- 7 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు
- ఆధారాలు అందజేసిన టీడీపీ బృందం
- ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని వినతి
- ఎమ్మెల్సీ వర్ల రామయ్య
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాగించిన అరాచకాలు, విధ్వంసాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాకు నేడు తెలుగుదేశం పార్టీ ప్రతినిధి బృందం ఫిర్యాదు చేసింది. తంబళ్లపల్లె, సదుం, చౌడేపల్లి, కనిగిరి, అనంతపురం రూరల్, నెకరికల్లు ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు సాగించిన దాడులు, విధ్వంసాలు, ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎమ్మెల్సీ వర్ల రామయ్య, ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఛైర్మన్ ఎస్.రాజశేఖర్, ఏపీ బయోడైవర్సిటీ బోర్డు ఛైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ లతో కూడిన బృందం ఎన్నికల కమిషనర్‌కు సమగ్ర లిఖితపూర్వక ఫిర్యాదును అందజేసింది. పుంగనూరు, తంబళ్లపల్లె, సదుం, చౌడేపల్లి, కనిగిరి, అనంతపురం రూరల్, నెకరికల్లు తదితర ప్రాంతాల్లో నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా టీడీపీ అభ్యర్థులు, పోలీసులపై వైసీపీ గూండాలు సాగించిన దౌర్జన్యాలు,
బెదిరింపులు, వాహనాల ధ్వంసానికి సంబంధించిన స్పష్టమైన వీడియో ఆధారాలతో కూడిన పెన్ డ్రైవ్‌ను ఎన్నికల కమిషనర్‌కు సమర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్సీ వర్ల రామయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం కొద్దీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించారని, ప్రస్తుతం వారి నేతల తీరు చూస్తుంటే అది రాజకీయ పార్టీలా కాక రౌడీ మూకలా, మాఫియా గ్యాంగ్‌లా వ్యవహరిస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారిని కలిసి వైఎస్సార్సీపీ నేతలు పాల్పడుతున్న అరాచకాలు, హింసాత్మక చర్యలు, అసభ్య ప్రవర్తనలకు సంబంధించిన 7 ప్రధాన సంఘటనలపై వీడియో ఆధారాలతో కూడిన ఫిర్యాదును అందజేసినట్లు వర్ల రామయ్య తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలు బాహాటంగా మైకులు పట్టుకుని ‘రఫా రఫా నరికేస్తాం’, ‘మేక పోతుల్లా మెడలు కోస్తాం’, ‘పొడిచేస్తాం’ అంటూ మాట్లాడుతుంటే వింటున్నాం.
అసలు మీది రాజకీయ పార్టీయా లేక బందిపోటు దొంగల ముఠానా? ఒక మాఫియా గ్యాంగా? ప్రజాస్వామ్యంలో ప్రజలకు దిశా నిర్దేశం చేయాల్సిన నేతలు ఇలాంటి గూండా భాష మాట్లాడటం సభ్యసమాజం తలదించుకోవాల్సిన విషయం. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే పోలీసుల ముందే నిలబడి అహంకారంతో అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. అసభ్య పదజాలం వాడారు. అంతటితో ఆగకుండా ‘మమ్మల్ని కొట్టండి.. ఆడవారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ మేము అధికారంలోకి వచ్చాక మీ భరతం పడతాం’ అని మాట్లాడటం ఎంత ఘోరం? ఆడబిడ్డల మానప్రాణాలను గౌరవించాల్సింది పోయి, నీచమైన భాషలో మాట్లాడుతున్నవాడిని అసలు మనిషి అనవచ్చా? బుద్ధి, జ్ఞానం ఉన్నవాడెవడైనా ఇలాంటి మాటలు మాట్లాడతాడా? ‘2028లోపు మమ్మల్ని చంపేయండి.. లేకపోతే 2029లో బతికుంటే మీ కళ్లల్లోంచి రక్తం తెప్పిస్తాం’ అంటూ ఫ్యాక్షనిస్టులా, కసాయి గంగన్నలా బెదిరింపులకు దిగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా అడుగుతున్నా.. ఈ భాష మీ పార్టీ సంస్కృతా? ఈయనే మా నాయకుడు, రేపు ప్రొద్దుటూరులో ఇతనికే టికెట్ ఇస్తాం, ఇతనికే ఓటు వేయండి అని ప్రజల ముందు చెప్పే ధైర్యం మీకు ఉందా?
