- ముందస్తు చర్యలు తీసుకోండి
- హాస్టల్ విద్యార్థులకు అనారోగ్య సమస్యలు వస్తే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత
- నార్మల్ డెలివరీలు పెరిగేలా అవగాహన కల్పించండి
- త్వరలో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ
- గత పాలకుల తప్పిదాల వల్ల అధిక వడ్డీలు చెల్లిస్తున్నాం
- క్షేత్ర స్థాయిలో పర్యటించి… పాలసీల అమలు పరిశీలించండి
- మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): వేసవి కాలం రానున్న నేపథ్యంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులకు సూచించారు. ఇప్పటి నుంచే సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూసుకోవడంతో పాటు పశువుల దాణాకు సమస్యలు రాకూడదన్నారు. మరోవైపు ప్రజా సమస్యలు- పాలనా తీరు తెలుసుకునేందుకు మంత్రులు, కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేనని ఆదేశించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పాలసీల అమలు క్షేత్రస్థాయిలో ఎలా ఉందనే దానిని ప్రత్యక్షంగా చూడాలన్నారు. పైస్థాయిలో ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా… క్షేత్రస్థాయిలో పాలసీలు సమర్ధవంతంగా అమలు కానప్పుడు ఆశించిన ఫలితాలు రావని సీఎం అభిప్రాయ పడ్డారు. వివిధ వర్గాల ప్రజలతో అధికారులు తరుచూ మాట్లాడుతూ ఉంటే చాలా సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని చెప్పారు.
సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాకులో మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరిగింది. పలు అంశాలపై ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. “ప్రతి ఐదేళ్లకూ జీఎస్టీపీ, తలసరి ఆదాయం రెట్టింపు అయ్యేలా ప్రణాళికలు చేపట్టాలి. తలసరి ఆదాయం ప్రజల జీవన ప్రమాణాలకు ప్రతీకగా నిలుస్తుంది. కీ-పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ల విషయంలో జాగ్రత్తగా అంచనాలు వేయాలి. క్షేత్రస్థాయి నుంచి తీసుకునే సమాచారం ఒకటికి రెండుసార్లు పరిశీలన చేసుకోవాలి.
పీ4 అనేది రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తగ్గించే ప్రత్యేక కార్యక్రమం. మార్గదర్శులు బంగారు మిత్రలను నియమించుకోవాలి. వారి ద్వారా ఆయా పేద కుటుంబాలను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి. గత పాలకులు చేసిన అప్పుల కారణంగా 14శాతం వడ్డీ చెల్లిస్తున్నాం. ఏపీ క్రెడిట్ రేటింగ్ పెంచుకుని వడ్డీ తగ్గించుకునేలా రుణాలన్నీ రీషెడ్యూలు చేస్తున్నాం. గత పాలనలో పాలకులు 2019-24 మధ్య ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీశారు. జీతాలు కూడా మొదటి తేదీకి ఇవ్వలేని పరిస్థితి ఉండేది. ఇప్పుడు జీతాల చెల్లింపులను గాడిలో పెట్టాం. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నాం. కొన్ని జిల్లాల్లో అద్భుతమైన అభివృద్ధి జరుగుతోంది. ఆ జిల్లాలు భవిష్యత్తులో మరింత వృద్ధిలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్లూరి జిల్లా లంబసింగిలో కుంకుమ పువ్వు ఉత్పత్తికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు కశ్మీర్లో మాత్రమే కుంకుమ పువ్వు ఉత్పత్తి జరుగుతోంది. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏలూరు సమీపంలో కోకో సిటీ కూడా ఏర్పాటు అవుతుంది. కాఫీ సాగు పెంచడంతో పాటు అరకు కాఫీ బ్రాండ్ను ప్రమోట్ చేస్తున్నాం.. ఇది మరింతగా పెరగాలి.”
