- ఖరీఫ్-2026లో రెట్టింపునకు పైగా పెరిగిన పంటల బీమా నమోదులు
- 17.07 లక్షల హెక్టార్లకు బీమా రక్షణ.. దేశంలో ఆరో స్థానంలో ఆంధ్రప్రదేశ్
- పెండింగ్ బీమా ప్రీమియం చెల్లింపులకు రూ.3 వేల కోట్లతో కార్యాచరణ
- ప్రకృతి విపత్తుల బాధిత రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
- రైతుల సంక్షేమంపై వైసీపీ అపోహలు సృష్టించడం సరికాదు
- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో పంటల బీమా అమలు, ఇన్పుట్ సబ్సిడీపై వాస్తవాలను విస్మరించి రైతులను తప్పుదోవ పట్టించేలా వైసీపీ తప్పుడు ప్రచారం చేయటం సరికాదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రైతులకు ఆర్థిక భద్రత కల్పించడం, ప్రకృతి విపత్తుల సమయంలో ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఖరీఫ్ – 2025తో పోలిస్తే ఖరీఫ్ -2026లో పంటల బీమా నమోదులు రెట్టింపునకు పైగా పెరగడమే ప్రభుత్వ చర్యలకు నిదర్శనమన్నారు. ఖరీఫ్ -2026లో రాష్ట్రవ్యాప్తంగా సాగైన 31.01 లక్షల హెక్టార్లలో 17.07 లక్షల హెక్టార్లు, అంటే సుమారు 42 లక్షల ఎకరాలు బీమా పరిధిలోకి వచ్చాయని మంత్రి తెలిపారు. మొత్తం సాగు విస్తీర్ణంలో 55.05 శాతం బీమా కవరేజీ సాధించామని, బీమా చేసిన విస్తీర్ణం పరంగా ఆంధ్రప్రదేశ్ దేశంలో ఆరో స్థానంలో నిలిచిందని వివరించారు.
ఖరీఫ్-2025లో 18.88 లక్షలుగా ఉన్న బీమా దరఖాస్తులు ఖరీఫ్ – 2026లో 44.09 లక్షలకు పెరిగి 2.3 రెట్ల వృద్ధి నమోదైందన్నారు. రుణం పొందని రైతుల దరఖాస్తులు 2.00 లక్షల నుంచి 25.27 లక్షలకు పెరిగి 12.6 రెట్ల వృద్ధి సాధించాయని తెలిపారు. బీమా విస్తీర్ణం 7.67 లక్షల హెక్టార్ల నుంచి 17.07 లక్షల హెక్టార్లకు పెరిగి 2.2 రెట్ల వృద్ధి సాధించగా, బీమాలో చేరిన రైతుల సంఖ్య 7.43 లక్షల నుంచి 17.10 లక్షలకు పెరిగి 2.3 రెట్ల వృద్ధి నమోదైందన్నారు. స్వచ్ఛంద నమోదు విధానానికి రైతుల నుంచి లభిస్తున్న స్పందనకు ఈ గణాంకాలే నిదర్శనమని పేర్కొన్నారు. నమోదు గడువు పొడిగింపు, 2026 జూలై 29 నుంచి 31 వరకు నిర్వహించిన ప్రత్యేక ఇంటింటి ప్రచార కార్యక్రమాలు, రైతు సేవా కేంద్రాల వారీ పర్యవేక్షణ ఇందుకు దోహదపడ్డాయని వివరించారు.
గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వల్లే..
