- నేడు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం
- 7 జిల్లాల పరిధిలోని 7 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ అమలు
- భూ రికార్డులకు ‘సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్’గా మీ భూమి-బ్లాక్ చెయిన్ ప్రాజెక్ట్
- భూ మోసాలకు చెక్… వేగవంతమైన, పారదర్శక సేవలే లక్ష్యం
అమరావతి (చైతన్య రథం): భూ రికార్డుల నిర్వహణలో సాంకేతిక విప్లవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల్లో విడివిడిగా ఉన్న భూ సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకువస్తూ, రాష్ట్రంలోని భూ రికార్డులకు సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్గా నిలిచే ‘మీభూమి-బ్లాక్ చెయిన్’ వ్యవస్థను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ ప్రారంభించనున్నారు. గురువారం మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. కర్నూలు, చిత్తూరు, బాపట్ల, కృష్ణా. తూర్పు గోదావరి, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల కలెక్టర్లు వర్చువల్ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రస్తుతం వెబ్్యండ్ ద్వారా భూ రికార్డులు డిజిటలైజ్ అయినప్పటికీ, రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల్లో సమాచారం వేర్వేరుగా ఉండటంవల్ల డేటా వ్యత్యాసాలు, రికార్డుల్లో మార్పులను గుర్తించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా మీ భూమి-బ్లాక్ చెయిన్ వ్యవస్థను రూపొందించారు. ఎన్ఐసీ ఆంధ్రప్రదేశ్, ఎన్ఐసీ బెంగళూరులోని సెంటరాఫ్ ఎక్స్టెన్స్ ఇన్ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ సంస్థలు సంయుక్తంగా హైపర్ లెడ్జర్ ఫ్యాబ్రిక్ టెక్నాలజీతో ఈ వ్యవస్థను అభివృద్ధి చేశాయి. ఈ వ్యవస్థలో ప్రతి భూ పార్సెల్కు ప్రత్యేక బ్లాక్ చెయిన్ గుర్తింపు కల్పిస్తారు. ప్రతి లావాదేవీ టాంపర్-ప్రూఫ్, సెక్యూర్టీతో జరగనుంది. భూ రికార్డుల్లో ఎలాంటి మార్పు చేయాలన్నా ప్రభుత్వం నిర్దేశించిన ఆన్లైన్ సేవల ద్వారానే ఇకపై సాధ్యమవుతుంది.
ఒక భూ పార్సెల్కు సంబంధించిన అన్ని రకాల లావాదేవీలు, వాటి ప్రతి వెర్షన్తో సహా శాశ్వతంగా నమోదయ్యేలా వ్యవస్థను తీర్చిదిద్దారు. ఇక ప్రతి లావాదేవీని ఏ అధికారి, ఎప్పుడు నిర్వహించారనే వివరాలు కూడా శాశ్వతంగా రికార్డుల్లో ఉంటాయి. రికార్డుల్లో ఏమైనా వ్యత్యాసం ఉంటే లావాదేవీ వెంటనే ఆగిపోయేలా వ్యవస్థను రూపొందించారు. రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలను ఒకే వేదికపైకి తీసుకువస్తున్న ఈ వ్యవస్థలో ప్రస్తుతం ఆటో మ్యూటేషన్, సబ్-డివిజన్, ఎక్స్టెంట్ కరెక్షన్ సహా ఎనిమిది పౌర సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. వ్యవసాయం, మత్స్యశాఖ, గనులు, పరిశ్రమలు, విద్యుత్ శాఖ, సీఆర్డీఏ, ఆర్థిక సంస్థలువంటి విభాగాలు కూడా అవసరమైన మేరకు ఈ సమాచారాన్ని వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు. మొదటి దశలో కర్నూలు, చిత్తూరు, బాపట్ల, కృష్ణా, తూర్పు గోదావరి, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల పరిధిలోని అస్పరి, పెనుమూరు, రేపల్లె, గన్నవరం, కడియం, గుమ్మలక్ష్మీపురం, కొత్తవలస మండలాల్లో ఈ పైలట్ ప్రాజెక్టుగా అమలు కానుంది. ఈ పైలట్ ప్రాజెక్టులో 89 రీ-సర్వే గ్రామాలు, 1,37,763 ల్యాండ్ పార్సెల్ మ్యాప్లు కవర్ అవుతున్నాయి.
















