- దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25.3 శాతం ఏపీకి వచ్చాయి
- పెట్టుబడిదారులను ఏపీ అభివృద్ధిలో దీర్ఘకాలిక భాగస్వాములుగా చూస్తాం
- ఏపీ వ్యాప్తంగా 23 క్లస్టర్ల అభివృద్ధి
- గుజరాత్- ఏపీ కలిసి పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు
- అహ్మదాబాద్లో సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో ఏపీ మంత్రి లోకేష్
- ఏపీలో పెట్టుబడులకు గుజరాత్ పారిశ్రామికవేత్తలకు మంత్రి పిలుపు
అహ్మదాబాద్ (చైతన్య రథం): వికసిత్ భారత్ నిర్మాణంలో ఏపీ మెయిన్ గ్రోత్ ఇంజన్గా నిలవాలని కోరుకుంటోందని, ఇందుకు పెట్టుబడిదారులు మద్దతుగా నిలవాలని ఏపీ విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ కోరారు. ఏపీఈడీబీ ఆధ్వర్యంలో అహ్మదాబాద్ లో జరిగిన సీఐఐ (కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. “అహ్మదాబాద్కు రావడం ఎంతో ఆనందంగా ఉంది. దేశ ఆర్థిక ప్రగతిలో గుజరాత్కు ప్రత్యేకస్థానం ఉంది. పారిశ్రామికవేత్తల స్ఫూర్తి, మౌలిక సదుపాయాలు, విధానాలు, వాటి అమలుతో ఎలాంటి ఫలితాలు సాధించవచ్చో గుజరాత్ నిరూపించింది. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ అభివృద్ధి ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. దేశానికి గొప్ప ప్రధానిని అందించిన గుజరాత్ ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వైబ్రెంట్ గుజరాత్ మోడల్ పెట్టుబడులు, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు ఒక ప్రధాన వేదికగా ఎదిగింది. 2047 నాటికి వికసిత్ భారత్ను నిర్మించాలని ప్రధాని లక్ష్యంగా పెట్టుకున్నారు. వికసిత్ భారత్ ప్రయాణంలో ఏపీ కూడా ప్రధాన గ్రోత్ ఇంజన్ గా నిలవాలని కోరుకుంటోంది. అందుకే ఈ రోజు ఇక్కడికి వచ్చాను. అభివృద్ధి దిశగా ఏపీ శరవేగంగా దూసుకెళ్తాంది. ఈ ప్రయాణంలో గుజరాత్ పారిశ్రామిక రంగం భాగస్వామి కావాలని మేం కోరుకుంటున్నాం” అని పిలుపునిచ్చారు.
దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25.3 శాతం ఏపీకి వచ్చాయి
“ఏపీ అభివృద్ధి విషయంలో మాకో స్పష్టమైన లక్ష్యముంది. అత్యుత్తమ పెట్టుబడులు, సాంకేతికతలు, కంపెనీలను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అవి కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా గ్రౌండింగ్ అయ్యేలా చూస్తున్నాం. సీఎం చంద్రబాబు దార్శనిక నేత. ముందుచూపుతో ఆలోచించి, నిర్ణయాలు వేగంగా అమలు చేయాలని ఎప్పుడూ విశ్వసిస్తారు. అదే ఆలోచనా విధానం మా పెట్టుబడుల వ్యూహానికి మార్గదర్శకంగా ఉంది. 25మంది మంత్రుల్లో 17మంది కొత్తవారు. చంద్రబాబు కేబినెట్లో నేను సీనియర్ మంత్రిని. ఇది నా రెండో టర్మ్. అభివృద్ధి విషయంలో మా అందరిలో కసి ఉంది. ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ఏపీ ప్రత్యేకత. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లోనే దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25.3 శాతం ఏపీకి వచ్చాయి. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ప్రైవేట్ రంగాన్ని మించి ప్రభుత్వం కూడా వేగంగా పనిచేయగలదని మేం నమ్ముతున్నాం. ఇక్కడ వేదికపై ఉన్న పారిశ్రామికవేత్తలు తమ కంపెనీలను ఎలా అభివృద్ధి చేశారో చూస్తే నిజంగా అద్భుతంగా ఉంది. అదే విధంగా ప్రభుత్వం కూడా మరింత వేగంగా పనిచేయాలి. ప్రభుత్వం వేగంగా ఆలోచించాలి, పరిస్థితులకు అనుగుణంగా చురుగ్గా నిర్ణయాలు తీసుకోవాలి” అని మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు. పెట్టుబడిదారులు విధానాల్లో స్పష్టత, స్థిరత్వం కోరుకుంటున్నారు. “ఈ రోజుల్లో పెట్టుబడిదారులు నమ్మకమైన భాగస్వాముల కోసం చూస్తున్నారు. ఆ భాగస్వాముల్లో ప్రభుత్వం కూడా ఎంతో ముఖ్యమైనది.
