- స్త్రీ శక్తిని చాటేలా మహానాడు-2026
- 2029 ఎన్నికలకు మహానాడులో రోడ్ మ్యాప్
- కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్న అధినేత చంద్రబాబు
- వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మహానాడుకు లోకేష్
- ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా హైబ్రిడ్ మహానాడు
- పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కార్యవర్గాలు
- క్లస్టర్లవారీగా వర్చువల్ మహానాడులో పాల్గొననున్న శ్రేణులు
- వివిధ అంశాలపై వీడియోలు ప్రదర్శన…
- క్షేత్రస్థాయి కార్యకర్తలతో సీఎం ఇంట్రాక్షన్
- రెండు రోజుల మహానాడుకు ఏర్పాట్లు పూర్తి
అమరావతి (చైతన్య రథం): మహానాడు… ఈ పేరు చెబితేనే తెలుగు ప్రజల్లో, తెలుగుదేశం పార్టీలో ఓ వైబ్రేషన్. తెలుగుదేశం పార్టీ మహానాడును కార్యక్రమంలా కాకుండా… పండుగలా చేస్తుంది. అందుకే ఎన్టీఆర్ హయాం నుంచి మహానాడుకు.. మహానాడు కార్యక్రమాలకు అంతటి ప్రాధాన్యత.. ప్రాముఖ్యత ఏర్పడింది. 44 ఏళ్ల తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఎత్తుపల్లాలు చూసింది. మహానాడులో గతాన్ని ఓసారి నెమరు వేసుకోవడం.. తాజా పరిస్థితులపై చర్చించుకోడం.. భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం అనేది టీడీపీలో అనాదిగా వస్తున్న ఆనవాయితీ. మహానాడు వేదికగా తీసుకున్న నిర్ణయాలు ఇటు పార్టీనే కాకుండా.. రాష్ట్రాన్ని ప్రభావితం చేసిన సందర్భాలు ఉన్నాయి. మహానాడు ఈ స్థాయిలో ప్రభావం చూపుతుంది కాబట్టే… మహానాడులో ఏం చర్చిస్తారు… ఏం మాట్లాడతారు.. ఏయే అంశాలు ప్రస్తావనకు వస్తాయనేది ఇటు సామాన్య వర్గాల్లోనూ… అటు రాజకీయ, పరిపాలనా వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంటోంది. ఈ క్రమంలో 2026 మహానాడు బుధ, గురువారాల్లో రెండు రోజులపాటు జరగనుంది. ఈ రెండు రోజుల మహానాడులో 20 తీర్మానాలు చేపట్టనున్నారు. వీటిల్లో 10 ఏపీ, 4 తెలంగాణ, 1 అండమాన్‌కు సంబంధించిన తీర్మానాలు ఉంటాయి. ఇక ఉమ్మడిగా 4 తీర్మానాలతోపాటు… చివరిగా అత్యంత కీలకమైన రాజకీయ తీర్మానం ఉంటుంది.
చర్చలు… తీర్మానాలు… కార్యాచరణ
రెండు రోజుల మహానాడులో ఏయే అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టాలనే దానిపై పార్టీలో ఇప్పటికే కసరత్తు జరిగింది. ఈ ఏడాది చేపట్టనున్న మహానాడును స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించుకున్న క్రమంలో మహానాడు వేదికగా జరగబోయే ప్రసంగాలు మహిళ శక్తి కేంద్రీకృతంగా ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. వివిధ అంశాలపై చర్చించడం… తీర్మానాలు చేయడం.. ఆయా అంశాలకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేయడం అనే దిశగా రెండు రోజుల మహానాడు జరగనుంది. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కావస్తున్నందున్న.. వచ్చే ఎన్నికలకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకునే దిశగా టీడీపీ అధినాయకత్వం మహానాడు వేదికగా దిశా నిర్దేశం చేసే సూచనలున్నాయి. దీంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేయనున్నారు. మహానాడు తొలిరోజున టీడీపీ జాతీయ అధ్యక్షులు సీఎం చంద్రబాబు ఉదయం 9.00 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్తారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్‌కు నివాళులర్పిస్తారు. పార్టీ కోసం ప్రాణాలర్పించిన వారికి నివాళులర్పిస్తారు. అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రారంభ ఉపన్యాసంతో కార్యక్రమం ప్రారంభం అవుతుంది. తర్వాత పార్టీ పద్దుల వివరాలను వివరిస్తారు.
అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తారు. స్త్రీశక్తి, కార్యకర్తే అధినేత, పేదల సేవలోవంటి అంశాలపై నేతల ప్రసంగిస్తారు. వీటిల్లో భాగంగా వివిధ తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. సాయంత్రం 6.00 గంటలకు మొదటి రోజు కార్యక్రమం ముగుస్తుంది. ఇక రెండవ రోజు 28న ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని నివాళులర్పిస్తారు. తెలుగుజాతి విశ్వఖ్యాతి, గతంలో పార్టీ చేసిన పోరాటాలు, అన్నదాతకు అండగా, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించే సాయం, నా దేశం… నా బాధ్యత, ఆధ్యాత్మికాంధ్ర, మౌలిక సదుపాయల కల్పన, శాంతిభద్రతలు, విధ్వంసం నుంచి వికాసంవైపు ప్రయాణం, సంపద సృష్టి వంటి అంశాలపై చర్చించి.. తీర్మానాలను ఆమోదిస్తారు. ఇక చివరిలో రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముగింపు ఉపన్యాసంతో రెండు రోజుల మహానాడు ముగుస్తుంది.
2026 మహానాడు ప్రత్యేకతలు
మంత్రి నారా లోకేష్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత జరుగుతోన్న తొలి మహానాడు ఇదే. ఈ నేపథ్యంలో నారా లోకేష్ ఏం ప్రసంగిస్తారు.. ఎలాంటి దిశానిర్దేశం చేస్తారనే ఆసక్తి అందరిలోనూ కన్పిస్తోంది. ఇక గతానికి భిన్నంగా 2026 మహానాడును నిర్వహిస్తున్నారు. ఇటు ఫిజికల్‌గా.. అటు వర్చువల్ పద్దతిలో మహానాడు జరగనుంది. ముందుగా నెల్లూరులో మహానాడు చేపట్టాలని భావించినా… పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం నేపథ్యంలో దేశంలో ఇంధన పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని మోదీ పిలుపునివ్వడంతో నెల్లూరులో మహానాడు చేపట్టాలన్న నిర్ణయంలో మార్పు జరిగింది. మోదీ పిలుపునకు మద్ధతుగా ఇంధన పొదుపు విధానాలను పాటిస్తూ మహానాడు నిర్వహించనున్నారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులతోపాటు.. జాతీయ, రాష్ట్ర కార్యావర్గాలకు చెందిన సభ్యులు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఫిజికల్‌గా మహానాడులో పాల్గొంటారు. ఈ కమిటీల్లో లేని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా వారివారి ప్రాంతాలనుంచి వర్చువల్ పద్ధతిలో మహానాడులో పాల్గొంటారు. వర్చువల్ పద్ధతిలో క్లస్టర్ల వారీగా మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. 1,800కు పైగా క్లస్టర్లల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటుచేసి అక్కడ కూడా పండుగ వాతావరణంలో మహానాడును నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.















