- ఉపాధి హామీలో పెండింగ్ పనులు పూర్తి చేయండి
- పథకంపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు
అమరావతి (చైతన్య రథం): స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా వీబీ జీ రామ్‌జీ పథకం కింద పనులు చేపట్టేందుకు తగిన కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్లు శ్రద్ధపెట్టాలని సూచించారు. గురువారం అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎం ఛాంబరులో వీబీ జీ రామ్‌జీ పథకంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాదినుంచి అమల్లోకి రానున్న పథకాన్ని గ్రామీణ స్థాయిలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులతో అనుసంధానించాలని సూచించారు. గ్రామీణ ఉపాధి హామీ కింద ఈ ఆర్ధిక సంవత్సరంలో మిగిలిపోయిన పెండింగ్ పనులు తక్షణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. 2025-26 ఆర్ధిక సంవత్సరంలో వేజ్ కాంపోనెంట్ కింద రూ.4,619 కోట్లు, మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.1,962 కోట్లు వెచ్చించినట్టు అధికారులు ముఖ్యమంత్రి దష్టికి తీసుకొచ్చారు.
దేశవ్యాప్తంగా మెటిరియల్ కాంపోనెంట్ కింద వ్యయం చేసిన రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. డిమాండ్ డ్రివెన్ పథకంగా వీబీ జీ రామ్‌జీ కింద రాష్ట్రానికి అవసరమైన పనులు చేపట్టేలా కార్యాచరణ చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో సౌర విద్యుత్ వ్యవస్థలు, మౌలిక సదుపాయాలు, జల్ జీవన్ మిషన్ కింద మరమ్మతులు, గ్రామీణ ప్రాంతాల్లో గ్రంథాలయాలు, ఇతర ప్రజాభవనాల నిర్మాణం, ట్రాన్స్‌పోర్టు షెడ్లు, పార్కింగ్ ప్రాంతాల అభివృద్ధి, కమ్యూనిటీ ఆస్తుల అభివృద్ధికి అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అలాగే నీటి భద్రత, గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, ప్రకృతి విపత్తులను ఎదుర్కోనేందుకు చేపట్టే పనులను కూడా ఈ పథకం కింద చేపట్టవచ్చని పేర్కొన్నారు.















