- సచివాలయ ఉద్యోగాల పేరిట దారుణ మోసాలు
- బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్‌కుమార్
మంగళగిరి (చైతన్య రథం): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019లో జరిగిన సచివాలయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని, అర్హులైన లక్షలాది నిరుద్యోగుల పొట్టగొట్టి తమ సొంత కేడర్‌కు ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్‌కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నైతికత, ప్రతిభ గురించి మాట్లాడే కనీస అర్హత మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి లేదని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల కలలను సాకారం చేస్తూ అత్యంత పారదర్శకంగా మెగా డీఎస్సీ పరీక్షలను నిర్వహిస్తే, ఓర్వలేక రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం బురద జల్లే ప్రెస్‌మీట్లు పెడుతున్నారని మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వం జాతీయస్థాయి అత్యున్నత ప్రమాణాలతో కూడిన టీసీఎస్ ఐయాన్ కంప్యూటర్ ఆధారిత పరీక్షా వేదిక ద్వారా డీఎస్సీని పూర్తి నిష్పక్షపాతంగా నిర్వహించిందని విజయ్‌కుమార్ స్పష్టం చేశారు. ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా, 42 వేల ప్రశ్నలతో రూపొందించిన పూర్తి రాండమైజ్డ్ క్వశ్చన్ బ్యాంక్, అధునాతన ఫేషియల్ ఐడీ వెరిఫికేషన్, ఎన్‌క్రిప్టెడ్ డిజిటల్ సెక్యూరిటీని ఉపయోగించి, మొత్తం 89 సెషన్లలో ఒక్క ప్రశ్నపత్రం కూడా లీక్ కాకుండా కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను అమలు చేశామన్నారు. అభ్యర్థుల అభ్యంతరాల పరిష్కారం కోసం ప్రత్యేకంగా మూడంచెల గ్రీవెన్స్ మెకానిజం ఏర్పాటు చేసి, 33 వేలకు పైగా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి నిష్పక్షపాతంగా పరిష్కరించామని గుర్తు చేశారు. ఎస్సీఈఆర్‌టీలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిగా ఉంటూ, ఆ విషయాన్ని దాచిపెట్టి నిబంధనలకు విరుద్ధంగా పరీక్ష రాసిన పురమా నవీన్‌కు టాప్ ర్యాంక్ వచ్చినప్పటికీ, రూల్స్ ఉల్లంఘించినందుకు మా ప్రభుత్వం అతనికి ఉద్యోగం ఇవ్వలేదని, పరీక్షల నిర్వహణతో, పరీక్షా విభాగపు మౌలిక సదుపాయాలతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న ఇన్సైడర్లకు ఉద్యోగాలు ఇవ్వకూడదనే కఠిన సూత్రానికి, అడ్మినిస్ట్రేటివ్ మొరాలిటీకి కట్టుబడిన మచ్చలేని చరిత్ర కూటమి ప్రభుత్వానిదని స్పష్టం చేశారు.
మరి 2019 సచివాలయ నియామకాలపై ఎలాంటి ఆరోపణలు లేవని, అంతా సక్రమంగానే జరిగిందని డబ్బా మాటలు చెప్పుకుంటున్న జగన్, నాటి వ్యవస్థీకృత కుంభకోణంపై వచ్చిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. ఆనాడు అత్యంత కఠినంగా, యూపీఎస్సీ సివిల్స్‌కంటే క్లిష్టంగా ఉందన్న పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-5 పరీక్షలో 150 మార్కులకుగాను 112.25 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్‌గా నిలిచిన జి అనితమ్మ (అనితారెడ్డి), ఏపీపీఎస్సీ ఆఫీసులోని ఎగ్జామ్ సెక్షన్‌లో ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ కంప్యూటర్ టైపిస్ట్ కాదా? అని ప్రశ్నించారు. రహస్య ప్రశ్నపత్రాలను హ్యాండిల్ చేసే యాక్సెస్ ఉన్న ఆమెకు ఫస్ట్ ర్యాంక్ వస్తే పొగడ్తలతో ముంచెత్తి నియామక పత్రమిచ్చిన జగన్‌కు, నేడు నవీన్ విషయంలో ఎందుకు అంత ధర్మాగ్రహం వస్తోందని నిలదీశారు. అలాగే ఆర్ట్స్ (కేటగిరీ-1), సైన్స్ (కేటగిరీ-2)లాంటి రెండు పరస్పర విరుద్ధమైన సాంకేతిక, హ్యూమానిటీస్ విభాగాల్లో దొడ్డ వెంకట్‌రెడ్డి అనే ఒకే అభ్యర్థికి టాప్ ర్యాంకులు ఎలా వచ్చాయో? అతను ఏపీపీఎస్సీ కాన్ఫిడెన్షియల్ డేటా విభాగం సంరక్షక డైరెక్టర్ మల్లికార్జున్ రెడ్డికి సాక్షాత్తు తోడబుట్టిన తమ్ముడు కాదా? అని కడిగిపారేశారు. నాడు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ “దాదాపు 90శాతం ఉద్యోగాలు మన కేడర్‌కే వచ్చేసాయి” అని ప్రకటించడం, అర్హులైన నిరుద్యోగుల శ్రమను వంచించి, ప్రభుత్వ నియామకాలను తమ పార్టీ సంక్షేమ పథకంగా మార్చుకున్న దానికి సజీవ సాక్ష్యం కాదా? అని నిప్పులు చెరిగారు.