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పంటల బీమా ప్రీమియం బకాయిలు పేరుకుపోవడం వల్లే రైతులకు బీమా పరిహారం అందడంలో ఇబ్బందులు తలెత్తాయని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా చర్చించి, పెండింగ్ ప్రీమియం బకాయిలను విడతలవారీగా చెల్లించే కార్యాచరణకు ఆమోదం సాధించామని తెలిపారు. దీంతో రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు మార్గం సుగమమైందన్నారు. ఇందులో భాగంగా 2026-275 5.500 5, 2027-2865 5. 1,000 5, 2028-295 రూ.1,500 కోట్లు చొప్పున మొత్తం రూ.3,000 కోట్లు చెల్లించే ప్రతిపాదనకు భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఆమోదం తెలిపిందన్నారు. రాష్ట్ర వాటా అందిన వెంటనే పెండింగ్ క్లెయిమ్‌లను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం బీమా కంపెనీలను ఆదేశించిందని వెల్లడించారు. వైసీపీ పాలనలో చేసిన తప్పుల భారం రైతులపై పడకుండా సరిదిద్దుతున్నాం. గొడ్డలిపార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ముందుగా తన ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన బకాయిల సంగతిని గుర్తుంచుకోవాలి. మీరు సృష్టించిన సమస్యలను మేము పరిష్కరిస్తూ రైతులకు మేలు చేస్తున్నాం. గత ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకుని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
ప్రత్యేక ఎస్రో ఖాతా విధానం
ఖరీఫ్-2026 నుంచి కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేక ఎస్క్రో ఖాతా విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అంచనా ప్రీమియం వాటాలో కొంత భాగాన్ని ముందుగానే జమ చేసేందుకు ఈ ఖాతాలో మరో రూ.250 కోట్లు జమ చేశామని తెలిపారు. ఇందులో నుంచి ఖరీఫ్-2026కు రూ.83 కోట్లు, రబీ 2026-27కు రూ.44 కోట్లు అడ్వాన్స్ ప్రీమియంగా బీమా కంపెనీలకు చెల్లించామన్నారు. పంటల బీమా క్లెయిమ్‌ల లెక్కింపునకు అవసరమైన పంట కోత ప్రయోగాలు, యెస్-టెక్ ఆధారిత దిగుబడి అంచనాలు, వాటి తనిఖీ, ధ్రువీకరణ ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేసి ఖరీఫ్-2026కు సంబంధించిన అర్హమైన పరిహారాన్ని రైతులకు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. ప్రకృతి విపత్తుల వల్ల పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
2024 జూలై, ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో సంభవించిన వరదలు, భారీ వర్షాలు, 2025 మార్చిలో కురిసిన అకాల వర్షాల కారణంగా నష్టపోయిన 2.07 లక్షల మంది రైతులకు రూ.310.30 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అందించామని వెల్లడించారు. రెవెన్యూ శాఖ జీవో ఎంఎస్ నంబర్ 1, 3 07.01.2025 ఎస్ఆర్ఎఫ్/ఎన్డీఆర్ఎఫ్ ప్రమాణాల కంటే అధికంగా రాష్ట్ర సహాయ రేట్లను నిర్ణయించామని తెలిపారు. వరి, పత్తి, వేరుశనగ, చెరకు పంటలకు హెక్టారుకు సబ్సిడీని రూ.17,000 నుంచి రూ.25,000కు పెంచామని, ఎంపిక చేసిన ఇతర పంటలకు హెక్టారుకు రూ.15,000 చొప్పున పెంచిన రాష్ట్ర రేటు వర్తిస్తుందని వివరించారు. పంటల బీమా పరిహారం బీమా చేసిన విస్తీర్ణానికి వర్తిస్తుందని, అయితే ఇన్పుట్ సబ్సిడీ పొందేందుకు బీమా తప్పనిసరి కాదని స్పష్టం చేశారు. బీమా ఉన్నా లేకపోయినా 33 శాతం లేదా అంతకంటే ఎక్కువ పంట నష్టం నమోదైన రైతులకు నిబంధనల ప్రకారం గరిష్ఠంగా 2 హెక్టార్ల అర్హమైన నష్ట విస్తీర్ణం వరకు ఇన్పుట్ సబ్సిడీ వర్తిస్తుందని తెలిపారు.
క్షేత్రస్థాయి నష్టం నమోదు పూర్తి
ఖరీఫ్–2026లో కరువు, అర్జబ్, మురసు తుపాన్లు, సెప్టెంబర్ వరదలు, భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న వ్యవసాయ పంటలకు సంబంధించి క్షేత్రస్థాయి నష్టం నమోదు పూర్తయిందని మంత్రి వెల్లడించారు. నాలుగు విపత్తులకు కలిపి 14,59,225 మంది రైతులకు చెందిన 12,06,269.84 హెక్టార్లలో పంట నష్టం నమోదైందని, పెంచిన రాష్ట్ర సహాయ రేట్ల ప్రకారం రూ.2,532.89 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అవసరమని అంచనా వేసినట్లు తెలిపారు. ఖరీఫ్- 2026 కరువు కారణంగా 20 జిల్లాల్లో 9,87,231 మంది రైతులకు చెందిన 9,30,899.69 హెక్టార్లలో పంట నష్టం నమోదైందని, ఇందుకు రూ.1,863.23 కోట్లు అవసరమని వివరించారు.
అక్టోబర్‌లో సంభవించిన అర్నబ్ తుపాను కారణంగా 13 జిల్లాల్లో 3,82,866 మంది రైతులకు చెందిన 2,24,167.09 హెక్టార్లలో నష్టం నమోదైందని, రూ.559.77 కోట్లు అవసరమని తెలిపారు. నవంబర్ లో సంభవించిన మురసు తుపాను కారణంగా 9 జిల్లాల్లో 52,402 మంది రైతులకు చెందిన 32,621.68 హెక్టార్లలో పంట నష్టం నమోదైందని, ఇందుకు రూ.78.65 కోట్లు అవసరమని పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో సంభవించిన వరదలు, భారీ వర్షాల కారణంగా 13 జిల్లాల్లో 36,726 మంది రైతులకు చెందిన 18,581.38 హెక్టార్లలో నష్టం నమోదైందని, రూ.31.24 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అవసరమని వెల్లడించారు.



















