- మూడు బడ్జెట్లలో రూ.1.37 లక్షల కోట్ల కేటాయింపు
- బీసీ విద్య, గురుకులాలు, హాస్టళ్ల అభివృద్ధికి ప్రాధాన్యం
- బీసీలను అణగదొక్కింది జగన్ సర్కారే
- జగన్ నిర్లక్ష్యాన్ని సరిదిద్దుతూ సంక్షేమ కార్యక్రమాల అమలు
- మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ మంత్రి సవిత వెల్లడి
మంగళగిరి (చైతన్య రథం): బీసీల అభ్యున్నతే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బీసీలకు మరోసారి మంచి రోజులు ప్రారంభమయ్యాయని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. సోమవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె బీసీ సంక్షేమం, విద్య, ఉపాధి, రాజకీయ సాధికారత, రాయలసీమ అభివృద్ధి, గత ప్రభుత్వ వైఖరిపై విస్తృతంగా మాట్లాడారు. బీసీలు సమాజానికి వెన్నెముక అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశ్వసిస్తున్నారని మంత్రి సవిత తెలిపారు. సమాజంలో సగానికి పైగా ఉన్న బీసీల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి రూ.39 వేల కోట్లు, రెండో బడ్జెట్‌లో రూ.47 వేల కోట్లు, మూడో బడ్జెట్‌లో రూ.51 వేల కోట్లు కేటాయించామని వెల్లడించారు. మూడు బడ్జెట్లలో కలిపి రూ.1.37 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించడం చరిత్రలోనే తొలిసారని, బీసీల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 109 మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల విద్యాసంస్థలు పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు.
వాటిలో 56 బాలుర, 53 బాలికల గురుకులాలు ఉండగా, దాదాపు 50 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని చెప్పారు. మరో 10 కొత్త ఎంజేపీ గురుకులాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యం, భోజనం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా సాంకేతిక విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ఏడాదికి రూ.1.50 లక్షలు, బీసీ హాస్టళ్లలో ఒక్కో విద్యార్థిపై రూ.75 వేల వరకు వ్యయం చేస్తోందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో బీసీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారని మంత్రి తెలిపారు. ఈ ఏడాది పదో తరగతిలో ఎంజేపీ విద్యార్థులు 96.02 శాతం ఉత్తీర్ణత సాధించగా, బీసీ హాస్టళ్ల విద్యార్థులు 85.99 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారని పేర్కొన్నారు.
ఇంటర్మీడియట్‌లో జూనియర్ ఇంటర్‌లో 97 శాతం, సీనియర్ ఇంటర్‌లో 94 శాతం ఉత్తీర్ణత సాధించడం గర్వకారణమన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్నామని, పోటీ తత్వాన్ని పెంపొందించేందుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు. బీసీ విద్యార్థులకు నీట్, ఐఐటీ ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందించేందుకు శ్రీసత్యసాయి జిల్లా టేకులోడు, విశాఖ జిల్లా సింహాచలంలో రెండు ఎక్స్‌లెన్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. గత ఏడాది ఐఐఐటీలలో 302 మంది, ఈ ఏడాది ఇప్పటివరకు 275 మంది బీసీ గురుకుల విద్యార్థులు ఎంపికయ్యారని, కౌన్సెలింగ్ కొనసాగుతున్నందున మరింత మంది ఎంపికయ్యే అవకాశం ఉందన్నారు. గత ఏడాది ఐఐటీ, ఎనఐటీ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో 10 మంది విద్యార్థులు ప్రవేశం పొందారని చెప్పారు. అలాగే, గురుకుల విద్యార్థులకు క్రీడా సామగ్రిని అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే ట్రాక్‌సూట్లు పంపిణీ చేశామని చెప్పారు. చెస్‌లో విద్యార్థులు రాణించేందుకు ఏపీ చెస్ అకాడమీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని, దీని ద్వారా విద్యార్థుల్లో మేధస్సు, ఏకాగ్రత పెరగడంతో పాటు మానసిక ఒత్తిడిని అధిగమించే సామర్థ్యం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.
‘తల్లికి వందనం’తో విద్యార్థులకు అండ
తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో చదువుతున్న ప్రతి విద్యార్థికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని, విద్యామిత్ర కిట్లను కూడా పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి ఆరు ఎంజేపీ బాలికల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేశామని, దీని ద్వారా 960 మంది బాలికలకు ఉన్నత విద్య అవకాశాలు కల్పించామని వెల్లడించారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న 10 గురుకులాల ద్వారా మరో 5 వేల మంది బీసీ విద్యార్థులకు విద్యా అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు.
