- సీమ ప్రగతికి సీఎం చంద్రబాబు కృషి
- జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని, మంత్రి సవిత
- 2049లోనూ గొడ్డలి పార్టీ అధికారంలోకి రాలేదని వ్యాఖ్య
- మంత్రి సవిత పనితీరుపై ఇన్‌ఛార్జి మంత్రి ప్రశంసలు
- పెన్షన్ల పంపిణీ చేసిన మంత్రులు అనగాని, సవిత
- రూ.100.60 కోట్లతో అమృత్ 2.0 పథకానికి శ్రీకారం
- లబ్ధిదారులుకు పట్టాల పంపిణీ
పెనుకొండ/ శ్రీసత్యసాయి :‘అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ లక్ష్యం… రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ పరిశ్రమలు స్థాపిస్తూ ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు అక్కడి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం… 2029లోనే కాదు 2049లో కూడా గొడ్డలి పార్ఠీ అధికారంలోకి రాలేదు… రాజధాని అమరావతి పనులను అడ్డుకుంటున్న నేపథ్యంలో ఆ ప్రాంత రైతులు తాడేపల్లి ప్యాలెస్ ముట్టడించడం ఖాయం… అమృత్ పథకం అమలు చేయడం కూడా జగన్ ప్రభుత్వానికి చేతకాలేదు… కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రూ.14,500 కోట్లతో ఇంటింటికీ తాగునీటి అందిస్తున్నాం… పెనుకొండ పట్టణంలో రూ.100 కోట్లతో కృష్ణా జలాలను తీసుకొచ్చి తాగునీరు అందిస్తాం’ అని జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, మంత్రి సవిత అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని ఒకటో వార్డు ఇస్లాంపురంలో జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో కలిసి మంత్రి సవిత ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు. అనంతరం పట్టణంలోని రైల్వే బ్రిడ్జినుంచి ఇస్లాంపురం వరకూ రూ.55 లక్షలతో చేపట్టిన రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. తిమ్మపురంలో పట్టణంలో ఇంటింటికీ తాగునీటి పంపిణీలో భాగంగా రూ.100.60 కోట్లతో అమృత్ 2.0 పథకానికి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి సవిత మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 2,711 కోట్లతో 63 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని సీఎం చంద్రబాబునాయుడు జోడు గుర్రాల్లా పరుగులు పెట్టిస్తున్నారన్నారు. రాయలసీమను హార్టీకల్చర్, పారిశ్రామిక హబ్ గా అభివృద్ధి చేస్తున్నారన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్ ను నిర్మించి పెనుకొండ సహా చుట్టు పక్కల ప్రాంతాలను సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం చంద్రబాబుదేనన్నారు. గతంలో రోడ్డుపై తిరిగే కార్ల పరిశ్రమను తీసుకొచ్చిన సీఎం చంద్రబాబు ఇప్పుడు దేశ రక్షణకు ఎంతో కీలకమైన యుద్ధ విమానాల పరిశ్రమను పుట్టపర్తిలో ఏర్పాటు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కొత్తగా 10 ఎంజేపీ గురుకులాలను ప్రారంభిస్తున్నామని, త్వరలో మరో పది గురుకులాలను ఏర్పాటు చేయనున్నామని, ఈ గురుకులాల మంజూరులో జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక పాత్ర పోషించారని మంత్రి సవిత కొనియాడారు. పెనుకొండలో నెలకొల్పిన ప్రభుత్వ ఐటీఐకి స్థలం మంజూరు చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రికి మంత్రి సవిత విన్నవించారు.
జగన్ రాజా…అభివృద్ధి కనిపిస్తోందా..?
గతంలో అమృత్ పథకాన్ని వినియోగించుకోవడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారని మంత్రి సవిత మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, అమృత్ 2.0 పథకం ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలని నిర్ణయించిందన్నారు. ఇందుకోసం రూ.14,500 కోట్లు వెచ్చిస్తోందని, అందులో రూ.100.60 కోట్లతో పెనుకొండలో ఇంటింటికీ కృష్ణా జలాలను తాగునీరుగా అందించనున్నామన్నారు. రాష్ఠ్రంలో, పెనుకొండలో జరుగుతున్న అభివృద్ధిపై కొందరు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడి నుంచో వచ్చిన వారు ఇక్కడ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాజా… రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనిపిస్తోందా..? అంటూ జగన్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి సవిత వ్యాఖ్యానించారు.
నీ ప్యాలెస్‌ను ముట్టడించడం ఖాయం…
కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి జగన్, వైసీపీ కుట్ర పన్నుతోందని మంత్రి సవిత మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని అమరావతి పనులను పరుగులు పెట్టిస్తోందన్నారు. అభివృద్ధిని చూసిని ఓర్వలేకపోతున్న జగన్ కుట్ర పన్నుతున్నారన్నారు. రైతుల ముసుగులో అమరావతి పనులను అడ్డుకోడానికి చూస్తున్నారన్నారు. జగన్ కుట్రలను రైతులు గమనిస్తున్నారని, ఇలాగే వ్యవహరిస్తే…వారంతా తాడేపల్లి ప్యాలెస్ ను ముట్టడించడం ఖాయమని మంత్రి సవిత హెచ్చరించారు.
అభివృద్ది వికేంద్రీకరణే కూటమి లక్ష్యం: అనగాని
రాష్ట్రమంతటా అభివృద్ధిని సీఎం చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారని జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణే కూటమి లక్ష్యమని, అన్ని ప్రాంతాల్లోనూ పరిశ్రమలు నెలకొల్పి, ఆయా ప్రాంతాల్లోని యువతకు ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. జగన్ మెప్పుకోసం దళిత సామాజిక వర్గానికి చెందిన హోంమంత్రిపైనా వైసీపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. 2029లోనే కాదు 2049లోనూ వైసీపీ అధికారంలోకి రావడం కల్ల అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ప్రస్తుతం ఉన్న 11 సీట్లలో ఒక్క సీటు కూడా రావడం కష్టమేనని అన్నారు. ముస్లిములకు సహా అన్ని వర్గాలకు మేలు కలుగజేసేలా సీఎం చంద్రబాబునాయుడు అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.
మంత్రి సవిత పనితీరు భేష్
మంత్రి సవిత పనితీరు భేష్ అంటూ జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రశంసలు కురిపించారు. పెనుకొండ నియోజక వర్గంలో అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. కేవలం రెండేళ్ల కాలంలో పెనుకొండ నియోజక వర్గంలో రూ.2,400 కోట్లకుపైగా అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. తన నియోజక వర్గంలోనూ ఈ స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. మంత్రి సవిత పని రాక్షసి అని, ఆమెకు పెనుకొండ వాసులు అండగా ఉండాలని జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని పిలుపునిచ్చారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అంతకుముందు పట్టణంలోని ఇస్లాపురం గ్రామంలో జిల్లా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లను పంపిణీ మంత్రులు అనగాని సత్యప్రసాద్, సవిత ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కారక్రమంలో ఎంపీ బీకే పార్థసారథి, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఇతర అధికారులు, పలువురు ప్రజాప్రనిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.















