విద్యా శాఖ మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు, తల్లిదండ్రులు
అమరావతి (చైతన్యరథం): ఏపీలో విద్యార్థులకు కూటమి సర్కారు మరో తీపి కబురు చెప్పింది. వారికి రూ.1,200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విద్యార్థులకు పరీక్షల హాల్ టికెట్లు, పరీక్షలు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్లను కాలేజీలు ఆపకుండా ఇచ్చేందుకు వీలు కలిగింది. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ హయాం నుంచీ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం కూడా అరకొరగానే నిధులు కేటాయిస్తుండటంతో దాదాపు 7వేల కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. వీటిలో ఇప్పుడు 1200 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పోస్ట్మెట్రిక్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఊరట కలగనుంది. దక్కనుంది. ప్రభుత్వ ఉత్తర్వులపై విద్యార్థులు, తల్లితండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బకాయిల విడుదలకు కృషి చేసిన విద్యా శాఖ మంత్రి నారా లోకేష్కి కృతజ్ఞతలు తెలిపారు. ‘బకాయిల విడుదలతో పేద, బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు పెద్ద ఎత్తున ఉపశమనం కలుగుతుంది… వారి భవిష్యత్తుకు భరోసా ఉంటుంది. కూటమి ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టు చేస్తోందనడానికి ఇదొక నిదర్శనం’ అని శాప్ చైర్మన్ రవినాయుడు వ్యాఖ్యానించారు.














