- గంగపుత్రుల సంక్షేమానికి పెద్దపీట.. హక్కుల పరిరక్షణకు కట్టుబడిన కూటమి ప్రభుత్వం
- మత్స్యకారుల సేవలో పథకం ద్వారా 1.34 లక్షల కుటుంబాలకు రూ.268.60 కోట్ల సాయం
- జీవో 217 రద్దుతో మత్స్యకార సహకార సంఘాల హక్కులకు రక్షణ
- ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే
- ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద రూ.2,328.89 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు
- మత్స్యరంగంలో 5.23 లక్షల యూనిట్లు మంజూరు.. 4.58 లక్షల యూనిట్ల అమలు ప్రారంభం
- చిన్న మత్స్య పరిశ్రమలకు రూ.2 కోట్ల వరకు గ్రాంట్‌కు అవకాశం
- ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి (చైతన్యరథం): అలలతో పోరాటం.. ఆటుపోట్లతో సహవాసం.. ప్రాణాలను పణంగా పెట్టి సాగించే వేట.. రెక్కల కష్టాన్నే నమ్ముకుని జీవించే గంగపుత్రుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మత్స్యకారులు, ఆక్వా రైతులు, మత్స్యరంగంపై ఆధారపడిన కుటుంబాలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రానికి ఉన్న 1,053 కిలోమీటర్ల సముద్ర తీరం అపారమైన మత్స్య సంపదకు నిలయమని, లక్షలాది కుటుంబాలకు జీవనాధారమని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మత్స్యకారుల సంక్షేమం, ఆక్వా రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
వేట నిషేధ సమయంలో రూ.268.60 కోట్ల ఆర్థిక భరోసా
వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయే మత్స్యకారులకు గతంలో రూ.10 వేలుగా ఉన్న సహాయాన్ని రూ.20 వేలకు పెంచామని మంత్రి తెలిపారు. ‘మత్స్యకారుల సేవలో’ పథకం ద్వారా 2026-27లో తొలి విడతగా 1,28,388 కుటుంబాలకు రూ.256.776 కోట్లు విడుదల చేయగా, రెండో విడతలో మరో 5,910 కుటుంబాలకు రూ.11.82 కోట్లు మంజూరు చేశామన్నారు. మొత్తంగా 1,34,298 కుటుంబాలకు రూ.268.60 కోట్ల మేర ఆర్థిక సహాయం అందించేలా చర్యలు చేపట్టామని వివరించారు. సంప్రదాయ మత్స్యకారుల హక్కులను దెబ్బతీసిన జీవో 217ను రద్దు చేసి సహకార సంఘాల ప్రయోజనాలను పరిరక్షించామని చెప్పారు. మత్స్యకారుల జీవనోపాధికి భంగం కలిగించే నిర్ణయాలను సహించబోమని స్పష్టం చేశారు.
ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ.. పెట్టుబడి భారం తగ్గింపు
రాష్ట్రంలో సుమారు 2.16 లక్షల మంది రైతులు 5.79 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారని మంత్రి తెలిపారు. అర్హులైన నమోదిత రైతులకు జోన్, నాన్ జోన్ పరిమితులతో సంబంధం లేకుండా యూనిట్ విద్యుత్‌ను రూ.1.50కే అందించే నిర్ణయం తీసుకున్నామన్నారు. మత్స్యకారుల పడవలకు లీటరు డీజిల్‌పై రూ.9 రాయితీ అందిస్తున్నామని, 2026-27 బడ్జెట్లో ఇందుకోసం రూ.52 కోట్లు కేటాయించామని చెప్పారు. 200 యాంత్రిక పడవలను 60 శాతం రాయితీతో అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన నిర్ణయాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు.