డ్యూటీలో ఉన్న పోలీసులపై మాజీ మంత్రి రోజా దాష్టీకం
మహిళా నాయకురాలిగా చెప్పుకునే మాజీ మంత్రి ఆర్కే రోజా గారు నిన్న విధుల్లో ఉన్న ఒక పోలీస్ అధికారి ఎదురొమ్ముపై పిడిగుద్దులు గుద్ది అసభ్యంగా మాట్లాడారు. పబ్లిక్ సర్వెంట్‌పై దాడి చేసి ఇలాంటి నీచమైన పదజాలం వాడటం క్షమించరాని నేరం. ఆ నీచమైన మాటలకు అర్థం ఏమిటో ఆమెనే స్వయంగా రాష్ట్ర ప్రజలకు వివరించాలి. ఇలాంటి ప్రవర్తన గల వారిని చూసి మహిళా లోకమే సిగ్గుతో తలదించుకుంటోంది. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందిని, పోలీసులను భయభ్రాంతులకు గురిచేస్తూ వైఎస్సార్సీపీ నేతలు సాగిస్తున్న 7 వికృత ఘటనలను ఆధారాలతో కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లాం. శాంతిభద్రతలు కాపాడే పోలీసుల మీదే పెట్రోల్ బాంబులు విసిరారు. బారికేడ్ల వద్ద ఆపుతున్న పోలీసు అధికారిని వాటర్ ట్యాంకర్‌తో తొక్కించే దుశ్చర్యకు పాల్పడ్డారు. పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి బ్యాలెట్ పేపర్లను లాక్కుని, చించి అధికారుల ముఖంపై కొట్టారు. ‘నరికేస్తాం, చంపేస్తాం’ అన్న వీరి బెదిరింపులు భరించలేక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ (ఎంపీడీవో) ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. ఈ సాక్ష్యాలను చూసి ఎన్నికల కమిషనర్ గారు అవాక్కయ్యారు. పక్కనే ఉన్న మహిళా ఐజీ రాజకుమారి గారు ఆ బూతులు వినలేక చెవులు మూసుకున్నారు. ఇలాంటి చట్టవ్యతిరేక పార్టీ గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశాం.
మొగుడ్ని కొట్టి మొగసాలకెక్కినట్లుగా వైఎస్సార్సీపీ తీరు
అధికారులపై దాడులు చేస్తూ, ప్రజలను బెదిరిస్తూ అన్ని అరాచకాలు చేసి, మళ్లీ ఆ పార్టీ నాయకులే ఎన్నికల కమిషన్ వద్దకు వచ్చి ధర్నా చేస్తుండటం విడ్డూరంగా ఉంది. ఇది అచ్చం ‘మొగుడ్ని కొట్టి మొగసాలకెక్కినట్లు’, ‘దొంగే దొంగ అని అరిచినట్లు’ ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తున్న ఎన్నికల కమిషన్‌పై వీరు నోటికొచ్చినట్లు మాట్లాడటాన్ని తీవ్రంగా గర్హిస్తున్నాం. రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా అక్కాచెల్లెమ్మలు, వైఎస్సార్సీపీ నేతల రౌడీయిజాన్ని, అసభ్యకర పోకడలను గమనించాలి. రాజకీయాల్లో భాష సంస్కారవంతంగా, ప్రజాహితంగా ఉండాలి తప్ప గూండాల మాదిరిగా ఉండకూడదు. కమిషన్ నిబంధనలను, చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వైఎస్సార్సీపీ అరాచక మూకలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.













