- టీమ్ స్పిరిట్‌తో పనిచేసి అంతర్జాతీయ స్థాయిలో బెంచ్‌మార్క్ సృష్టించారని ప్రశంస
విశాఖపట్నం (చైతన్య రథం): సీఐఐ భాగస్వామ్య సదస్సును విజయవంతం చేయడంలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, పోలీసు సిబ్బంది సమష్టిగా చేసిన కృషి అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. స్థానిక ఎన్నికలతోపాటు అర్నబ్, మురసు తుఫాన్ల సమయంలోనూ రాత్రింబవళ్లు పనిచేసి, ఆ వెంటనే సీఐఐ భాగస్వామ్య సదస్సును విజయవంతం చేసేందుకు అంకితభావంతో కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. సదస్సు విజయవంతం కావడానికి అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు టీమ్ స్పిరిట్‌తో పనిచేయడమే ప్రధాన కారణమని సీఎం పేర్కొన్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చిన అతిథులను ఆకట్టుకునేలా సదస్సు ప్రాంగణాన్ని తీర్చిదిద్దారని ప్రశంసించారు. సదస్సు నిర్వహణలో ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి, భవిష్యత్తులోనూ స్ఫూర్తిగా నిలిచేలా బెంచ్‌మార్క్ సృష్టించారని అభినందించారు. విశాఖ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమించిన పారిశుద్ధ్య కార్మికుల సేవలను కూడా సీఎం ప్రత్యేకంగా ప్రశంసించారు. సదస్సు నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, పోలీసు సిబ్బందిని అభినందన కార్యక్రమంలో ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాస్, డీబీవీ స్వామి, నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.




