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనతో అభివృద్ధి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ( పీఎంఎంఎస్) కింద రాష్ట్రంలో రూ.2,328.89 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని మంత్రి తెలిపారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.681.38 కోట్లని చెప్పారు. పథకంలోని 41 రకాల కార్యక్రమాల ద్వారా 5,23,269 యూనిట్లు మంజూరు కాగా, 4,58,139 యూనిట్ల అమలు ప్రారంభమైందన్నారు. జీవనోపాధి, పోషకాహార సహాయానికి సంబంధించిన 4,42,720 యూనిట్లతో పాటు 776 ఐస్ బాక్స్ మోటారు సైకిళ్లు, 2,269 మినీ ఫిష్ కియోస్క్‌లు, 8,144 కమ్యూనికేషన్, ట్రాకింగ్ పరికరాల యూనిట్ల అమలు ప్రారంభమైనట్లు వివరించారు. మిగిలిన యూనిట్లను వేగవంతం చేస్తామని తెలిపారు. మత్స్య ఉత్పత్తుల నిల్వ, రవాణా, మార్కెటింగ్ కోసం 3 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, 16 కోల్డ్ స్టోరేజీ, ఐస్ ప్లాంట్లు, 5 మేత తయారీ ప్లాంట్లు, ఒక సమగ్ర ఆక్వా పార్కు వంటి ప్రాజెక్టులకు ఆమోదం లభించిందన్నారు. వీటి ద్వారా మత్స్యకారులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని చెప్పారు.
చిన్న మత్స్య పరిశ్రమలకు రూ.2 కోట్ల వరకు గ్రాంట్
ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ యోజన (పీఎం`ఎంకేఎసఎస్వై) కింద దేశవ్యాప్తంగా రూ.6 వేల కోట్ల అంచనా వ్యయంతో మత్స్యరంగ అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తున్నారని మంత్రి తెలిపారు. అర్హత కలిగిన సూక్ష్మ పరిశ్రమలకు 25 శాతం లేదా గరిష్ఠంగా రూ.35 లక్షలు, ఎస్సీ, ఎస్టీ, మహిళల యాజమాన్యంలోని సూక్ష్మ పరిశ్రమలకు 35 శాతం లేదా రూ.45 లక్షల వరకు పనితీరు ఆధారిత గ్రాంట్‌కు అవకాశం ఉందన్నారు. చిన్న పరిశ్రమలకు కేటగిరీని బట్టి రూ.75 లక్షల నుంచి రూ.కోటి వరకు, మత్స్య సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాల సమాఖ్యలు, మత్స్య రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు గరిష్ఠంగా రూ.2 కోట్ల వరకు గ్రాంట్ పొందే అవకాశం ఉందని వివరించారు.
మత్స్యకారుల ప్రాణాలకు బీమా భద్రత
సముద్రంలో చేపల వేట సమయంలో ప్రమాదాలకు గురయ్యే మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. వేట సమయంలో మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షల వరకు ఎక్స్‌గ్రేషియా అందించే విధానం అమల్లో ఉందన్నారు. 2026-27లో 2,84,888 మంది మత్స్యకారులకు గ్రూప్ ప్రమాద బీమా రక్షణ కల్పించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. పథకం నిబంధనల ప్రకారం ప్రమాద మరణం లేదా పూర్తిస్థాయి శాశ్వత వైకల్యానికి రూ.5 లక్షలు, పాక్షిక శాశ్వత వైకల్యానికి రూ.2.50 లక్షల వరకు బీమా ప్రయోజనం లభిస్తుందన్నారు.
మత్స్య సంపద పరిరక్షణతోనే సుస్థిర అభివృద్ధి
గోదావరి, కృష్ణా డెల్టాలు, కోరింగ మడ అడవులు, పులికాట్, కొల్లేరు సరస్సులు మత్స్య సంపద వృద్ధికి కీలకమని మంత్రి పేర్కొన్నారు. సహజ జలవనరుల పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, చేపల సంతానోత్పత్తి ప్రాంతాల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. మత్స్యకారుల ఆదాయం పెంచడంతోపాటు భవిష్యత్తు తరాలకు మత్స్య సంపదను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మత్స్యకారుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కాలి. వారి కుటుంబాల్లో ఆర్థిక వెలుగులు నింపాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో గంగపుత్రుల సంక్షేమం, ఆక్వా రైతుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మత్స్యరంగాన్ని లాభసాటిగా తీర్చిదిద్ది ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలబెడతాం అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.



















