- ఏజెన్సీ, వెనుకబడిన ప్రాంతాల పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
- 2029 నాటికి ప్రభుత్వ స్కూళ్లన్నింటిలో 4-స్టార్ మౌలిక సదుపాయాలు
- స్కిల్ డెవలప్మెంట్, స్కూళ్లలో మౌలిక సదుపాయాలపై మంత్రి లోకేష్ సమీక్ష
అమరావతి (చైతన్యరథం); రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఏడాదిలోగా రాష్ట్రంలోని వన్-స్టార్ పాఠశాలలను టూ-స్టార్క అప్ గ్రేడ్ చేయాలని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ఉండవల్లిలోని తన నివాసంలో మౌలిక సదుపాయాలు, స్కిల్ డెవలప్మెంట్ శాఖలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఇన్ఫ్రాకు సంబంధించి ఈ విద్యా సంవత్సరంలో జీరో-స్టార్ పాఠశాలలన్నింటినీ వన్-స్టార్‌కు చేరేలా అభివృద్ధి చేయాలన్నారు. 2029 నాటికి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను 4-స్టార్‌కు చేర్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలని, కనీసం వెయ్యి పాఠశాలలను 5-స్టార్‌కు చేర్చాలన్నారు. ముఖ్యంగా ఏజెన్సీలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలని సూచించారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 లీప్ స్కూళ్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాల్సిందిగా కోరారు. పాఠశాల మౌలిక సదుపాయాల శాఖ కమిషనరు రంజిత్ బాషా స్పందిస్తూ… ప్రస్తుతం రాష్ట్రంలో వన్-స్టార్ 1,685, – 15,618, – 19,099, -స్టార్ 7,172 పాఠశాలలు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పురోగతిపై డీఈవోలు, ఎంఈవోలు, సీఆర్పీలకు బాధ్యతలు అప్పగించాలని మంత్రి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 7వేల హైస్కూళ్లలో పూర్తిస్థాయిలో కంప్యూటర్ ల్యాబ్స్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించాలని కోరారు. అకడమిక్‌కు సంబంధించిన సంస్కరణలు పూర్తయినం దున అధికారులు, ఉపాధ్యాయులంతా ఇక పూర్తిగా అభ్యసన ఫలితాలపైనే దృష్టి సారించాలని కోరారు.
స్కిల్ డెవలప్మెంటు ప్రాధాన్యత ఇవ్వాలి
కేంద్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ విభాగం ఆధీనంలోని ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం (పీఎంకేవీవై) ద్వారా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. రాష్ట్రంలో ఈ ఏడాది 5 లక్షల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ లక్ష్యంగా అధికారులు పని చేయాలన్నారు. ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ (పీఎంఐఎస్), ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ షిప్ స్కీమ్ (పీఎంఎన్ఏపీఎస్) వంటి పథకాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ, యువకులను నైపుణ్యం పోర్టల్‌లోకి తీసుకువచ్చి, ఏఐ విద్య ద్వారా వారికి ఇంటర్వ్యూలు నిర్వహించాలని సూచించారు. సీడాప్, ఓంక్యాప్ ద్వారా జర్మన్, జపనీస్ వంటి భాషల్లో శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో మానవ వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు, మౌలిక సదుపాయాలు, ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ రంజిత్ బాషా, రాష్ట్ర విద్య, మౌలిక సదుపాయాల సంస్థ ఎండీ దీవెన రెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ సీఈవో నారాయణస్వామి పాల్గొన్నారు.













