ సీఈవో శేఖర్‌బాబు, అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ పర్వతారోహకులు సాయిక్ హిమాన్షు, రఘునాథరెడ్డి, ఎం పూర్ణ తదితరులు పాల్గొన్నారు.
