శాశ్వత భవనాలకు రూ.500 కోట్లు
ఎంజేపీ గురుకులాలకు శాశ్వత భవనాల నిర్మాణం కోసం సాస్సీ నిధుల ద్వారా రూ.500 కోట్లు కేటాయించామని మంత్రి తెలిపారు. గురుకులాల్లో ఖాళీ స్థలాల్లో కిచెన్ గార్డెన్లను అభివృద్ధి చేసి కూరగాయల సాగు చేపడుతున్నామని, విద్యార్థులకు సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన కల్పించే చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
జగన్ ప్రభుత్వం నిలిపివేసిన గురుకులాలను పూర్తి చేశాం
2014-19లో మంజూరు చేసిన గుడిబండ, గుండుమల, పులివెందుల, రొద్దం బీసీ గురుకులాలను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.30 కోట్లతో వాటి నిర్మాణాలు పూర్తి చేసి త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే రూ.26.71 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 62 ఎంజేపీ భవనాలకు మరమ్మతులు చేపట్టామని వెల్లడించారు.
బీసీ హాస్టళ్ల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి
రాష్ట్రంలో ప్రస్తుతం 998 బీసీ హాస్టళ్లలో 85 వేల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారని మంత్రి తెలిపారు. ఐవీఆరఎస్ సర్వేలో హాస్టళ్ల పనితీరుపై 78.02 శాతం మంది తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. గత ప్రభుత్వం ఐదేళ్లపాటు హాస్టళ్ల మరమ్మతులకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, డైట్ బిల్లులు కూడా చెల్లించలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్‌లో ఉన్న రూ.110 కోట్ల డైట్ చార్జీలను చెల్లించిందన్నారు. 104 బీసీ హాస్టళ్లలో ఎస్.ఆర్. శంకరన్ రిసోర్స్ సెంటర్లను ఏర్పాటు చేశామని, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా విద్యార్థుల హాజరు నమోదు చేసి నిధుల దుర్వినియోగాన్ని అరికడుతున్నామని తెలిపారు. 2024లో రూ.13.10 కోట్లు, 2025లో సాస్సీ నిధుల ద్వారా రూ.20 కోట్లతో మరమ్మతులు చేపట్టామని, ఈ ఏడాది మరో రూ.20 కోట్లతో భవనాల మరమ్మతులు, కొత్త నిర్మాణాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పన
డీఎంఎఫ్, సీఎసఆర్ నిధులు, ఇతర వనరుల ద్వారా దాదాపు రూ.35 కోట్లకు పైగా సమీకరించి బీసీ హాస్టళ్లలో మరమ్మతులు, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించామని మంత్రి తెలిపారు. రూ.6 కోట్లతో దోమతెరలు ఏర్పాటు చేశామని, రూ.18 కోట్లతో వంట పాత్రలు, విద్యార్థులకు అవసరమైన సామగ్రి కొనుగోలు చేశామని చెప్పారు. రూ.16.85 కోట్లతో 772 ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశామని, హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. 642 హాస్టళ్లలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఇన్వర్టర్లు ఏర్పాటు చేస్తున్నామని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు.
స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా 971 మరుగుదొడ్లు నిర్మిస్తున్నామని, రూ.4 కోట్లతో బట్టలు ఆరేసే స్టాండ్లు, వాల్ హ్యాంగర్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. 260 మంది వంట కార్మికులను నియమించామని, మరో 142 మందిని త్వరలో నియమిస్తామని, హాస్టళ్ల పరిశుభ్రత కోసం 1,291 మంది పారిశుధ్య సిబ్బందిని నియమిస్తున్నామని చెప్పారు.
బీసీ యువతకు ఉచిత కోచింగ్
బీసీ యువత ఉన్నత ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో సివిల్ సర్వీసెస్, డీఎస్సీ తదితర పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. విజయవాడ గొల్లపూడిలో ప్రత్యేక సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రతి ఏడాది వంద మందికి శిక్షణతో పాటు ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే కొందరు అభ్యర్థులు సివిల్స్ ప్రిలిమ్స్‌కు అర్హత సాధించగా, మరికొందరు ఆరఆర్‌బీ, బ్యాంకులు, ఎసఐ, గ్రూప్-2 ఉద్యోగాలు సాధించారని వెల్లడించారు.
