అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) హరీష్ కుమార్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికల్లో చట్టబద్ధంగా పాల్గొనే ప్రతి అభ్యర్థి, ఓటరు హక్కుకు పూర్తి రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు. మూక హింసకు పాల్పడినా, అభ్యర్థులను బెదిరించినా, చట్టబద్ధమైన ఆదేశాలను ఉల్లంఘించినా కఠిన చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయం శుక్రవారం ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 8 జిల్లాల్లో చోటుచేసుకున్న 14 ఘర్షణ ఘటనలపై కేసులు నమోదు చేసినట్టు డీజీపీ తెలిపారు. ఇందులో పల్నాడు, కడప జిల్లాల్లో అత్యధికంగా మూడు చొప్పున ఘర్షణలు జరగ్గా, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో రెండు చొప్పున, తిరుపతి, కర్నూలు, అన్నమయ్య, మార్కాపురం జిల్లాల్లో ఒక్కో ఘటన నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఇప్పటివరకు 17 మంది నిందితులను గుర్తించినట్టు వివరించారు. ‘రాజకీయ పలుకుబడి ఉన్నంత మాత్రాన చట్టం నుంచి ఎవరికీ రక్షణ ఉండదు.
ఘటనాస్థలిలో నేరుగా లేకపోయినా.. వెనకుండి హింసను ప్రేరేపించే రాజకీయ నేతలపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని డీజీపీ హెచ్చరించారు. నామినేషన్ కేంద్రాలకు అభ్యర్థులు సురక్షితంగా చేరుకునేలా పోలీసు యంత్రాంగం రక్షణ కల్పిస్తుందన్నారు. అల్లరిమూకలను గుర్తించేందుకు సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ పుటేజీలను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ముందస్తుగా బైండోవర్ చర్యలు చేపడుతున్నామని, దీనివల్ల పోటీ చేసే అభ్యర్థుల అర్హతకు ఎలాంటి భంగం కలగదని స్పష్టం చేశారు. ప్రచార కార్యక్రమాలు, ర్యాలీలు తప్పనిసరిగా ముందస్తు అనుమతులకు లోబడే జరగాలని ఆదేశించారు. ‘పోలీసులు సంయమనాన్ని బలహీనతగా భావించవద్దు.. ఎన్నికలను నిష్పాక్షికంగా, అత్యంత కఠినంగా నిర్వహిస్తాం” అని డీజీపీ తేల్చి చెప్పారు.














