- పేదరిక నిర్మూలనకు భారీగా నిధుల కేటాయింపు
- పయ్యావుల పద్దుపై మంత్రి కొండపల్లి వ్యాఖ్యలు
అమరావతి (చైతన్య రథం): 2026-27 ఆర్థిక సంవత్సరానికి గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,876.23 కోట్లు కేటాయించటం సంతోషదాయకమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రాష్ట్ర బడ్జెట్‌లో రూ.143 కోట్లు అధిక కేటాయింపులు.. మహిళల సాధికారత, గ్రామీణ జీవనోపాధి పురోగతిపట్ల ప్రభుత్వ దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న ప్రభుత్వ సిబ్బంది, సెర్ప్ ఉద్యోగులు, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది జీతభత్యాలు, గ్రామ సంఘాల సహాయకులకు గౌరవ వేతనాలు, అలాగే సెర్ప్ మరియు డీఆర్‌డీఎ కార్యాలయాల నిర్వహణకు మొత్తంగా రూ.464.99 కోట్లు కేటాయించారని మంత్రి తెలిపారు. అదేవిధంగా దీన్‌దయాల్ అంత్యోదయ యోజన -జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ కింద రూ.818 కోట్లు, స్టార్టప్ విలేజ్ ఎంటర్‌ప్రైజ్ ప్రోగ్రామ్ కింద రూ.72 కోట్లు, మహిళా కిసాన్ శక్తీకరణ కింద రూ.30 కోట్లు, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌కు రూ.15 కోట్లు కేటాయించారన్నారు.
దీనదయాల్ అంత్యోదయ యోజన -జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ కింద రాష్ట్రానికి లభించే వాస్తవ కేటాయింపుల ఆధారంగా అదనంగా రూ.1,200 కోట్లు వరకు పెంచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించినట్టు మంత్రి తెలిపారు. దీంతో 2026-27లో మొత్తం రూ.3,000 కోట్ల వ్యయంతో స్వయం సహాయక సంఘాల సభ్యుల జీవనోపాధుల మెరుగుదల, ఆదాయ వృద్ధి మరియు స్థిరమైన ఉపాధి అవకాశాల సృష్టిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. సీఎం ప్రకటించిన “ఒక కుటుంబంలో ఒక పారిశ్రమికవేత్త” మహత్తర లక్ష్య సాధనలో భాగంగా సుమారు 5 లక్షల మహిళలను ఔత్సాహికులుగా తీర్చిదిద్దడం, అలాగే రైతు ఉత్పత్తి సంస్థలను బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత శక్తివంతం చేయాలని ప్రభుత్వం సంకల్పంతో ముందుకు సాగుతున్నదంటూ.. సీఎం చంద్రబాబుకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కతజ్ఞతలు తెలిపారు.















