- కేడీ బండారం బయటపడుతుందనా?
- నిజంగానే వ్యవస్థలు తమ చేతుల్లో ఉంటే 13 ఏళ్లుగా జగన్ బెయిల్ మీద ఉండేవారా?
- రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం నుంచి జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా తెరమరుగు ఖాయం
- టీడీపీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ ఆగ్రహం
అమరావతి (చైతన్య రథం): గడచిన దశాబ్ద కాలంగా అక్రమాస్తుల కేసుల విచారణ జరగకుండా డిశ్చార్జ్ పిటిషన్ల మాటున తప్పించుకు తిరుగుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి బండారం బట్టబయలవు తోందని టీడీపీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం మంగళగిరి లోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… జగన్ అక్రమాస్తుల కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేసి పదేళ్లు దాటినా, రోజువారీ ప్రాతిపదికన విచారణ జరగకుండా నిందితులు అడ్డుకుంటున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిందని గుర్తుచేశారు. 2013 సెప్టెంబర్ 23న కోర్టుకు వినయ విధేయతలు ప్రదర్శించి, దర్యాప్తునకు సహకరిస్తానని కండిషనల్ బెయిల్పై బయటకు వచ్చిన జగన్.. 13 ఏళ్ల 20 రోజులుగా విచారణ ముందుకు సాగకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్రకు సైతం విరామమిచ్చి ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరైన జగన్, అధికారంలోకి రాగానే తన భద్రత పేరుతో ప్రజాధనం రూ.60 లక్షలు ఖర్చవుతుందంటూ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఘోరంగా తిరస్కరించి రెండేళ్లు దాటినా, కనీసం అసెంబ్లీకి కూడా రాని జగన్ నేటికీ కోర్టు మెట్లు ఎక్కకపోవడం చట్టాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. వరుసగా ఏడుగురు సీబీఐ జడ్జిలు మారినా డిశ్చార్జ్ పిటిషన్లు ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని, ఈడీ స్వయంగా కోర్టును ఆశ్రయించి విచారణ వేగవంతం చేయాలని కోరితే.. సాక్షి పత్రికలో ‘ఈడీ ఎల్లో కేడీ’ అంటూ తప్పుడు రాతలు రాయిస్తున్నారని ధ్వజమెత్తారు.
వివేకా హత్య కేసు మొదలైన నాటినుంచి సాక్షి పత్రిక విశ్వసనీయత కోల్పోయిందని రాజేష్ ఎద్దేవా చేశారు. మొదట గుండెపోటుగా ప్రచారం చేసి, ఆపై ‘నారాసుర రక్త చరిత్ర’ అంటూ చంద్రబాబుపై నెపం మోపి, చివరకు వివేకా కుమార్తె సునీత న్యాయపోరాటం చేస్తుంటే వివేకా వ్యక్తిత్వాన్నే కించపరిచేలా కథనాలు రాయించిన చరిత్ర సాక్షి యాజమాన్యానిదని నిలదీశారు. ఇప్పుడు ఈడీ తలుపు తడుతుంటే చంద్రబాబు ఆదేశాలతో నడుస్తోందని అవాకులు చవాకులు పేలడం హాస్యాస్పదమన్నారు. నిజంగానే వ్యవస్థలు తమ చేతుల్లో ఉంటే 13 ఏళ్లుగా బెయిల్ వెసులుబాటు అనుభవిస్తూ జగన్ రాజకీయాలు చేయగలిగేవారా? అని ప్రశ్నించారు. బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఓఎస్టీ సత్యప్రసాద్, మాజీ ఎక్సైజ్ కమిషనర్ రజత్ భార్గవ్లు మేజిస్ట్రేట్ ఎదుట ఇచ్చిన వాంగ్మూలాలు నేరుగా తాడేపల్లి ప్యాలెస్ని ప్రధాన సూత్రధారిగా నిరూపిస్తుండటంతో జగన్ ముఠాలో వణుకు మొదలైందన్నారు.
వివేకా హత్య కోసం చేతులు మారిన రూ.40 కోట్ల భారీ సుపారీ, హవాలా మూలాలను ఈడీ తవ్వి తీస్తుండటంతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయని అప్పసాని రాజేష్ పేర్కొన్నారు. ఏపీలో ఉంటే న్యాయం జరగదని సుప్రీంకోర్టు స్వయంగా విచారణను తెలంగాణకు బదిలీ చేసినప్పుడే జగన్ నైతిక బాధ్యతతో రాజీనామా చేసి ఉండాల్సిందన్నారు. అక్రమాస్తుల కేసుల్లో క్విడ్ ప్రోకో ద్వారా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు కొల్లగొట్టిన ఆధారాలను సీబీఐ, ఈడీలు ట్రంకు పెట్టెల కొద్దీ కోర్టుకు సమర్పించాయని గుర్తుచేశారు. కోర్టులను, దర్యాప్తు సంస్థలను మేనేజ్ చేయవచ్చనే జగన్ బరితెగింపు ఇంకెంతో కాలం సాగదని, త్వరలోనే న్యాయ విచారణలన్నీ కొలిక్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం నుంచి జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా తెరమరుగు కావడం ఖాయమని స్పష్టం చేశారు.