‘
పెట్టుబడిదారులు కేవలం ల్యాండ్ కోసం మాత్రమే చూడటం లేదు. వారికి నమ్మకమైన విద్యుత్, మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు కావాలి. విధానాల్లో స్పష్టత, స్థిరత్వం కావాలి. స్పీడ్ కావాలి. పెట్టుబడి ప్రకటన తర్వాత కూడా తమతో కలిసి పనిచేసే ప్రభుత్వం కావాలి. అలాంటి విధానాలను మేం తీసుకువస్తున్నాం. పెట్టుబడులను ఆకర్షించడం మొదటి అడుగు మాత్రమే. పెట్టుబడుల గ్రౌండింగే అసలు పరీక్ష, గూగుల్ ఏఐ హబ్ పెట్టుబడి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. విశాఖలో గూగుల్ చేపడుతున్న 15 బిలియన్ డాలర్ల ఏఐ హబ్, డేటా సెంటర్ పెట్టుబడి మేం సాధించిన అతిపెద్ద పెట్టుబడుల్లో ఒకటి. ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్, ఇతర భారీ ప్రాజెక్టుల విషయంలోనూ అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేశాయి” అని లోకేష్ వివరించారు.
ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది
గూగుల్ను 13 నెలల్లోనే రాష్ట్రానికి తీసుకువచ్చాం. కేంద్రంతో కలిసి అవసరమైన, విధానపరమైన మార్పులు తీసుకువచ్చాం. గుజరాత్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే.. ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. ఏపీలో నమో అంటే నరేంద్ర మోదీతో పాటు నాయుడు-మోదీజీ జోడీ అని అర్థం. ఇద్దరూ ఎంతో సమర్థంగా పనిచేస్తున్నారు. దేశ ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం మేం కలిసి పనిచేస్తున్నాం. అదే గణనీయమైన మార్పును తీసుకొస్తోంది. మరో ఉదాహరణ ఆర్సెలార్ మిట్టల్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్. ఈ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం సుమారు 17 మిలియన్ మెట్రిక్ టన్నులు. పెట్టుబడి దాదాపు 12 బిలియన్ డాలర్లకు పైగా ఉండనుంది. ఆదిత్య మిట్టల్తో మొదటిసారి జూమ్ ద్వారా మాట్లాడినప్పటి నుంచి శంకుస్థాపన జరిగే వరకు కేవలం 17 నెలలు పట్టింది. ఇందులో పర్యావరణ అనుమతులు, సుమారు 3వేల ఎకరాల భూమి, 660 కుటుంబాల పునరావాసం, ఆర్ అండ్ ఆర్ వంటి అంశాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎలాంటి సమస్యలు లేకుండా పూర్తి చేశాం. ప్రాజెక్టును 2029 మొదటి త్రైమాసికం నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏపీ స్పీడ్కు ఇది నిదర్శనం. పెట్టుబడిదారులకు అవసరమైన అన్ని సేవలు వేగవంతంగా అందించడం జరుగుతుంది” అని వివరించారు.