మెగా డీఎస్సీ కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో ఉచిత శిక్షణ అందించామని, రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా 5,720 మందికి శిక్షణ ఇచ్చామని, వారిలో 280 మంది ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారని తెలిపారు. శిక్షణ పొందుతున్న ప్రతి అభ్యర్థికి రెండు నెలల పాటు నెలకు రూ.1,500 స్టైఫండ్‌తో పాటు స్టడీ మెటీరియల్ కొనుగోలుకు రూ.1,000 అందిస్తున్నామని, ప్రభుత్వం త్వరలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నందున వెంటనే ఉచిత కోచింగ్ ప్రారంభిస్తామని వెల్లడించారు. గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల కోసం విశాఖపట్నం, అనంతపురం, తిరుపతిలో మూడు ప్రత్యేక బీసీ స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఆదరణ 3.0తో స్వయం ఉపాధి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. గీత కార్మికులకు మద్యం దుకాణాలు, బార్ల కేటాయింపుల్లో 10 శాతం వాటా కల్పించామని, వడ్డెరలకు క్వారీల కేటాయింపులో 33 శాతం రిజర్వేషన్, సినరేజ్ ఫీజు, ప్రీమియంలో 50 శాతం మినహాయింపు కల్పించామని వెల్లడించారు. మత్స్యకారులకు వేట నిషేధకాలంలో ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచామని తెలిపారు. నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్‌ను 150 యూనిట్ల నుంచి 200 యూనిట్లకు పెంచడంతో పాటు దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణుల గౌరవ వేతనాన్ని రూ.20 వేల నుంచి రూ.25 వేలకు పెంచామని చెప్పారు. 93 వేల నేతన్నలకు 200 యూనిట్లు, 11 వేల మంది మరమగ్గం నేతన్నలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, ఇందుకోసం రూ.150 కోట్లు వెచ్చిస్తున్నామని వెల్లడించారు. ఆదరణ 3.0 అమలుకు రూ.1,000 కోట్లు కేటాయించామని, ఆధునిక పరికరాలు అందించి సంప్రదాయ వృత్తిదారులకు శాశ్వత ఉపాధి కల్పించనున్నామని తెలిపారు.
బీసీల రాజకీయ సాధికారతకు చర్యలు
బీసీలకు రాజ్యాధికారం చేరువ చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని మంత్రి సవిత పేర్కొన్నారు. చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్లు తెలిపారు. నామినేటెడ్ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని, స్థానిక సంస్థల్లో కూడా 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. ఇందుకోసం రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ప్రత్యేక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఇప్పటికే జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు.
త్వరలో బీసీ రక్షణ చట్టం
బీసీల ఆత్మగౌరవం, రక్షణ, సామాజిక న్యాయం కోసం “బీసీ రక్షణ చట్టం-2026” తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఇటువంటి చట్టాన్ని తీసుకువస్తున్నామని, 138 బీసీ కులాలకు ఈ చట్టం రక్షణ కల్పిస్తుందని చెప్పారు. చట్టానికి సంబంధించిన తుది ముసాయిదా సిద్ధమైందని, బీసీ మంత్రులు ఇప్పటికే మూడుసార్లు సమావేశమై చర్చించారని, అసెంబ్లీ ఆమోదం అనంతరం కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు వెల్లడించారు. ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ భవనాల నిర్మాణం చేపడుతున్నామని, ఇప్పటికే కర్నూలు, ఏలూరు, నెల్లూరులో ఒక్కోటి రూ.7 కోట్ల వ్యయంతో భవనాలు మంజూరు చేశామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.10 కోట్లతో 48 బీసీ కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.
బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.32,533 కోట్ల లబ్ధి
గత రెండేళ్లలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అమలైన వివిధ సంక్షేమ పథకాల ద్వారా 117.68 లక్షల మంది బీసీ లబ్ధిదారులకు రూ.32,533.68 కోట్లు అందజేశామని మంత్రి తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద 2024-26 మధ్య 29,16,610 మంది బీసీ లబ్ధిదారులకు రూ.25,021.88 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. దీపం-2 పథకం కింద 54,10,116 మంది బీసీ లబ్ధిదారులకు రూ.1,864.77 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద 1,17,034 మంది విద్యార్థులకు రూ.911.51 కోట్లు, తల్లికి వందనం పథకం కింద 30,38,564 మంది విద్యార్థులకు రూ.3,950.13 కోట్లు అందించినట్లు తెలిపారు. ఆటో డ్రైవర్ సేవలో భాగంగా 1,61,538 మంది ఆటో డ్రైవర్లకు రూ.242.31 కోట్లు, పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల రూపంలో 558 మంది విద్యార్థులకు రూ.72 లక్షలు, ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ పథకం ద్వారా 327 మంది విద్యార్థులకు రూ.38.95 కోట్లు, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి కింద 55 మంది విద్యార్థులకు రూ.6.92 కోట్లు అందించినట్లు చెప్పారు. మత్స్యకార సేవలో భాగంగా 1,23,973 మంది మత్స్యకారులకు రూ.496.49 కోట్లు చెల్లించామని వెల్లడించారు. బీసీల విద్య, ఉపాధి, రాజకీయ సాధికారత, సామాజిక రక్షణ కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి సవిత స్పష్టం చేశారు. బడ్జెట్ కేటాయింపుల నుంచి విద్య, హాస్టళ్లు, గురుకులాలు, స్వయం ఉపాధి, సంక్షేమ పథకాలు, రాజకీయ అవకాశాలు, బీసీ రక్షణ చట్టం వరకు ప్రతి అంశంలో బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బీసీల అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆ దిశగా మరిన్ని కార్యక్రమాలు అమలు చేస్తామని మంత్రి సవిత తెలిపారు.
















