- రైతులను ఇబ్బంది పెట్టే కంపెనీలపై కఠిన చర్యలు
- టుబాకో బోర్డుపైనా సీఎం చంద్రబాబు అసంతృప్తి
- ఇండెంట్ కు మించి సాగుతోధర తగ్గిందన్న అధికారులు
అమరావతి (చైతన్యరథం): రైతుల్లో నమ్మకం, ధైర్యం కల్పించే లా వెంటనే పొగాకు కొనుగోళ్లు పెద్దఎత్తున జరపాలని, ఇందు కోసం వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొగాకు కంపెనీలకు స్పష్టం చేశారు. ట్రేడర్లు కొనుగోళ్లు తగ్గించడం సరికాదని, కర్నాటకలో తలెత్తని సమస్య ఏపీలో ఎందుకు ఉత్పన్నం అవుతోందని ప్రశ్నించారు. టుబాకో బోర్డు పనితీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించా రు. సచివాలయంలో బుధవారం పొగాకు కొనుగోళ్ల ప్రస్తుత స్థితి పై అధికారులు, ట్రేడర్లతో సమీక్ష నిర్వహించారు. మొత్తం 28 కంపెనీలు సమర్పించిన ఇండెంట్ వివరాలు, ప్రస్తుతం జరిపిన కొనుగోళ్ల శాతాన్ని సమీక్షలో పరిశీలించారు. ఇండెంట్ ఇచ్చి కొనుగోలు చేయకుండా ప్రభుత్వానికి సహకరించకపోతే సహిం చేది లేదని హెచ్చరించారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలకు మళ్లితే తలెత్తే పరిస్థితి గురించి పొగాకు కంపెనీలు ఆలోచన చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్ద తు ధర కిలోకు రూ.200 తగ్గకుండా మొత్తం కొనుగోళ్లు చేసి తీరాలని స్పష్టం చేశారు.
ముఖ్యంగా అతిపెద్ద మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు అయిన ఐటీసీ లిమిటెడ్, గాడ్ ఫ్రే ఫిలిప్స్ (ఐ) లిమిటెడ్, వీఎస్టీ ఇండస్ట్రీస్ 95,50 మిలియన్ మెట్రిక్ టన్నుల పంట కొనుగోళ్లకు ఇండెంట్ ఇవ్వగా… ఇప్పటివరకు కేవలం 17.6 మిలియన్ మెట్రిక్ టన్నుల పొగాకు మాత్రమే కొనుగోలు చేయడాన్ని తప్పుబట్టారు. ఈ సీజన్ లో ఐదవ సారి ఇదే అంశంపై సమీక్ష నిర్వహించాల్సి వచ్చిందంటే కంపెనీల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. రైతులు డిమాండ్కు మించి పొగాకు సాగు చేయడం ప్రస్తుత సమస్యకు కారణమని ట్రేడర్లు వివరించారు. ఇప్పటికే అవసరానికి మించి కొనుగోళ్లు చేశామని.. దానికి తోడు ఎగుమతులు కూడా తగ్గాయని తెలిపారు. అయినప్పటికీ కొనుగో ళ్లు కొనసాగిస్తామని కంపెనీల ప్రతినిధులు వెల్లడించారు. పొగాకు బహిరంగ మార్కెట్ లేకపోవడం సమస్యను తీవ్రం చేశాయని అధికారులు వివరించారు. అలాగే కంపెనీలు 142 మిలియన్ కిలోలకు ఇండెంట్ ఇవ్వగా, రైతులు 232 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి చేశారని, దీంతో ధర పతనం.. కొనుగోళ్లు లేక పోవడం జరిగిందని తెలిపారు. ఈ సమీక్షలో మంత్రులు అచ్చెన్నా యుడు, రామనారాయణరెడ్డి, గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి, ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధు లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.














