- ఫ్యామిలీ పార్టీలో కుటుంబసభ్యుల సరదా సంభాషణలతో సందడే సందడి
ఉండవల్లి (చైతన్య రథం): ఉండవల్లి నివాసంలో ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ల ప్రజాప్రతినిధులు, కుటుంబసభ్యులకు మంత్రి నారా లోకేష్ మంగళవారం ఆతిథ్యమిచ్చిన డిన్నర్ మీట్ స్వీట్ మెమోరీస్లో సందడిగా సాగింది. ఒక్కో కుటుంబాన్ని లోకేష్ ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ పేరుపేరునా పలకరించారు. అతిథులు తనకు అందించిన దేవుని ప్రతిమలను చెప్పులుతీసి భక్తితో స్వీకరించారు. చిన్నపిల్లలను ఏం చదువుతున్నారని అడిగి, కాసేపు వారితో ఆటలాడారు. డిన్నర్ మీట్ కు హాజరైన మహిళామూర్తులకు మంగళగిరి పట్టుచీరలు పెట్టి గౌరవించారు. ప్రజాప్రతినిధులు తనకిచ్చిన వినతులు ఏమేరకు పరిష్కరించానో, ఏవి పరిష్కారం కాలేదో కారణాలు వివరిస్తూ నివేదికను లోకేష్ ఆయా ప్రజాప్రతినిధులకు అందించారు.
ఆ ఆత్మీయ కలయికకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఎంపీ బీద మస్తాన్ రావు (రాజ్యసభ), ఎమ్మెల్యేలు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (ఆత్మకూరు), మంత్రి పొంగూరు నారాయణ (నెల్లూరు సిటీ), డి కావ్య కృష్ణారెడ్డి (కావలి), వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి (కోవూరు), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (నెల్లూరు రూరల్), కాకర్ల సురేష్ (ఉదయగిరి), ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, తిరుపతి పార్లమెంటు నుంచి ఎమ్మెల్యేలు పాశం సునీల్ కుమార్ (గూడూరు), నెలవల విజయశ్రీ (సూళ్లూరుపేట), కురుగొండ్ల రామకృష్ణ (వెంకటగిరి), సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (సర్వేపల్లి), బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి (శ్రీకాళహస్తి), ఆరని శ్రీనివాసులు (తిరుపతి) ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి కుటుంబసభ్యులతో హాజరయ్యారు.