“ఎవరైనా పారిశ్రామికవేత్త ఏదైనా సమస్యతో వచ్చినప్పుడు.. దానిని వ్యక్తిగత సమస్యగా చూడకుండా వ్యవస్థాగత సమస్యగా పరిగణిస్తా. అందుకే నన్ను కొంతమంది ఆంధ్రప్రదేశ్కు డోలో-650 అని సరదాగా అంటారు. మీకు తలనొప్పి వచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకుంటారు, లేకపోతే మరిచిపోతారు. కానీ పెట్టుబడిదారుడికి ఏదైనా సమస్య లేదా సవాల్ ఎదురైతే.. అది కేవలం అతని సమస్య కాదు. ఆ సమస్యకు వ్యవస్థాగత పరిష్కారం చూపాలి అనేది మా విధానం. మా యువ ఐఏఎస్ అధికారులు విధాన నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉన్న అధికారులతో కలిసి పనిచేస్తున్నారు. ఒక పారిశ్రామికవేత్తకు ఒక సమస్య ఉంటే.. ఇలాంటి సమస్య ఇంకెవరికి రాకుండా వ్యవస్థలో ఏం మార్చాలి అని వెనక్కి వెళ్లి పరిశీలిస్తాం. ఇదే ఉత్సాహంతో మేము పనిచేస్తున్నాం” అని మంత్రి లోకేష్ ఉత్సాహంగా ప్రకటించారు.
పెట్టుబడిదారులను ఏపీ అభివృద్ధిలో దీర్ఘకాలిక భాగస్వాములుగా చూస్తాం
“మూడు ‘ఎస్’లు.. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ ఏపీ ప్రత్యేకతలు. పెట్టుబడిదారులు ప్రభుత్వం వద్దకు అనుమతుల కోసం వచ్చేవారిగా కాకుండా.. మేం వారిని ఏపీ అభివృద్ధిలో దీర్ఘకాలిక భాగస్వామిగా చూస్తాం. సమస్యలు ఏవైనా ఉంటే కలిసి పరిష్కరిస్తాం. పెట్టుబడిదారులు జాయింట్ వెంచర్ భాగస్వాముల కోసం చూస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ రంగం ఇందుకు మంచి ఉదాహరణ. డిఫెన్స్ రంగంలో కూడా మేం ఇలాంటి విజయాలను సాధించాం. ఈ రోజు అందరూ స్కైరూట్ కంపెనీ గురించి మాట్లాడుతున్నారు. మేం వారిని ఏడాది క్రితమే గుర్తించి మా స్పేస్ సిటీలో 300 ఎకరాల భూమిని కేటాయించాం. మరో ఉదాహరణ సాగర్ డిఫెన్స్ కంపెనీ. రక్షణ రంగంలో భారతదేశం గర్వించదగిన సంస్థల్లో ఇదొకటి. ఫిషింగ్ హార్బర్లో 150 మీటర్ల ఫ్రంటేజ్ను వారికిచ్చాం. వారు స్థానిక మత్స్యకారులతో కలిసి పనిచేస్తూ మొత్తం ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేస్తున్నారు. వచ్చే ఏడాది చివరినాటికి సముద్ర డ్రోన్లను ఏపీలోనే తయారు చేయబోతున్నారు. వారు మా రాష్ట్రానికి వచ్చినప్పుడు కంపెనీ విలువ సుమారు రూ.3వేల కోట్లు. ఇప్పుడు రూ.23వేల కోట్ల వాల్యుయేషన్ తో పెట్టుబడులు సమీకరించారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ మీ పెట్టుబడులకు ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని అందిస్తుంది” అని లోకేష్ వివరించారు.
