విశాఖపట్నం (చైతన్య రథం): భారతదేశంలోని థాయ్‌లాండ్ రాయబారి చవనార్ట్ థాంగుసుమ్ఫంట్తో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖ నోవాటెల్ హోటల్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏపీలో బౌద్ధ వారసత్వం, ఎయిర్ కనెక్టివిటీ, టూరిజం అభివృద్ధికి మరింత సహకారం అందించాలని కోరారు. బీహార్‌లోని బోధ్‌గయ తరహాలో థాయ్ బౌద్ధ సన్యాసులు, యాత్రికుల కోసం ప్రత్యేక బౌద్ధ పర్యాటక సర్క్యూట్‌ను అభివృద్ధి చేయాలి. అమరావతిలోని మహాచైత్య స్థూపాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకుని నాగార్జునకొండ, తొట్లకొండ, బావికొండ ప్రాంతాలను ఈ సర్క్యూట్లో చేర్చాలి. రాజధాని అమరావతి ప్రాంతంలో థాయ్ సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేసి, థాయ్‌లాండ్ ప్రతిపాదించిన మ్యూజియంలు, సాంస్కృతిక సంస్థలతో అనుసంధానించాలని కోరారు.
గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బౌద్ధ తత్వవేత్త ఆచార్య నాగార్జున పేరు మీద బౌద్ధ అధ్యయన కేంద్రం ఏర్పాటులో భాగస్వామ్యం కావాలని థాయ్‌లాండ్ యూనివర్సిటీలు, బౌద్ధ సంస్థలకు ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. విశాఖపట్నం-థాయ్‌లాండ్ మధ్య క్రూయిజ్ పర్యాటకం, తీరప్రాంత పర్యాటకాన్ని బౌద్ధ పర్యాటక సర్క్యూట్‌తో అనుసంధానించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. విద్య, నైపుణ్యాభివృద్ధికి థాయ్‌లాండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మధ్య సహకార వ్యవస్థను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. చవనార్ట్ థాంగుసుమ్ఫంట్ స్పందిస్తూ.. భారత్, థాయ్‌లాండ్ దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలుగా అవతరించాయని తెలిపారు. ఆసియాన్ దేశాలతో భారత్ జరిపే మొత్తం వాణిజ్యంలో థాయ్‌లాండ్ వాటా 16.7 శాతంగా ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.




