నాడు ప్రశ్నపత్రాలు, డిజిటల్ కీలను హ్యాండిల్ చేసే ఇన్‌సైడర్ల నెట్‌వర్క్, వారి బంధువులు 111కు పైగా మార్కులు సాధిస్తుంటే, మరోపక్క లక్షలాది సాధారణ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కనీస అర్హత మార్కులు (40 శాతం, 35శాతం, 30శాతం) కూడా సాధించలేకపోయారని విజయ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల డిజిటల్ అసిస్టెంట్, యానిమల్ హస్బెండ్రీ, అగ్రికల్చర్, హార్టికల్చర్ పోస్టుల్లో 70 శాతం నుండి 80 శాతం ఓపెన్ సీట్లలో స్థానికంగా అర్హత సాధించిన అభ్యర్థులే లేక 30 వేలకు పైగా సాంకేతిక పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయని, ఆ ఘోర వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి రాత్రికి రాత్రే జీవో నెంబర్ 166ను తీసుకొచ్చి, ఏకంగా 15 గ్రేస్ మార్కులను ఫ్రీగా కలిపి, పరీక్షతో సంబంధం లేకుండా అర్హతలేని వారిని వెనుక దారిలో చొప్పించిన ఘనత జగన్‌మోహన్ రెడ్డిదని దుయ్యబట్టారు. పరీక్షకు ముందే డిజిటల్ కీలను లీక్ చేసిన అప్పటి రిటైర్డ్ పరిపాలన అధికారిని మచ్చ రాకుండా కాపాడటమే కాకుండా, నాటి అక్రమాలపై ఏపీపీఎస్సీ స్కానింగ్ సర్వర్లు, కాంట్రాక్ట్ ఆపరేటర్ల కంప్యూటర్ ఐపీ లాగిన్ డేటాపై ఎలాంటి స్వతంత్ర ఫోరెన్సిక్ ఆడిట్ జరపకుండా, ఓఎంఆర్ లాగ్స్ ధృవీకరించకుండానే కోర్టులో పిటిషన్లను మేనేజ్ చేసి నియామక ప్రక్రియను ముగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లక్షలాది అభ్యర్థులు విఫలమైన చోట, ఏపీపీఎస్సీ ఇన్‌సైడర్లు,వారి తోడికోడళ్లు, బంధువులు టాపర్లుగా నిలవడం వెనుక సర్వర్ల వెనుక సాగిన అంతర్గత సర్దుబాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. ఐదేళ్ల పాలనలో నిరుద్యోగులను మోసం చేసి ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వని వైసీపీ నేతలు, నేడు రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే నియామకాలను అత్యంత పారదర్శకంగా చేస్తున్న ఐటీ, విద్యాశాఖ మంత్రి లోకేష్‌పై బురద జల్లడం హాస్యాస్పదమన్నారు. ఏపీపీఎస్సీ, గ్రూప్-1 నియామకాలను హైలాండ్‌లాంటి ప్రైవేట్ రిసార్టులలో కూర్చొని అనర్హుల చేత ప్రశ్నపత్రాలు దిద్దించి బ్రష్టుపట్టించిన చరిత్ర జగన్‌దైతే, అధునాతన కంప్యూటరీకృత పారదర్శకతతో నిరుద్యోగులకు భరోసా ఇస్తున్న చరిత్ర కూటమి ప్రభుత్వానిదని, ఈ తేడాను ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాలని విజయ్‌కుమార్ కోరారు.