ఏపీ అభివృద్ధిలో ఇంధన రంగ ప్రాముఖ్యత
“ఏపీ అభివృద్ధి ప్రయాణంలో ఇంధన రంగం ప్రధానమైంది. ఏపీలో 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఏపీలో 23 రంగాల వారీగా ప్రత్యేక క్లస్టర్ల అభివృద్ధికి కృషిచేస్తున్నాం. క్లస్టర్లలో ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, గ్రీన్ ఎనర్జీ, ఫార్మాస్యూటికల్స్, మెడికల్ డివైసెస్, స్టీల్, డ్రోన్లు, ఆక్వాకల్చర్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ తదితర అభివృద్ధి చెందుతున్న రంగాలున్నాయి. వ్యవసాయం కూడా ముఖ్యమైన రంగమే. ఆక్వాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇండియన్ హార్టికల్చర్ మిషన్లో లక్ష కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఒక కంపెనీని మాత్రమే ఏపీకి తీసుకురావడం మా లక్ష్యం కాదు. మొత్తం ఎకో సిస్టమ్ను నిర్మించడమే లక్ష్యం. ఈ క్లస్టర్లలో భాగస్వాములై ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో భాగం కావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం” అని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.
విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లను అభివృద్ధి చేస్తాం
హైదరాబాద్ ఏవిధంగా అభివృద్ధి సాధించిందో మనం చూశాం. చంద్రబాబు ఒక విషయాన్ని నమ్మితే దానిని అమలుచేసి చూపిస్తారు. హైదరాబాద్ను ఏవిధంగా అభివృద్ధి చేశారో అమరావతిలో కూడా దానిని కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నారు. హైదరాబాద్ ఫస్ట్ చాప్టర్. అమరావతి సెకెండ్ చాప్టర్. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లను అభివృద్ధి చేస్తాం. ప్రతి ప్రాంతానికి ప్రత్యేక రంగాలపై దృష్టి ఉంటుంది. క్లస్టర్ ఆధారిత అభివృద్ధి మా ప్రధాన విధానం. వ్యవసాయం నుంచి క్వాంటం టెక్నాలజీ వరకు ప్రతి రంగాన్ని గుర్తించి.. వాటిపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం” అని వివరించారు.
గుజరాత్- ఏపీ కలిసి పనిచేయాలి
గుజరాత్లో వ్యాపారాలను నిర్మించి, దేశమంతటా విస్తరించి ప్రపంచస్థాయిలో పోటీ పడుతున్న అనేక కంపెనీలున్నాయి. గుజరాత్ లేదా ఏపీలో ఏదోక రాష్ట్రాన్ని ఎంచుకోవాలని మేం మిమ్మల్ని కోరడం లేదు. రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయగలవని విశ్వసిస్తున్నా. తూర్పు భారతదేశానికి వ్యూహాత్మక గేట్వేగా, మీ తదుపరి అభివృద్ధి వేదికగా ఏపీని వినియోగించుకోవాలి. గుజరాత్, ఏపీ కలిసి పనిచేస్తే అద్భుతాలు సృష్టించగలవని నమ్ముతున్నా. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని గుజరాత్ పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. నవంబర్ లో పార్టనర్ షిప్ సమ్మిట్ ఉంది. ప్రస్తుతం 200 మిలియన్ డాలర్లు ఉన్న ఏపీ ఆర్థిక వ్యవస్థ.. 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 15శాతం వృద్ధిరేటు లక్ష్యంగా పెట్టుకున్నాం. మీరందరూ ఏపీకి రావాలని ఆహ్వానిస్తున్నా. వచ్చే రెండు నెలల్లోనే మనందరం కలిసి అద్భుతాలు సృష్టిద్దాం” అని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐఐ గుజరాత్ స్టేట్ కౌన్సిల్ ఛైర్మన్, సింఫనీ లిమిటెడ్ ఎండీ అచల్ బకేరీ, ఏపీఐఐసీ లిమిటెడ్ వైస్ చైర్మన్, ఎండీ ఏఎస్ దినేష్ కుమార్, రెన్యూ స్టేట్ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ త్రిభువన్ దర్శాన. రస్సా గ్రూప్ చెర్మన్ పిరుజ్ కంభట. ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (నార్త్) సి యశ్వంత్ కుమార్ రెడ్డి, గుజరాత్కు చెందిన పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.