జూలైకల్లా 66లక్షల హైరిస్క్ కేసుల హెల్త్ స్క్రీనింగ్
“సంజీవని ద్వారా జూలై 2026 నాటికి 66లక్షల హైరిస్క్ కేసుల హెల్త్ స్క్రీనింగ్ చేయాలి. 5లక్షల మంది హాస్టల్ విద్యార్థుల స్క్రీనింగ్ చేపట్టాలి. 12వ తరగతి వరకు ఉన్న 70 లక్షల మంది విద్యార్థుల హెల్త్ ప్రొఫైల్స్ కూడా తయారు చేయాలి. కేర్ అండ్ గ్రో ద్వారా మాతా శిశు ఆరోగ్యం, ఎదుగుదలను నమోదుచేయాలి. పౌష్టికాహారం అందించడంతో సహా అవసరమైన సప్లిమెంట్స్ అందించేలా చర్యలు తీసుకోవాలి. అవిశ, మునగ, రకరకాల ఆకు కూరల్లో పౌష్టికాహారం లభిస్తుంది. వాటిని ఆహారంగా తీసుకోవడం మానేయడం వల్లే సమస్యలు వస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాలు, అన్న క్యాంటీన్లలో కూడా పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకోవాలి. ఇక గర్భిణిల విషయంలో నార్మల్ డెలివరీలు పెరిగేలా చూడాలి… సిజేరియన్లు తగ్గాలి. ఈ మేరకు ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ఫ్యామిలీ కార్డు బెనిఫిట్ మేనేజ్ మెంట్ సిస్టం ద్వారా జూన్ నాటికి సమగ్రమైన కార్డు జారీ చేస్తాం. మార్చి నాటికి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. జనాభా విషయానికొస్తే చాలా దేశాల్లో వృద్ధుల సంఖ్య బాగా పెరిగిపోయింది. యూరోప్లోని దాదాపు 20 దేశాల్లో ఈ సమస్య ఉంది. అక్కడ సామాజిక వేడుకలే లేవు.” అని ముఖ్యమంత్రి చెప్పారు.
ఒత్తిడి లేని విద్యా బోధనే లక్ష్యంగా…
“పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా 100 రోజుల యాక్షన్ ప్లాన్ను పక్కాగా అమలు చేయాలి. పరీక్షలు అంటే ఎలాంటి ఒత్తిడి లేని విధంగా ఈ కార్యాచరణ ఉండాలి. ఒత్తిడి కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోడానికి వీల్లేదు. ఒత్తిడి లేని విద్యా విధానంతోనే కొత్త ఆలోచనలు వస్తాయి. సరికొత్త ఆవిష్కరణలకు ఆస్కారం ఉంటుంది. వయోజన విద్యలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా డ్వాక్రా మహిళల సహకారం తీసుకోవాలి. కేంద్రం అమలు చేస్తున్న కర్మయోగి పథకంలో ఏపీకి చెందిన వారే అగ్రస్థానంలో ఉన్నారు. సామాజిక బాధ్యత కింద ప్రైవేటు సంస్థలు యువతకు నైపుణ్యాలను కల్పించే అంశంపై దృష్టి పెట్టాలి. నైపుణ్యం పోర్టల్ ద్వారా స్కిల్లింగ్తో పాటు ఉద్యోగాలు ఏ మేరకు వస్తున్నాయనే అంశాన్నీ పర్యవేక్షించాలి.
రాష్ట్రంలో 38,608 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు ఉన్నాయి. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల దగ్గర నీటి నిల్వలకు అనుగుణంగా ప్రణాళికలు చేయాలి. చెరువులు, కాల్వలు ఆక్రమణలకు గురి కాకుండా చూడాలి. దీంతో పాటు డీసిల్టింగ్, అటవీ ప్రాంతాల్లో ట్రెంచ్లను తవ్వాలి, నిల్వలు పెరిగేలా చూడాలి ప్రస్తుతం 7.34 భూగర్భజలాలు ఉన్నాయి. నీటి బ్యాంకు తరహాలో భూగర్భ జలాల వినియోగం జరగాలి. వాటిని సద్వినియోగం చేసుకుంటేనే మెరుగైన ఫలితాలు సాధించగలం.” అని సీఎం వివరించారు.
జీ రామ్ జీ పనులకు కార్యాచరణ సిద్ధం చేయాలి
“పారిశ్రామిక కాలుష్యం ద్వారా భూగర్భజలాలు కలుషితం కాకుండా చూడాలి. సురక్షితమైన తాగునీరు ప్రజలకు అందాలి. ఆశ్రమ హాస్టల్లో కలుషితమైన నీటి కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైన పరిస్థితి ఎదురైంది. ఈ తరహా ఘటనలు ఇకపై ఉత్పన్నం కాకూడదు. మళ్లీ ఇలాంటి సంఘటనలు జరిగితే… దానికి సంబంధిత జిల్లా కలెక్టర్, ఇంచార్జ్ మంత్రులదే బాధ్యత, పంచాయతీరాజ్ రోడ్లు, నీటి సంరక్షణ చర్యలు, గోకులం షెడ్లు, మ్యాజిక్ డ్రైన్లు చేపట్టాలి.” అని సీఎం దిశానిర్దేశం చేశారు.













