అమరావతి (చైతన్యరథం): శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి దేవాలయంలో జరగనున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు ఆహ్వానం పలికారు. ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించ సున్నట్టు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ మేరకు ఆలయ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో ఎం. శ్రీనివాస రావు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రిక అందించా రు. ఆలయ పండితులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వేదాశీర్వచనం ఇచ్చారు. సీఎంకు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల చిత్రపటం, ప్రసాదాలను దేవాలయ అధికారులు అందించారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించి దేవస్థానం చేస్తున్న ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను ఉండవల్లిలోని ఆయన నివాసంలో శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు కలిసి శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందించారు. మంత్రి లోకేష్‌కు ఆలయ పండితులు వేదాశీర్వచనం చేశారు. అధికారులు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల చిత్రపటం, ప్రసాదాలను అందించారు.
















