- మూడు విభాగాల్లో జాతీయ అవార్డులు..
- అధికారులను అభినందించిన మంత్రి నారాయణ
- ఇప్పటివరకు 4.94 లక్షల మంది వీధి వ్యాపారులకు రూ.1,016.88 కోట్ల రుణాలు
- 2025-26 ఆర్థిక సంవత్సరంలో 1.34 లక్షల మందికి రూ.284.66 కోట్ల రుణాలు పంపిణీ
అమరావతి (చైతన్య రథం): పీఎం స్వనిధి పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) జాతీయ స్థాయిలో పలు అవార్డులు సాధించడం పట్ల రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ హర్షం వ్యక్తం చేశారు. వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు, పట్టణ పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఈ అవార్డులు నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధతో పట్టణ ప్రాంతాల్లోని పేదలు, మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. మెప్మా ఆధ్వర్యంలో పీఎం స్వనిధి పథకం ద్వారా వీధి వ్యాపారులకు తక్కువ వడ్డీకే రుణాలు మంజూరు చేయిస్తూ, వారి వ్యాపారాల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటునందిస్తోందని వివరించారు.
పీఎం స్వనిధి పథకం ద్వారా ఇప్పటివరకు రాష్ట్రంలో 4,94,000 మంది వీధి వ్యాపారులకు రూ.1,016.88 కోట్ల రుణాలు మంజూరు చేయించినట్లు మంత్రి తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే 1,34,000 మంది వీధి వ్యాపారులకు రూ.284.66 కోట్ల రుణాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించడంలో ప్రభుత్వం చూపుతున్న చొరవకు ఈ గణాంకాలు నిదర్శనమన్నారు.
పీఎం స్వనిధి పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ మెప్మా జాతీయ స్థాయిలో మూడో స్థానాన్ని సాధించగా, అత్యధిక సంఖ్యలో వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేయడంలో రెండో స్థానంలో నిలిచింది. అలాగే ప్రత్యేక రుణ మేళాలు (స్పెషల్ క్యాంపులు) నిర్వహించడంలో దేశంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. వీధి వ్యాపారుల కుటుంబాలకు వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందించే ‘స్వనిధి సే సమృద్ధి’ కార్యక్రమం అమలులోనూ రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు విశేష పురోగతి సాధించాయి. ఈ విభాగంలో రామచంద్రాపురం మున్సిపాలిటీ జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో, అమలాపురం మున్సిపాలిటీ రెండో స్థానంలో నిలిచి అవార్డులు అందుకున్నాయి. అదేవిధంగా, డిజిటల్ లావాదేవీల నిర్వహణలో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ జాతీయ స్థాయిలో రెండో స్థానాన్ని సాధించడం విశేషమని మంత్రి పేర్కొన్నారు.
జాతీయ స్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తీసుకొచ్చిన మెప్మా అధికారులు, సంబంధిత మున్సిపాలిటీల కమిషనర్లు, సిబ్బందిని మంత్రి నారాయణ ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా పనిచేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో మెప్మా ద్వారా పట్టణ ప్రాంత మహిళలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అదనపు చర్యలు చేపడుతుందని మంత్రి తెలిపారు. మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, ఆర్థిక స్వావలంబన సాధించేలా ప్రోత్సహించడం, పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.




















